ఇది ప్రతిపక్షం విజయం: అనంత వెంకటరామిరెడ్డి

ఇది ప్రతిపక్షం విజయం: అనంత వెంకటరామిరెడ్డి - Sakshi


అనంతపురం: ప్రతిపక్ష, విపక్ష పార్టీల ఉద్యమం ఫలితంగానే వాతావరణ బీమా, ఇన్‌పుట్‌ సబ్సిడీ వేర్వేరుగా అందించేందుకు ప్రభుత్వం అంగీకరించిందని, అంతే తప్ప ప్రభుత్వానికి రైతులపై ఏమాత్రం ప్రేమ లేదని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. ఇన్‌పుట్‌ సబ్సిడీపై సీపీఎం ఆధ్వర్యంలో స్థానిక ప్రెస్‌ క్లబ్‌లో సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 8.50 లక్షల హెక్టార్లకు రైతులతోపాటు ప్రభుత్వాలు రూ.280 కోట్లు ప్రీమియం చెల్లిస్తే 6 లక్షల హెక్టార్లకు రూ.419 కోట్లు బీమా పరిహారం అందించడం దారుణమన్నారు.



మిగతా 2.50 లక్షల హెక్టార్లకు బీమా ప్రీమియం చెల్లించినా బీమా కంపెనీలు పరిహారం వర్తింపజేయకుండా రైతులను మోసం చేస్తున్నా పట్టించుకోరా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కరవు రైతులపై చంద్రబాబు ప్రభుత్వానికి ఏమాత్రం ప్రేమ, కరుణ ఉన్నా రూ.1451 కోట్లను ప్రకటించి గొప్పలు చెప్పుకోవడం కాదు.. న్యాయబద్ధగా జిల్లా రైతులకు రావాల్సిన సొమ్ము (ఇన్‌పుట్, బీమా) రూ.4 వేల కోట్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. సీపీఎంకు చెందిన మాజీ ఎమ్మెల్సీ గేయానంద్‌ మాట్లాడుతూ ఏటా లక్షల్లో పెట్టుబడి పెట్టి రైతులు పంటలు సాగు చేసి తీవ్రంగా నష్టపోతున్నా ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. రాయితీలు అందిస్తున్నామని ప్రకటించుకోవడమే తప్ప వాటిని రైతులకు ఇవ్వడంలేదన్నారు.



సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్‌ మాట్లాడుతూ జూన్‌ 9న ఇన్‌పుట్‌ సబ్సిడీ రైతులకు అందిస్తున్నట్లు సీఎం ప్రకటించారని, 14లోపు రైతుల ఖాతాల్లో జమ చేస్తామన్నారని చెప్పారు. రైతులకు సలహాలు సూచనలు అందించేందుకు కలెక్టర్‌ కార్యాలయంలో కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేశామని అసత్యాలు ప్రచారం చేస్తూ రైతులను ప్రభుత్వం మోసం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్‌ మాట్లాడుతూ ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా అప్పటి స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ఆధారంగానే పెట్టుబడి రాయితీ ఇస్తున్నారని,  రైతులకు డబుల్‌ ధమాకా అంటూ ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top