యజ్ఞంలా ‘నివాస స్థలాల’ భూసేకరణ 

Patta Distribution to the 25 lakh People - Sakshi

ఉగాది పర్వదినాన 25 లక్షల మందికి పట్టాల పంపిణీ  

భూ సేకరణకు అధికార యంత్రాంగం కసరత్తు 

బడ్జెట్‌లో రూ.5,000 కోట్లు కేటాయింపు 

కార్యాచరణ కోసం ప్రత్యేకంగా ఐఏఎస్‌ అధికారి నియామకం

సమన్వయం,పర్యవేక్షణకు ఆరుగురు ఉన్నతాధికారులతో కమిటీ  

సాక్షి, అమరావతి:  రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల మందికి నివాస స్థల పట్టాల పంపిణీకి ప్రభుత్వం భారీ కసరత్తు చేస్తోంది. ఇల్లు గానీ, ఇంటి స్థలం గానీ లేని వారందరికీ వచ్చే తెలుగు సంవత్సరాది(ఉగాది) పర్వదినం సందర్భంగా ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా ఒకేరోజు 25 లక్షల మందికి నివాస స్థల పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో ఇందుకు అవసరమైన భూమిని సమకూర్చడానికి అధికార యంత్రాంగం కార్యాచరణ ప్రారంభించింది. 25 లక్షల మందికి ఇళ్ల స్థలాల పంపిణీకి 62,500 ఎకరాల భూమి అవసరమని లెక్క తేల్చింది. నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో ప్రస్తుతం ఇళ్ల స్థలాల పంపిణీకి పనికొచ్చే భూమి ఎంత ఉంది? ఇంకా ఎక్కడెక్కడ ఎంత భూమి సేకరించాలనే దానిపై అధికారులు ప్రాథమిక కసరత్తు చేపట్టారు. అక్టోబరు 2వ తేదీన గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలు ఏర్పాటైన తర్వాత ఏయే గ్రామాలు, పట్టణాల్లో ఇళ్లు లేని వారు ఎంతమంది ఉన్నారు, ఎక్కడెక్కడ ఎంతమందికి నివాస స్థల పట్టాలు ఇవ్వాలో పక్కాగా తేలుతుంది. దీని ప్రకారం అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమిని మినహాయించి, అవసరమైన ప్రైవేట్‌ భూమిని సేకరించి, పట్టాల పంపిణీకి వీలుగా ప్లాట్లు వేయాల్సి ఉంటుంది.  

62,500 ఎకరాలు అవసరం  
ఒక ఎకరా భూమి 40 మందికి మాత్రమే పట్టాల పంపిణీకి సరిపోతుంది. ఎకరాకు వంద సెంట్లు కాగా, నిబంధనల ప్రకారం ఇందులో 40 సెంట్లు రహదారులు, మురుగు కాలువలు, పార్కులు తదితరాలకు వదిలిపెట్టాల్సి ఉంటుంది. మిగిలిన 60 సెంట్లను ఒక్కొక్కరికి 1.5 సెంట్ల చొప్పున 40 మందికి పంచవచ్చు. ఈ లెక్కన 25 లక్షల మందికి నివాస స్థలాలు ఇవ్వడానికి 62,500 ఎకరాలకుపైగా భూమి అవసరం. ఆక్రమణల్లో ఉన్న ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవడానికి అధికారులు సన్నద్ధమవుతున్నారు. పరిశ్రమలు స్థాపిస్తామంటూ భూములు తీసుకుని, ఆ తర్వాత ముఖం చాటేసిన సంస్థలకు నోటీసులు జారీచేసి, సదరు భూములను వెనక్కి తీసుకునేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. మొత్తమ్మీద ఇప్పటిదాకా ఉన్న లెక్కల ప్రకారం 8,500 ఎకరాల భూమి ఇళ్ల స్థలాల పంపిణీ కోసం ప్రభుత్వం వద్ద ఉంది. మిగిలిన 54,000 ఎకరాలను వివిధ మార్గాల్లో సమకూర్చాల్సి ఉంటుంది. ప్రైవేటు వ్యక్తుల నుంచి కొనుగోలు చేయాల్సి ఉంది. భారీస్థాయిలో భూసేకరణ చేయాల్సి ఉన్నందున  ప్రభుత్వం ఇందుకోసం ఐఏఎస్‌ అధికారిని రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనరేట్‌లో స్పెషల్‌ కమిషనర్‌గా నియమించింది. ఆయన ఏయే జిల్లాల్లో ఎంతెంత భూమి కావాలో నివేదిక రూపొందించి, ఆ మేరకు భూసేకరణ కోసం కలెక్టర్లతో నిత్యం సమన్వయం చేసుకుంటారు. పట్టణాల్లో అర్హులకు ఇళ్ల పట్టాల పంపిణీకి భూసేకరణను పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి సమీక్షించాలి. ఇళ్లు లేని వారి కోసం వచ్చే ఐదేళ్లలో 25 లక్షల ఇళ్లు నిర్మించాలని గృహ నిర్మాణ శాఖకు ముఖ్యమంత్రి భారీ లక్ష్యం నిర్దేశించారు. భూసేకరణ ప్రక్రియ రెవెన్యూ, గృహ నిర్మాణం, సాంఘిక సంక్షేమం, ఆర్థిక తదితర శాఖలతో ముడిపడి ఉంది.  

రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన కమిటీ  
భూ సేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత బడ్జెట్‌లో రూ.5,000 కోట్లు కేటాయించింది. వివిధ శాఖల సమన్వయంతో భూసేకరణ ప్రక్రియను సజావుగా నిర్వహించడానికి ఓ కమిటీని నియమించింది. రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌ అధ్యక్షతన గల ఈ కమిటీలో గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి, రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్‌ కార్యాలయంలో భూసేకరణ కోసం ప్రత్యేకంగా నియమితులైన స్పెషల్‌ కమిషనర్‌ సభ్యులుగా ఉన్నారు. లక్ష్యం మేరకు భూసేకరణ ప్రక్రియ పూర్తయ్యేలా చూడడమే ఈ కమిటీ బాధ్యత. ‘‘25 లక్షల మందికి ఇళ్ల పట్టాల జారీకి  కసరత్తు చేస్తున్నాం. పేదల సొంతింటి కలను సాకారం చేయాలన్న ముఖ్యమంత్రి లక్ష్యం ఎంతో ఉన్నతమైనది. దీనిని నెరవేర్చే దిశగా అధికార యంత్రాంగం అన్ని చర్యలూ తీసుకుంటోంది’’ అని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌ చెప్పారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top