వంచించినోడే చెంతకొచ్చాడు 

parents accept love marriage in kurnool

ప్రేమించి పెళ్లికి నిరాకరించిన యువకుడు 

రాజీ కుదిర్చిన పెద్దలు 

ఒక్కటైన ప్రేమ జంట 

సంజామల(కర్నూలు): ప్రేమించినా పెళ్లికి నిరాకరించి మోసం చేసిన యువకుడు ఎట్టకేలకు ప్రియురాలి చెంతకు చేరాడు. పెద్దలు, పోలీసుల కౌన్సెలింగ్‌ కారణంగా ఇరు కుటుంబాలవారు రాజీ కొచ్చారు. ప్రేమికులను కలిపి వారి కథను సుఖాంతం చేశారు. మండల పరిధిలోని గిద్దలూరుకు చెందిన శిలార్సాగారి కమాల్సా కూతురు తస్లీమా అదే గ్రామానికి చెందిన సుద్దమల్ల బాషా కుమారుడు ఉశేన్‌వలి మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. శారీరకంగా ఒక్కటవడంతో తస్లిమా గర్భవతి అయింది. ఈ క్రమంలో పెళ్లి చేసుకోవాలని కోరగా చెల్లి పెళ్లి తర్వాత చేసుకుంటానంటూ ఉశేన్‌వలీ నమ్మించాడు. అనంతరం గర్భస్రావం అయ్యేలా మాత్రలు ఇచ్చాడు. చెల్లి పెళ్లి తర్వాత కూడా అతడు పెళ్లికి అంగీకరించకపోవడంతో తస్లీమా ఆత్మహత్యకు ప్రయత్నించింది.

ఆసుపత్రిలో చికిత్స తర్వాత కోలుకున్న ఆమె గత శనివారం పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు ఉశేన్‌వలి, అతని తండ్రి బాషాపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో గ్రామ పెద్దలు ఇరు కుటుంబాల వారితో మాట్లాడి ఒప్పించడం, ఉశేన్‌ వలి కూడా పెళ్లికి అంగీకరించడంతో అడ్డంకులు తొలగిపోయాయి. దీంతో ఇరు కుటుంబాల వారు ఆదివారం పోలీస్‌ స్టేషన్‌ చేరుకొని వారి పెళ్లికి అంగీకారం తెలిపారు. ఇరువురు ఒకే కులానికి చెందిన వారు కావడంతో సంజామలకు చెందిన ఖాజీ సికిందర్‌ సమక్షంలో పెళ్లికి అంగీకరిస్తూ సంప్రదాయబద్దంగా సంతకాలు చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top