లైఫ్‌తో వీడియోగేమ్‌

Online Games Are Becoming Danger Threat To Children - Sakshi

గతంలో మాదిరిగా ఇప్పుడు పేకాట క్లబ్‌లు పెద్దగా నడవట్లేదు. ఇళ్లలో, పనిచేసే కార్యాలయాల్లో, దుకాణాల్లో, బజారులో ఎక్కడంటే అక్కడ కూర్చుని   సెల్‌ఫోన్‌లో పేకాట (రమ్మీ) ఆడుతున్నారు. పేకాట ఆడేవాళ్లను ఆకర్షిస్తూ అందర్నీ కలిపి ఓ ప్లాట్‌ఫాంగా మార్చారు.  పేకాటరాయుళ్లు, రమ్మీలో సత్తా చాటాలనుకునే వారు అటు చూస్తున్నారు. మొదట్లో డబ్బులు బాగానే వచ్చినా తరువాత నుంచి జేబులు ఖాళీ చేస్తున్నారు. ఆన్‌లైన్‌ రమ్మీ ఆడాలనుకునే వారి బ్యాంకు ఖాతాల నుంచి పందానికి సరిపోయే నగదును ముందుగా సర్దుబాటు చేసుకుంటున్నారు. తరువాత పందెం వస్తే డబ్బులు వేయడం లేదంటే వెనక్కి లాక్కోవడం ఉంటుంది.

సాక్షి, విశాఖపట్నం : ఉదయం లేచిన దగ్గర నుంచి తిరిగి నిద్రపోయే వరకు రోజులో 40 నుంచి 60 శాతం చాలా మంది చేతుల్లో సెల్‌ఫోన్‌ ఉంటుంది. స్మార్ట్‌ఫోన్లు పట్టుకుని ఈ లోకంలో లేనట్లు, తమదైన లోకంలో ఉన్నట్లుగా వీడియో గేమ్‌లు ఆడేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఒక రోజు వీడియో గేమ్‌ ఆడకుంటే ఏదో కోల్పోయామనే భావన వారిలో నెలకుంటోంది. పిల్లలు కార్టూన్‌ నెట్‌వర్క్‌తో పాటు వీడియో గేమింగ్‌కు బానిసలుగా మారుతుంటే, పెద్దలు, ఉద్యోగులు గృహిణులు సైతం ఆ ఆటల్లో లీనమైపోతున్నారు.

సెల్‌ఫోన్‌ పట్టుకుని నిద్రాహారాలు మాని వీడియో గేమ్‌లు ఆడేవారు ప్రతి ఇంట్లోనూ ఉంటున్నారు. వారి జీవనశైలి మిగిలిన వారిపై ప్రభావం చూపించడమే కాకుండా పెద్దల్లో ఆందోళనలు రేకెత్తిస్తోంది. నగరంలో మానసిక వైద్య నిపుణుల వద్దకు వెళ్లే కేసుల్లో వీడియో గేమింగ్‌ వ్యసనంతో అనారోగ్యం బారిన పడిన వారే ఎక్కువ మంది ఉంటున్నారు. తెరపై ఆటలు అనారోగ్యానికి బాటలు వేస్తున్నాయని తెలిసినా చాలా మంది ఆ ఉచ్చులో పడుతున్నారు.

బ్లూవేల్‌ గేమ్‌
చాలామంది ప్రాణాల్ని తోడేసిన విషయం తెలిసిందే. దీంతో ఆ ఆటను నిషేధించారు. పబ్‌జీ అనే ఆట ఇప్పుడు ఎక్కువ మందిని ప్రభావితం చేస్తోంది. ఈ ఆట ప్రపంచం ప్లాట్‌ ఫాంగా నడుస్తోంది. ఆటలో తోటివారు సాయం చేయకపోయినా, తుపాకీ సాయంగా ఇవ్వకపోయినా నేరుగా చిరునామా తీసుకుని దాడులకు తెగబడుతున్న సంఘటనలు సైతం చోటుచేసుకుంటున్నాయి.

గేమింగ్‌ బానిసల లక్షణాలివి.. 

