జైత్రయాత్ర

People Participate In Praja Sankalpa Yatra - Sakshi

మహానగరిలో జనప్రవాహం

జననేతకు అడుగడుగునా బ్రహ్మరథం

‘ఉత్తరం’ నుంచి ‘తూర్పు’లో అడుగిడిన సంకల్పయాత్ర

ప్రజా సంకల్పయాత్ర బృందం

సాక్షి, విశాఖపట్నం: జననేత వెంట నగరం నడిచింది. మహానగరం నడిబొడ్డున జన ప్రవాహం పరవళ్లు తొక్కింది. అభిమానం పూలవర్షమై కురిసింది. దారిపొడవునా జగన్నినాదం మార్మోగింది. సంకల్పధీరుడికి సలాం కొట్టింది. నీవే మా భవిత అంటూ నినదించింది. తమ కష్టాలను చెప్పుకుంటూ ఊరట పొందింది. ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర 259వ రోజు సోమవారం విశాఖ నగరం ‘ఉత్తరం’లో మొదలై వెల్లువలా సాగుతూ ‘దక్షిణం’ మీదుగా తూర్పు నియోజకవర్గానికి చేరుకుంది. ఉదయం తాటిచెట్లపాలెం వద్ద 80 అడుగుల రోడ్డులో మొదలైన వైఎస్‌ జగన్‌ పాదయాత్ర అక్కయ్యపాలెం శ్రీనివాసనగర్, అక్కయ్యపాలెం, సంఘం ఆఫీస్‌ జంక్షన్, దాలిరాజు సూపర్‌మార్కెట్‌ కూడలి, దొండపర్తి జంక్షన్, ఆర్టీసీ కాంప్లెక్స్, సంపత్‌ వినాయగర్‌ ఆలయం, టైకూన్‌ సెంటర్, సిరిపురం జంక్షన్, చినవాల్తేర్‌ మెయిన్‌ రోడ్డు వరకూ సాగింది. దారిపొడవునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అడుగుడుగునా సమస్యలు చెప్పుకున్నారు.

జగనన్నా.. మా కష్టాలు చూడన్న
అన్నా మేం డీ ఫార్మసీ కోర్సు ఆరేళ్లు చదవినా చివరకు కన్నీళ్లే మిగులుతున్నాయని విద్యార్థులు వాపోయారు. ఇంత కష్టపడి చదివినా ప్రభుత్వ ఉద్యోగాలు లేక చాలీచాలని జీతాలతో ప్రవేటుగా పనిచేసుకుంటున్నామని.. అధికారంలోకి వచ్చాక ప్రతి ప్రభుత్వ/ప్రవేటు ఆస్పత్రిలో ఒక క్లినికల్‌ ఫార్మసిస్ట్‌ను ఏర్పాటు చేయాలని..104లో తమ సేవలు వినియోగించుకునేలా చూడాలని ప్రతిపక్షనేత వద్ద మొరపెట్టుకున్నారు. అన్నా మిమ్మల్ని అక్రమంగా జైల్లో పెట్టినపుడు వారం రోజులు అన్నం సహించలేదన్న..మీరు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం బాగుపడుతుందని తాటిచెట్లపాలేనికి చెందిన అరుణ అనే దివ్యాంగురాలు అభిమానాన్ని చాటుకుంది. మీరు అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ప్రవేటు విద్యావిధానాన్ని రద్దు చేయాలని, ప్రతి పది కిలోమీటర్లకు ఒక మహిళా పోలీస్‌స్టేషన్‌ ఏర్పాటు చేయాలని నాగమణి అనే ప్రవేటు ఉద్యోగిని జగన్‌ను కోరారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక చిత్తూరు పాల డెయిరీని మూసేశారు, దానిమీద ఆధారపడి ఉన్న 50 వేల మంది రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందని, మా అందరి జీవితాల్లో వెలుగులు నింపాలంటే ఆ డెయిరీని మీరు అధికారంలోకి వచ్చాక తెరిపించాలన్నా అంటూ ఆ జిల్లాకు చెందిన కె.కుమార్‌రాజు విన్నవించారు. జీవీఎంసీలో 24 ఏళ్ల నుంచి దాదాపు 9500 మంది అవుట్‌సోర్సింగ్‌లో పనిచేస్తున్నాం, కానీ కనీస వేతనాలు ఇవ్వడం లేదన్నా, వెట్టిచాకిరీ చేయించుకుంటూ రెగ్యులర్‌ కూడా చేయడం లేదన్నా..మీరు అధికారంలోకి వచ్చాక మాలాంటి చిరుద్యోగులను ఆదుకోవాలన్నా అని వేడుకున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రభుత్వ రంగ సంస్థల్లో 3 లక్షల మంది వరకు పనిచేస్తున్నాం..సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నా అవి అమలు కావడం లేదన్నా, 11వ పీఆర్సీ ప్రకారం వేతనాలు కూడా చెల్లించడంలేదు..మీరు అధికారంలోకి వచ్చాక మా సమస్యలు పరిష్కరించాలని జగన్‌ను అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు కోరారు. నగరంలో 676 కిరోసిన్‌ హాకర్ల కుటుంబాలు కిరోసిన్‌ అమ్మకమే ఆధారంగా బతుకుతున్నాం..1998 నుంచి వినియోగదారులకు కిరోసిన్‌ సరఫరా చేస్తున్నాం, కానీ 2017 ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం సరఫరా నిలిపేయడంతో అందరం రోడ్డున పడ్డామని ప్రతిపక్ష నేత వద్ద గోడు వినిపించారు. మ్యాక్స్‌క్యాబ్‌ కార్మికుల సమస్యలు చంద్రబాబు సర్కారుకు పట్టడం లేదని నగర మ్యాక్స్‌ క్యాబ్‌ ఓనర్స్, డ్రైవర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు ప్రతిపక్ష నేతకు ఫిర్యాదు చేశారు. తాటిచెట్లపాలెంలో టీడీపీ ప్రభుత్వం షియా ముస్లింలకు శ్మశానవాటిక నిర్మిస్తామని మోసం చేసిందని, వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక శ్మశానవాటిక నిర్మించాలని దాదాపు 300 మంది ముస్లింలు ప్రతిపక్షనేతకు వినతిపత్రం ఇచ్చారు. మీరు అధికారంలోకి వచ్చాక ట్రామాకేర్‌ సిబ్బందిని క్రమబద్ధీకరించాలని విజయనగరానికి చెందిన పట్నాయక్‌ కోరారు. ఇలా దారిపొడవునా వైఎస్‌ జగన్‌కు ప్రజలు తమ సమస్యలు చెప్పుకున్నారు.

