కోవిడ్‌పై యుద్ధం

People Fear on COVID 19 Virus in SPSR Nellore - Sakshi

పాఠశాలలకు సెలవులు

సినిమా హాళ్లు, స్విమ్మింగ్‌ పూళ్ల మూత

ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు  

హెల్ప్‌డెస్క్‌ నంబర్‌ 96182 32115  

సదస్సులు, సభల ద్వారా జాగ్రత్తలు  

ప్రైవేట్‌ ఆస్పత్రుల్లోనూ ప్రత్యేక వార్డులు 

నెల్లూరు(అర్బన్‌): నగరంలో కోవిడ్‌ – 19 కేసు నమోదు కావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కోవిడ్‌పై యుద్ధం ప్రకటించింది. వ్యాధి నియంత్రణకు చర్యలు చేపట్టింది. రెండు వైద్య బృందాలను నెల్లూరుకు పంపింది. ఎక్కడికక్కడ రక్షణ చర్యలు చేపట్టారు. నగరపాలక సంస్థ పరిధిలో స్కూళ్లు, సినిమా హాళ్లను మూసేశారు. రైల్వేస్టేషన్‌ పరిసరాల్లో స్ప్రేయింగ్, ఫాగింగ్‌ చేశారు. 4,500 మంది సిబ్బందితో ఇంటింటి సర్వే, అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటివరకూ 20,996 ఇళ్లను సర్వే చేశారు. ప్రైవేట్‌ ఆస్పతుల్లోనూ ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశారు.   ఉన్నత చదువుల కోసం ఇటలీ వెళ్లి నగరానికి వచ్చిన ఇద్దరు విద్యార్థులకు కోవిడ్‌ లక్షణాలు ఉన్నాయని గుర్తించి ప్రభుత్వాస్పత్రిలోని ఐసొలేటెడ్‌ వార్డులో ఉంచారు. వీరిలో ఒకరికి పాజిటివ్‌ రాగా, మరొకరికి నెగెటివ్‌ వచ్చింది. వారితో తిరిగిన మరో ఆరుగుర్ని ముందు జాగ్రత్తలో భాగంగా కరోనా వార్డుకు తరలించి పరిశీలనలో ఉంచారు. ఇదిలా ఉండగా గుప్తా పార్క్‌ సమీపంలోని మరో ఇద్దర్ని పెద్దాస్పత్రిలోని కరోనా వార్డుకు తరలించారనే ప్రచారం జరుగుతోంది. అయితే అధికారికంగా ప్రకటించలేదు. వీరితో కలుపుకొంటే పది మందిని పరిశీలనలో ఉంచారు. దీంతో మరింత రక్షణ చర్యలు ప్రారంభించారని తెలుస్తోంది. 

హడలిపోతున్న ప్రజలు
జిల్లాలో కోవిడ్‌ – 19 కలకలం సృష్టిస్తోంది. విదేశాల నుంచి వచ్చిన వ్యక్తులను చూసిన ప్రజలు హడలిపోతున్నారు. వారి ఆరోగ్య విషయంలో చిన్న మార్పొచ్చినా వైద్యశాఖ అధికారులకు సమాచారాన్ని అందిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం జరుగుతుండటంతో ప్రజలు హడలిపోతున్నారు. సూళ్లూరుపేట, పొదలకూరులో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. 

సినిమాహాళ్ల మూసివేత
నగరంలో సినిమా హాళ్లను మూసేశారు. మరో వైపు నగరంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ స్విమ్మింగ్‌ పూళ్లను మూసేయాలని ఆదేశాలు జారీ చేశారు. కమిషనర్‌ పీవీవీఎస్‌ మూర్తి స్వయంగా మూసేయించారు. నగరంలో 25 ప్రత్యేక పారిశుధ్య బృందాల ద్వారా పారిశుధ్య కార్యక్రమాలను చేపట్టారు. రోజూ సదస్సులు నిర్వహిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. 4,500 మంది సిబ్బందితో ఇంటింటి సర్వే ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడం, పారిశుధ్య పనులను చేపడుతున్నామని కమిషనర్‌ తెలిపారు.

హెల్ప్‌ డెస్క్‌ ఏర్పాటు  
జిల్లాలో విదేశాల నుంచి వచ్చిన వారిలో దగ్గు, జలుబు లక్షణాలు కనిపిస్తే అలాంటి వారి సమాచారమిచ్చేందుకు, సందేహాలను తీర్చేందుకు జెడ్పీ ఆవరణలోని జిల్లా ఎమర్జెన్సీ కార్యాలయంలో హెల్ప్‌ డెస్క్‌ను ఏర్పాటు చేశారు. ఇక్కడ ఇద్దరు వైద్య సిబ్బందిని ఉంచారు. 24 గంటలూ షిఫ్ట్‌ పద్ధతిలో పని చేస్తారు. 96182 32115 నంబర్‌కు ఫోన్‌ చేయవచ్చు. కరోనా లక్షణాలున్నా.. విదేశాల నుంచి వచ్చిన వారు ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్నా 0866 2410978 నంబర్‌కు ఫోన్‌ చేయవచ్చు. 

ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో..
పెద్దాస్పత్రితో పాటు గూడూరు, కావలి, ఆత్మకూరు, తదితర ప్రాంతాల్లోని ప్రభుత్వాస్పత్రుల్లో ప్రత్యేక వార్డులను ఇప్పటికే సిద్ధం చేశారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు రామచంద్రారెడ్డి ఆస్పత్రి, నారాయణ, మెడికవర్, కిమ్స్, అపోలో, తదితర ఆరు ఆస్పత్రిల్లో ఐసోలేషన్‌ వార్డులను ఏర్పాటు చేసి 52 బెడ్లను సిద్ధం చేశారు. అవసరాన్ని బట్టి మరిన్నింటిని ఏర్పాటు చేయనున్నారు.

20,996 ఇళ్ల సర్వే
కరోనా వ్యాధి పాజిటివ్‌ వచ్చిన విద్యార్థి నివాస సమీపంలోని మూడు కిలోమీటర్ల పరిధిలో నగరంలో 40 వైద్య బృందాలు 20,996 ఇళ్లను సర్వే చేసి, 74,573 మందిని పరిశీలించారు. దగ్గు, జ్వరం, జలు బు, శ్వాస కోశ సంబంధిత లక్షణాలపై ఆరా తీశారు. ప్రస్తుతానికి ఈ లక్షణాలు ఎవరికీ కనిపించలేదు. 

ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు
నగరంలో కార్పొరేషన్‌ అధికారులు ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టారు. సుమారు 1500 మంది పారిశుధ్య, ఇంజినీరింగ్‌ వర్కర్లు శానిటైజేషన్‌ సొల్యూషన్‌ చేతికి రాసుకునేలా చర్యలు చేపట్టారు. చెత్తను ఎప్పటికప్పుడు తొలగిస్తూ బ్లీచింగ్‌ చల్లుతున్నారు. జిల్లా అంతటా చర్యలు చేపడుతున్నారు. 

వైద్య బృందాల రాక
ప్రభుత్వం జిల్లాకు రెండు ప్రత్యేక వైద్య బృందాలను పంపింది. ఒక బృందం సర్వే, అవగాహన సదస్సుల ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తోంది. మరో బృందం డాక్టర్లు, నర్సులకు శిక్షణ ఇస్తోంది.

విదేశీయుల నుంచి వచ్చిన119 మంది గుర్తింపు
జిల్లాకు 159 మంది విదేశాల నుంచి వచ్చినట్లు అంచనాకు వచ్చారు. వీరిలో 119 మందిని ఇప్పటికే గుర్తించారు. వీరిని ఆయా పీహెచ్‌సీల పరిధిలో శిక్షణ పొందిన డాక్టర్‌ రోజూ వారి ఇంటికి వద్దకు వెళ్లి పరిశీలించి వస్తున్నారు. 14 రోజుల పాటు ఇంట్లోనే ప్రత్యేకంగా ఎవరితో కలవకుండా ఉండాలని సూచిస్తున్నారు. ఏ మాత్రం అనుమానిత లక్షణాలు కనిపించినా కరోనా వార్డులో అడ్మిట్‌ చేసేలా చర్యలు చేపట్టారు. 

మాస్క్‌లు అందరికీ అవసరం లేదు  
కరోనా భయంతో ప్రతి ఒక్కరూ మాస్క్‌లు వాడాల్సిన అవసరం లేదని డాక్టర్లు పేర్కొంటున్నారు. తుమ్ములు, జలుబు, దగ్గు ఉన్నవారు మాత్రమే వారి తుంపర్లు ఇతరులపై పడకుండా మాస్క్‌లు కట్టుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. నిత్యం రోగుల మధ్య పనిచేస్తున్న డాక్టర్లు, నర్సులు మాస్క్‌లు వాడాల్సిన అవసరం ఉంది. మాస్క్‌లు అధిక ధరలకు అమ్మే వారిపై డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు కఠిన చర్యలు తీసుకోనున్నారు.  

18 వరకు పాఠశాలల మూత
నెల్లూరు (టౌన్‌): నగరానికి చెందిన వ్యక్తికి కరోనా వైరస్‌ సోకడంతో కలెక్టర్‌ శేషగిరిబాబు ముందస్తు చర్యలు చేపట్టారు. నెల్లూరు అర్బన్, రూరల్‌ మండల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలకు ఈ నెల 16 నుంచి 18 వరకు సెలవులు ప్రకటించామని డీఈఓ జనార్దనాచార్యులు తెలిపారు. 14వ తేదీ రెండో శనివారం, 15న ఆదివారం కావడంతో వరుస సెలవులు వచ్చాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top