  •  ఇతర పనుల కన్నా మొబైల్‌ లేదా వీడియో గేమ్స్‌కు ఎక్కువ ప్రాధాన్యమివ్వడం
  •  మొబైల్‌ లేదా వీడియో గేమ్‌ చేతిలో ఉంటే గేమ్స్‌ ఆడాలనే కోరికను ఆపుకోలేకపోవడం
  • గేమ్‌ ఆడుతున్న ప్రతిసారీ ఆనందాన్ని పొందుతుండడం
  • గేమ్‌ ఆడడం మొదలెట్టాక, దాన్ని ఎప్పుడు ఆపాలో తెలుసుకోలేకపోవడం
  • గేమ్‌ ఆడడం వల్ల చదువు, ఉద్యోగం లేదా ఇతర పనులపై చెడు ప్రభావం
  • ఎవరైనా 12 నెలల కంటే ఎక్కువ కాలం ఇలా ఉన్నప్పుడు డాక్టర్‌ సలహాలు తీసుకోవాల్సి ఉంటుంది.  

సీఎం సీరియస్‌..
ఆన్‌లైన్‌ రమ్మీని ఇప్పటికే తెలంగాణలో నిషేధించారు. మన రాష్ట్రంలో కూడా ఆన్‌లైన్‌ రమ్మీని నిషేధం చేయాలని ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే జిల్లాలోని చాలా మంది యువకులు, ఉద్యోగులు ఈ గేమ్‌ బారిన పడి రూ.లక్షలు పోగొట్టుకున్నారు. ఆన్‌లైన్‌ ఆట నిర్వహణకు వేదిక ఏర్పాటు చేసిన వారిని పట్టుకుంటే ఈ ఆటకు చెక్‌ పెట్టి వ్యసనం నుంచి చాలా మందిని కాపాడేందుకు అవకాశముంటుంది. పిల్లల వద్ద పెద్దలు సరదాకు కూడా ఈ ఆట ఆడవద్దని మానసిక వైద్య నిపుణుల హెచ్చరిస్తున్నారు. ఈ గేమ్‌పై పోలీసుల నిఘా లేకపోవడంతో సెల్‌ఫోన్, కంప్యూటర్, ట్యాబ్, ల్యాప్‌టాప్‌లలో ప్రత్యక్షమవుతోంది.

ఏం చేయాలి
వీడియో గేమింగ్‌ నుంచి బయటడేందుకు పాఠశాల నుంచి పిల్లలు రాగానే సెలవులు, ఖాళీ సమయాల్లో టీవీ, సెల్‌ఫోన్‌ల వద్దకు పంపించకుండా కాసేపు సరదాగా ప్రకృతిలోకి తీసుకెళ్లి వారితో ఆటలు, క్రీడలు, సంగీతం, నృత్య సాధన చేయించాలని నిపుణులు సూచిస్తున్నారు. పుస్తక పఠనం ముఖ్యంగా వేమన పద్యాలు చదివించడం, మహానీయుల స్ఫూర్తిగాథలు చదివించడం, ఉప కరణాలతో బోధన చేయాలి. ఎన్‌సీఆర్‌టీఈ అమలుచేసే జ్ఞానదర్శిని, ఇస్రోకు చెందిన విజ్ఞాన్‌ప్రసార్, జపాన్‌కు చెందిన ఎన్‌హెచ్‌కే టీవీ చానళ్లు చూపించాలి.

గేమింగ్‌ బాధితుల చికిత్స కోసం మానసికవేత్తలు, మానసిక వైద్య నిపుణుల సాయం తీసుకోవాలి. ఇద్దరూ ఒకే సమయంలో చికిత్స చేయడం వల్ల రోగిలో త్వరగా మార్పు కనిపిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. సాధారణంగా 6–8 వారాల్లో ఈ గేమింగ్‌ వ్యసనం వదిలిపోతుంది. అసలు దీని నుంచి బయటపడే కారణాలను వివరిస్తూ, అసలు గేమ్స్‌ ఆడడం అలవాటు చేయకపోవడమే మంచిదని నిపుణులు సలహా చేస్తున్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top