సంకెళ్లపై సమరం

People Protest Against Chevireddy Bhaskar Reddy Arrest - Sakshi

చెవిరెడ్డి అరెస్ట్‌తో ఎగసిన నిరసన జ్వాలలు

పోలీసు కార్యాలయాన్ని ముట్టడించిన వందలాది మంది మహిళలు

ఎక్కడికక్కడ ధర్నాలు..రాస్తారోకోలు

పక్క జిల్లాల నుంచి పోలీసు బలగాలు

చిత్తూరు, తిరుపతి రూరల్‌: చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అక్రమ అరెస్ట్‌తో జిల్లా అట్టుడికింది. ఎక్కడికక్కడ ఏ మండలానికి ఆ మండలంలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. నిరసనలు, ధర్నాలు, ఆందోళనలతో జిల్లా దద్దరిల్లింది. నిరసనల ధాటికి పోలీసులు పక్క జిల్లాల నుంచి అదనపు బలగాలను తెప్పించుకున్నారు. సర్వే పేరుతో పల్లెల్లో ఓట్ల తొలగింపునకు పాల్పడే వారిని స్థానికులు పోలీసులకు పట్టించటం, ఆపై అధికార పార్టీ ఒత్తిడితో పోలీసులు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను, ప్రజాస్వామ్యవాదులను అరెస్ట్‌ చేసి చిత్తూరుకు తరలించడం తెలిసిందే. వారితో మాట్లాడడానికి చిత్తూరు ఎస్పీ కార్యాలయానికి వెళ్లిన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని అర్ధరాత్రి అక్కడే అరెస్ట్‌ చేసి, జిల్లాతో పాటు తమిళనాడు రాష్ట్రంలో తిప్పి వేధించారు. తెల్లవారేసరికి ఈ విషయం జిల్లావ్యాప్తంగా దావానలంలా వ్యాప్తించింది. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే చెవిరెడ్డిని పోలీసులు అక్రమంగా అరెస్ట్‌ చేసిన విషయం తెలుసుకుని జిల్లావ్యాప్తంగా నిరసనలకు ఉపక్రమించారు. స్వచ్ఛందంగా వేలాది మంది రోడ్లపైకి వచ్చారు.

ఉలిక్కిపడిన పోలీసులు..పక్క జిల్లాల నుంచి అదనపు బలగాలు
చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని అక్రమంగా అరెస్ట్‌ చేసిన పోలీసులకు గట్టి ప్రతిఘటనే ఎదురైంది. జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులు రోడ్డుపైకి వచ్చి ఆందోళనకు దిగారు. జిల్లా కేంద్రం చిత్తూరుకు చుట్టు ఉన్న పోలీసు స్టేషన్లకు సమీపంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగటంతో పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇంత పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తడంతో నెల్లూరు, కడప జిల్లాల నుంచి అదనపు బలగాలను రప్పించారు. వారి సహయంతో చిత్తూరులో మహిళలను, పలు చోట్ల కార్యకర్తలను అరెస్ట్‌ చేసి యాదమర్రి, పాకాల, చంద్రగిరి పోలీసుస్టేషన్లకు తరలించారు.

ఎమ్మెల్యే చెవిరెడ్డి అక్రమ అరెస్టుకు నిరసనగా పలమనేరు నియోజకవర్గం గంగవరం సర్కిల్లో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులు ఆందోళనకు దిగారు.
పూతలపట్టు నియోజకవర్గం ఐరాలలో వైఎస్సార్‌ సేవాదళ్‌ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు రాజ్యాంగాన్ని కాపాడాలని అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందచేశారు.
చిత్తూరు పోలీసు కార్యాలయం ఎదుట ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సతీమణి లక్ష్మి ఆ«ధ్వర్యంలో వందలాది మంది మహిళలు ఆందోళనకు దిగారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కుప్పంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే అక్రమ అరెస్టుకు నిరసనగా రాస్తారోకో చేశారు.
సత్యవేడులో పోలీసుస్టేషన్‌ ఎదుట చెవిరెడ్డి అభిమానులు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి.పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు అదనపు బలగాలను రప్పించారు.
తిరుపతి రూరల్‌ మండలం ఎంఆర్‌పల్లి పోలీసు స్టేషన్‌ సర్కిల్లో వైఎస్సార్‌సీపీ శ్రేణులు రాస్తారోకో చేశాయి. అక్రమ అరెస్టులకు నిరసనగా నినదించారు. సీఎం డౌన్‌ డౌన్‌....పోలీసు జులుం నశించాలని ఆందోళన చేశారు.
ఎర్రావారిపాళెం మండలంలో ఎలమంద, నెరబైలు, ఎర్రావారిపాళెం సర్కిల్లో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. రాకపోకలను స్తంభింపచేశారు. అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ పెద్ద ఎత్తున స్లోగన్లు ఇచ్చారు.
చంద్రగిరి క్లాక్‌ టవర్‌ సెంటర్‌లో వైఎస్సార్‌సీపీ నాయకులు నిరాహార దీక్షకు దిగారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ దీక్ష కొనసాగింది. అంతకు ముందే తమ నాయకుడి అరెస్ట్‌కు నిరసనగా తెల్లవారుజామున జాతీయ రహదారిపై రాస్తారోకోకు దిగారు. వాహనాల రాకపోకలను స్తంభింపచేశారు. రంగంపేట, అగరాలలో పార్టీ శ్రేణులు రోడ్డుపై నిరసనకు దిగాయి.
రామచంద్రాపురం సర్కిల్లో పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. నడిరోడ్డుపై బైఠాయించి ఎమ్మెల్యే చెవిరెడ్డి అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ నినాదాలు చేశారు.
పాకాల మండలంలో జాతీయ రహదారిపై పార్టీ శ్రేణులు రాస్తారోకో చేశాయి. గంటల పాటు సాగిన ఈ ఆందోళనలో అ«ధికార పార్టీ అరాచకాలను ఎండగడుతూ నిరసన వ్యక్తం చేశారు. మహిళలు పెద్ద సంఖ్యలో ఈ ఆందోళనలో పాల్గొన్నారు.
చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేట, చిన్నగొట్టిగల్లులో పార్టీ శ్రేణులు తిరుపతి–మదనపల్లి జాతీయ రహదారిపై ఆందోళనకు దిగాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top