మనవడొచ్చాడు

Pension Holders Happy With YSR Pension Kanuka - Sakshi

అవ్వాతాతల మోముల్లో చిరునవ్వే లక్ష్యంగా వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అడుగులు

పింఛన్‌ మొత్తం     పెంచుతూ ముఖ్యమంత్రిగా తొలి సంతకం

లబ్ధిదారుల్లో వెల్లువెత్తిన హర్షాతిరేకాలు

లక్ష్మీపురం(గుంటూరు): ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ప్రమాణస్వీకారం చేసి తొలి సంతకాన్ని పింఛను పెంపుపై చేశారు. రాష్ట్రంలో నవరత్నాల పథకాన్ని ప్రవేశపెట్టేందుకు పాదయాత్రలో జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం అవ్వా, తాతలకు దశలవారీగా రూ.3 వేలకు పింఛను పెంచడంతో రాష్ట్ర వ్యాప్తంగా పింఛనుదారులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార  మహోత్సవ సభలో వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ అవ్వా, తాతలకు పెన్షన్‌ పెంచుతానని, అది కూడా జూన్‌ 1వ తేదీ నుంచే అమల్లోకి వచ్చేలా మొట్టమొదటి సంతకాన్ని చేసి మీరు ఆశీర్వదించండి అంటూ నిండు సభలో కోరడం పెన్షన్‌ దారులను భావోద్వేగానికి గురిచేసింది. మీ కష్టాలను చూశానని, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల వారి బాధలు స్వయానా విన్నానంటూ, ఎలాంటి రాజకీయ, కుల మతాలకు తావు లేకుండా అన్ని వర్గాల వారికి తన ప్రభుత్వంలో న్యాయం జరిగేలా చూస్తానని జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు.

దశలవారీగా పెన్షన్‌ పెంపు...
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మొదటి సంతకం వృద్ధులకు పింఛను పెంపుపై చేశారు. ఈ పెంపు జూన్‌ 1వ తేదీ నుంచి అమలు జరిగేలా ప్రణాళికను సిధ్ధం చేశారు. ఏడాదికి రూ.250 చొప్పున పెంచుతూ ఈ ఏడాది జూన్‌ 1 వతేదీ నుంచి 2,250 పింఛను ఇవ్వనున్నట్టు స్పష్టం చేశారు. దశలవారీగా రెండో ఏడాది మరో రూ.250, మూడో ఏడాది మరో రూ.250, నాల్గో ఏడాదికి పింఛను రూ.3 వేలకు పెంచుతానని వివరించారు.

జిల్లాలో పెన్షన్‌దారులు...
జిల్లాలో ఇప్పటివరకు ప్రతి నెలా రూ.2 వేల చొప్పున పెన్షన్‌ అందుకుంటున్న వారిలో  వృధ్ధులు 2,13,531 మంది, వితంతువులు 1,88,144, ఒంటరి మహిళలు 17,956, చేనేత కార్మికులు 8,814, మత్స్యకారులు 2,715, కల్లుగీత కార్మికులు 20170, చెప్పులు కుట్టేవారు 1824 మంది ఉన్నారు. అలాగే రూ.3వేల పెన్షన్‌ అందుకుంటున్న వారు డప్పుకళాకారులు 2148 మంది, హిజ్రాలు 126 మంది ఉన్నారు. ప్రతి నెలా రూ.3,500 అందుకుంటున్న కిడ్నీ పెషంట్లు 300 మంది ఉన్నారు. వికలాంగులు 49,623 మంది పెన్షన్‌ అందుకునే వారు ఉన్నారు. వీరిలో 40 నుంచి 70 శాతం వైకల్యం ఉన్న వారికి రూ.2వేలు, 80 నుంచి 100 శాతం వైకల్యం ఉన్నవారికి రూ.3వేలు పెన్షన్‌ అందుకుంటున్నారు. వారితో పాటు ఎయిడ్స్‌ రోగులు  రూ.2వేలు పెన్షన్‌ అందుకుంటున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఆయా కేంద్రాల్లో నమోదు చేసుకున్న వారు 4264 ఉన్నారు.

అభయ హస్తం పథకం లబ్ధిదారులు అనర్హులు
డ్వాక్రా గ్రూపుల్లో ఉన్న వారు 59 నుంచి 60 సంవత్సరాల వారు రూ.3650 జమ చేస్తే అభయ హస్తం పథకం కింద ప్రతి నెల జీవించి ఉన్నంత వరకు రూ.500 అందేలా అభయ హస్తం పథకం ప్రవేశ పెట్టారు. వీరు జిల్లాలో 5250 మంది ఉన్నారు. వీరంతా వృద్ధాప్య పెన్షన్‌ కు అర్హులు కారు. అయితే వీరిలో 60 సంవత్సరాల పై బడిన వారు అభయ హస్తం పథకం నుంచి వృద్ధాప్య పెన్షన్‌లోకి బదిలీ చేయాలని గత  ప్రభుత్వం దృష్టికి తీసుకువెళితే పట్టించుకున్న నాథుడే లేడని వాపోతున్నారు.

జిల్లాలో  పెండింగ్‌లో ఉన్న పెన్షన్‌దారుల దరఖాస్తులు..
జిల్లాలో గత ప్రభుత్వ పాలనలో పింఛన్ల కోసం కొత్తగా దరఖాస్తులు చేసుకున్న వారు జిల్లాలో 7600 మంది ఉన్నారు. వీరంతా గత ఐదేళ్లుగా దరఖాస్తులు చేసుకుని పింఛన్ల మంజూరు కోసం ఎదురు చూస్తున్నారు.  

పింఛను పెంపుదలసంతోషంగా ఉంది...
ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తే పింఛను రూ.3 వేలకు వరకు పెంచుతానన్నాడు జగన్‌బాబు, ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయగానే తొలివిడతగా రూ.250 పెంచుతూ మొదటి సంతకం చేశారు. మాలాంటి వృద్ధుల గురించి మొదటగా ఆలోచన చేయటం సంతోషంగా ఉంది.– కోటా దీనమ్మ, వృద్ధురాలు, చివలూరు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top