ఏక్‌ నిరంజన్‌

Only One Teacher For 111 Students In PSR nellore - Sakshi

111 మంది విద్యార్థులకు ఒక్కడే అయ్యోరు!

ఇదీ వరిగొండ గమళ్లపాళెం ప్రాథమిక పాఠశాల పరిస్థితి!

కార్పొరేట్‌కు దీటుగా విద్యాబోధన చేస్తాం. ప్రైవేట్‌కు దన్నుగా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేస్తాం. నాణ్యమైన విద్యను అందిస్తాం. ఇలా ప్రభుత్వ పెద్దలు నిత్యం గొప్పలు చెబుతుంటారు. కానీ వాస్తవ
పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. తోటపల్లిగూడూరు మండలం వరిగొండ పంచాయతీ గమళ్లపాళెం ప్రాథమికపాఠశాలను పరిశీలిస్తే ప్రకటనలన్నీ బూటకాలేనని తేటతెల్లమవుతోంది. ఈపాఠశాలలో 111 మంది విద్యార్థులు ఉన్నారు. ఉపాధ్యాయుడు మాత్రం ఒక్కరే. నిబంధనలు ఏమి చెబుతున్నాయంటే 20 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. ఈ లెక్కన ఐదుగురు ఉపాధ్యాయులు ఇక్కడ పనిచేయాలి. అయితే ఒక్కరే విద్యా బోధన చేస్తున్నారు. ఇదేం చోద్యం.. ఏకోపాధ్యాయుడుంటే పిల్లల చదువు సాగేదెట్టా  అంటే సమాధానం చెప్పేవారేకరువయ్యారు. ప్రభుత్వ పెద్దల తీరును ప్రశ్నిస్తున్న ఈ పాఠశాల వివరాల్లోకి వెళ్తే..

తోటపల్లిగూడూరు: మండల కేంద్రానికి ఐదు కిలో మీటర్ల దూరంలోని వరిగొండ పంచాయతీ గమళ్లపాళెంలో 1965లో ప్రారంభమైన ఈ పాఠశాల అనేక ఒడుదొడుకులను  ఎదుర్కొంటూ పయనం సాగిస్తోంది. విద్యాశాఖ అధికారులు సరిగ్గా దృష్టి సారించకపోవడంతో 2014–15 సంవత్సరంలో ఒకే ఒక్క విద్యార్థితో మూతపడే స్థితికి చేరుకుంది. ఐదేళ్లలో విద్యార్థుల సంఖ్య ఒకటి నుంచి 111కి చేరుకుంది. ఇక్కడికి బదిలీపై వచ్చిన ఉపాధ్యాయుడు వెంకటసుబ్బారెడ్డి కృషే విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఈ పాఠశాల వైపు నడిపించింది. ఇప్పుడు మండలంలో అత్యధిక విద్యార్థులు ఉన్న పాఠశాలగా మారిపోయింది. అయితే విద్యార్థుల సంఖ్య పెరిగినా ఉపాధ్యాయుల సంఖ్య మాత్రం పెరగలేదు. ఇక్కడ ఇద్దరుఉపాధ్యాయులు మాత్రమే పనిచేస్తున్నారు. ఇందులో మహిళా ఉపాధ్యాయురాలు ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలోనే బదిలీపై వెళ్లిపోయారు. దీంతో పాఠశాలకు ఏకోపాధ్యాయుడు మిగిలాడు.

అయితే అధికారులేమో ఈ పాఠశాలకు గతంలో ఇద్దరు ఉన్నారని, బదిలీ అయిన ఉపాధ్యాయిని స్థానంలో మరో ఉపాధ్యాయుడిని మాత్రమే నియమించే అవకాశం ఉందని, అంతకు మించి ఎక్కువ మంది ఉపాధ్యాయులను నియమించలేమని చెబుతున్నా రు. ప్రస్తుతం ఉన్న విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను నియమించాలంటే ప్రత్యేక ఉత్తర్వులు జారీ కావాల్సి ఉందని విద్యాశాఖాధికారులు చెబుతున్నారు.  ఈ పరిస్థితుల్లో ఐదు తరగతులకు బోధన విషయంలో ఏకోపాధ్యాయుడు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. విద్యార్థుల సంఖ్యను పరిశీలించి మరో ముగ్గురిని నియమించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇప్పటికే విషయం విద్యాశాఖ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లినా స్పందన శూన్యం. ముందు చూపులేకుండా ఉన్న ఒక్క ఉపాధ్యాయురాలిని బదిలీ చేస్తే ఎలా అని  గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.

ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాం
మా ప్రాథమిక పాఠశాలలో 111 మంది విద్యార్థులు ఉన్నారు. ఓ ప్రభుత్వ పాఠశాలలో ఇంత మంది విద్యార్థులు ఉండడం అరుదు. మా పాఠశాలపై నమ్మకంతో వస్తున్న విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాం. ఒక్కరే అంటే కష్టం అదనంగా ఉపాధ్యాయులు అవసరం. అదనపు ఉపాధ్యాయులను నియమించాలి.  –వెంకటసుబ్బారెడ్డి,
ప్రధానోపాధ్యాయుడు,వరిగొండ గమళ్లపాళెం ప్రాథమిక పాఠశాల

అదనపు ఉపాధ్యాయులను నియమించాలి
క్రమశిక్షణ, చక్కని విద్యాబోధన అందిస్తుండడంతో మా పిల్లలను ఈ పాఠశాలలోనే చేర్పించాం. గతంలో తక్కువ మంది పిల్లలకు ఇద్దరు ఉపాధ్యాయులు సరిపోయేవారు.  ప్రస్తుతం పాఠశాలలో విద్యార్థుల సంఖ్య వంద దాటిపోయింది. ఒక్క ఉపాధ్యాయుడు మాత్రమే మిగిలారు. మరికొందరు ఉపాధ్యాయులను నియమించకపోతే అందరికి నాణ్యమైన చదువులు చెప్పడం కష్టం. అధికారులు స్పందించి పాఠశాలకు అదనపు ఉపాధ్యాయులను వెంటనే నియమించాలి.–మాధవి, విద్యార్థి తల్లి, గమళ్లపాళెం

ఉన్నతాధికారులదృష్టికి తీసుకెళ్లాం
గమళ్లపాళెం ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుల నిమాయకంపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. వాస్తవంగా ప్రస్తుతం పాఠశాలలో ఉన్న 111 మంది విద్యార్థులకు ఐదుగురు ఉపాధ్యాయులు అవసరం. అయితే గతంలో పరిస్థితి అనుగుణంగా బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయిని స్థానంలో మరో ఉపాధ్యాయుడిని మాత్రమే నియమించే అవకాశం ఉంది.       – వేణుగోపాలరెడ్డి, ఎంఈఓ,తోటపల్లిగూడూరు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top