పాదయాత్రలో రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి, పాదయాత్ర టూర్‌ ప్రొగ్రామ్స్‌ కో–ఆర్డినేటర్‌ తలశిల రఘురామ్, శాసనసభ పక్ష ఉపనాయకుడు బూడి ముత్యాలనాయుడు, ఎమ్మెల్యేలు కోన రఘుపతి, రవీంధ్రనా«థ్‌రెడ్డి, వై.విశ్వేశ్వరరెడ్డి, ఆంజాద్‌భాషా,  మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి, కడప మేయర్‌ సురేష్‌రెడ్డి, మాజీ మంత్రులు బలిరెడ్డి సత్యారావు, కేసీహెచ్‌ మోహనరావు, మాజీ ఎమ్మెల్యేలు కాటసాని రామ్‌భూపాల్‌రెడ్డి, మల్లాది విష్ణు, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, కుంభా రవిబాబు, మాజీ ఎమ్మెల్సీ డీసీ సూర్యనారాయణరాజు, వైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్, విశాఖ పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు తైనాల విజయకుమార్, విశాఖ పార్లమెంట్‌ సమన్వయకర్త ఎంవీవీ సత్యనారాయణ, అనకాపల్లి పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్, రాజమండ్రి పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు కౌర శ్రీనివాసరావు, కృష్ణాజిల్లా అధ్యక్షుడు జోగి రమేష్, రాష్ట్ర నాయకుడు ఆళ్ల విజయచందర్, ప్రభుత్వ మాజీ ముఖ్యకార్యదర్శి ఐ.వై.ఆర్‌.కృష్ణారావు, ఎస్సీసెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగు నాగార్జున, సమన్వయకర్తలు కేకే రాజు, వంశీకృష్ణ శ్రీనివాస్, కోలా గురువులు, తిప్పల నాగిరెడ్డి, అక్కరమాని విజయనిర్మల, ఎం.వి.రమణమూర్తిరాజు, పెట్ల ఉమాశంకర గణేష్, కరణం ధర్మశ్రీ, వెల్లంపల్లి శ్రీనివాస్, ఐ.వి.రెడ్డి, ముదునూరు ప్రసాదరాజు, పి.వి.ఎల్‌.ఎన్‌.రాజు, బియ్యపు మధుసూదనరెడ్డి, కాటసాని రాంరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, పి.సిద్దార్థరెడ్డి, వై.వెంకటరామిరెడ్డి, శంకరనారాయణ, జొన్నలగడ్డ పద్మావతి, గౌరు చరితారెడ్డి, లక్కిరెడ్డి రాజగోపాలరెడ్డి, విజయనగరం జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, సీఈసీ సభ్యుడు కాకర్లపూడి శ్రీకాంత్‌రాజు, గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్‌ సత్తి రామకృష్ణారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాదరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి సనపల చంద్రమౌళి, రాష్ట్ర అదనపు కార్యదర్శులు పక్కి దివాకర్, రవిరెడ్డి, నగర మహిళ అధ్యక్షురాలు గరికిన గౌరి, పి. శ్రీదేవివర్మ, పసుపులేటి ఉషాకిరణ్, రాష్ట్ర యూత్‌ విభాగం అధికార ప్రతినిధి తుళ్లి చంద్రశేఖర్‌ యాదవ్, రాష్ట్ర యూత్‌ ప్రధానకార్యదర్శి గుడ్ల పోలిరెడ్డి, చొక్కాకుల వెంకటరావు, బొల్లవరపు జాన్‌వెస్లీ, వైఎస్సార్‌సీపీ ఎస్సీసెల్‌ నగర అధ్యక్షుడు బోని శివరామకృష్ణ, కార్యదర్శి నిడిగట్టు అర్జునరావు, నగర విద్యార్థి విభాగం అధ్యక్షుడు బి.కాంతారావు, నగర యూత్‌ అధ్యక్షుడు కొండా రాజీవ్‌గాంధీ, జిల్లా అధికార ప్రతినిధి మళ్ల బుల్లిబాబు, నగర అధికార ప్రతినిధి ఆల్ఫా కృష్ణ, కొణతాల రేవతిరాజు, ఈతలపాక శ్యామ్‌ప్రసాద్, ప్రచారకమిటీ నగర అధ్యక్షుడు బర్కత్‌ ఆలీ, రాష్ట్ర మైనారిటీ సెల్‌ కార్యదర్శి సీహెచ్‌. ఫరూకీ, షేక్‌ ఆజమ్‌ ఆలీ, షేక్‌ జుబేర్, అనంతపురం నుంచి పసుపుల బాలకృష్ణారెడ్డి, వెన్నపూస రామచంద్రారెడ్డి, గుంటూరు నుంచి ఏటుకూరు విజయసారథి, పచ్చల ఆనంద్, పిఠాపురం నుంచి శివనాధ్, సాయిరామ్, అనంతపురం జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ, పెద్దాపురం నుంచి దౌలూరు దొరబాబు, టీచర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర కార్యదర్శి మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్‌ ఉప్పలపాటి సుకుమార్‌వర్మ, రాష్ట్ర సేవాదళ్‌ ప్రధాన కార్యదర్శి సత్తి మందారెడ్డి, రాష్ట్ర మహిళ విభాగం ప్రధాన కార్యదర్శి వారాధి శ్రీదేవి, అన్నవరం దేవస్థానం ట్రస్టీ కె.హనుమాన్, తూర్పుగోదావరి జిల్లా మాజీ జడ్పీ చైర్‌పర్సన్‌ సీహెచ్‌. వేణుగోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

