ఉగాది నుంచి పెళ్లికానుక

Pellikanuka from Ugadi - Sakshi

సీఎం చంద్రబాబు వెల్లడి

సాక్షి, అమరావతి: ఉగాది నుంచి ఆడపిల్లలకు పెళ్లికానుక ఇస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. పెళ్లి ఖర్చుల కోసం ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన మహిళలకు రూ.50 వేలు, ఎస్సీలకు రూ.40 వేలు, బీసీలకు రూ.35 వేల చొప్పున ఇస్తామని చెప్పారు. ఇందులో 20 శాతం నిధులను పెళ్లి ఖర్చుల కోసం ముందే ఇస్తామని.. మిగతా 80 శాతం పెళ్లి రోజున అకౌంట్లలో జమ చేసి ‘కానుక’గా అందిస్తామని తెలిపారు. స్వయం సహాయక మహిళా సంఘాల ద్వారా దీనిని అమలు చేస్తామన్నారు. బుధవారం శాసనసభలో స్వయం సహాయక సంఘాల సాధికారితపై చర్చ జరిగింది.  ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. మహిళలకు ఆర్థికంగా చేయూతనివ్వడం కోసం పసుపు, కుంకుమ కింద ఒక్కొక్కరికి రూ.పది వేల చొప్పున ఇవ్వాలని నిర్ణయించామని.. ఇప్పటికే రూ.8 వేలు ఇచ్చామని మరో రూ.2 వేలు త్వరలోనే ఇస్తామన్నారు. వడ్డీ రాయితీ కింద ఇప్పటిదాకా రూ.2,514 కోట్లు ఇచ్చామని.. బకాయిలు త్వరలో విడుదల చేస్తామని చెప్పారు. 

పార్లమెంటు సమావేశాల తర్వాత రాష్ట్రంలో పోరాటం!
విభజన హామీల సాధన కోసం పార్లమెంటు సమావేశాల తర్వాత రాష్ట్రంలో పోరాటం ఉధృతం చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి బుధవారం టీడీపీ ఎంపీలతో ఆయన టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. టీడీపీ ఎంపీలకు కేంద్ర మంత్రి గోయల్‌ అపాయింట్‌మెంట్‌ ఇవ్వకపోవడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థిక బిల్లులను హడావుడిగా పూర్తి చేసి పార్లమెంట్‌ను నిరవధికంగా వాయిదా వేసే అవకాశం ఉందని.. అందువల్ల ఆర్థిక బిల్లులపై చర్చలో ఏపీకి ప్రత్యేక హోదా, ఆర్థిక లోటుపై చర్చించాలని సూచించారు. 

ప్రజలను పట్టించుకోకుంటే ఇంతే..: రాజకీయ పార్టీలు ప్రజల మనోభాలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఫలితాలు కూడా విరుద్ధంగానే ఉంటాయని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. తాజాగా యూపీ, బీహార్‌ ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమి నేపథ్యంలో చంద్రబాబు స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్, బీహార్‌ ఉప ఎన్నికల ఫలితాలు ఆలోచింపజేసేలా ఉన్నాయని, దేశంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయని చెప్పారు.

బుధవారం తన నివాసం వద్ద గ్రీవెన్స్‌ హాలులో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. తనకు, ప్రధానమంత్రి మోదీకి మధ్య విభేదాలు లేవని చెప్పారు. తామిద్దరం ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు ఏమైనా ఉంటే అవి ఇప్పుడు అనవసరమన్నారు. అయితే బీజేపీతో పొత్తు వల్ల తాను అనుకున్న లక్ష్యాలు నెరవేరలేదన్నారు. వైఎస్సార్‌ సీపీపై ఎదురుదాడి చేయకుంటే విఫలమవుతామని పార్టీ నేతలను చంద్రబాబు హెచ్చరించారు. బీజేపీతో వారు కలుస్తున్నట్లు ప్రచారం చేయాలని సూచించారు. ప్రత్యేక హోదా విషయంలో గతంలో తాను అన్న మాటలను మరచిపోవాలని, వాటిని పట్టించుకోకుండా హోదాయే పార్టీ విధానమని చెప్పి నినదించాలని సూచించారు.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top