సీపీఎస్‌ రద్దు చేయాలి
సీపీఎస్‌ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని ఏయూ ఆచార్యులు కోరారు. ప్లకార్డులు పట్టుకుని తమ వాదన వినిపించారు. ఆచార్యుల పదవీ విరమణ వయో పరిమితి 62 నుంచి 65 సంవత్సరాలకు పెంచాలని కోరారు. ఏడో వేతన సంఘం సిఫార్సులు అమలు జరపాలని కోరారు.

అభిమాన పూలవర్షం
తాటిచెట్లపాలెం వద్ద ఏర్పాటు చేసిన బస వద్దకు సోమవారం ఉదయాన్నే వేలాది సంఖ్యలో ప్రజలు, అభిమానులు చేరుకున్నారు. జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర ప్రారంభం కాగానే రోడ్లకు ఇరువైపులా పెద్ద ఎత్తున జనం బారులుతీరారు. మహిళలు హారతులు పట్టారు. యువత, అభిమానులు, మహిళలు సెల్ఫీల కోసం ఎగబడ్డారు. అందరితో వైఎస్‌ జగన్‌ సెల్ఫీలు దిగుతూ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. జగన్‌ నడిచిన దారుల్లో పూలు చల్లి స్వాగతించారు. దొండపర్తి దాటాక ఆర్టీసీ కాంప్లెక్స్‌ రోడ్డులో ఫ్లైఓవర్‌ మీద నుంచి కాంప్లెక్స్‌ వరకు అభిమానులు పూలవర్షం కురిపించారు. తీన్‌మార్, గరగనృత్యాలు, బిందెల డ్యాన్స్‌లు, అశ్వదళంతో జననేతను స్వాగతించారు.  కాంప్లెక్స్‌ నుంచి సిరిపురం వరకు జగన్‌ నడిచిన మార్గంలో ఎర్రతివాచీ పరిచారు. దారిపొడవునా బహుళ అంతస్థుల భవనాలు, దుకాణాల మీదకు చేరుకున్న ప్రజలు జగన్‌కు చేతులు ఊపి స్వాగతించగా..వారికి అభివాదం చేస్తూ జననేత ముందుకు నడిచారు. ఆర్టీసీ బస్‌లు, ఇతర వాహనాల్లో నుంచి జగన్‌ను చూసేందుకు ఎగబడ్డారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top