కంప్యూటర్‌లో బడి!

Online Classes For Students in Lockdown Time - Sakshi

కరోనా సెలవుల నేపథ్యంలో ఆన్‌లైన్‌లో పాఠ్యాంశాల బోధన

వర్చువల్‌ తరగతులతోపాటు టీవీ చానళ్ల ద్వారా పాఠాలు  

అందుబాటులో పలు వెబ్‌సైట్లు, మెటీరియల్స్‌

ఏ పిల్లోడైనా అనుకున్నాడా.. మార్చి నెలలోనే ఎండాకాలం సెలవులు మొదలవుతాయని..ఏ విద్యార్థి అయినా ఆలోచించాడా? పరీక్షలులేకుండానే పాస్‌ అవ్వొచ్చని.. బోలెడు సెలవులున్నా.. ఇల్లుదాటి బయటకు రాకూడదని.. ఏం చేసుకున్నా ఇంట్లోనే అని. ఇదంతా కరోనా ఎఫెక్ట్‌. అయితే పోటీ పరీక్షలకు.. సాధారణ పరీక్షలకు హాజరయ్యేవారిపరిస్థితేమిటి? అందుకే ఆన్‌లైన్‌ తరగతులువచ్చేశాయి. మీ హౌసే కాలేజీ.. మీ గృహమే పాఠశాల!

ఒంగోలు/వెలిగండ్ల: కనోనా విలయం దెబ్బకు వచ్చిన లాక్‌ డౌన్‌తో బడులు మూతబడ్డాయి.. పరీక్షలూ వాయిదా పడ్డాయి. మరి విద్యార్థుల పరిస్థితి ఏంటి? అనే ప్రశ్నకు జవాబు దొరికింది. మే3వ తేదీ వరకు లాక్‌డౌన్‌ ఉన్న నేపథ్యంలో ఆన్‌లైన్‌ ద్వారా పాఠ్యాంశాల బోధన ద్వారా పలు విద్యాసంస్థలు విద్యార్థుల భవిష్యత్‌పై బెంగ లేకుండా చేసే ఏర్పాట్లు చేశాయి.
జిల్లాలో పలు ప్రైవేటు పాఠశాలలు వాట్సాప్‌ ద్వారా తమ విద్యార్థులకు అసైన్‌మెంట్‌లు, హోంవర్కును పంపిస్తున్నాయి. వాటిని దగ్గర ఉండి తల్లిదండ్రులే పిల్లల ద్వారా రాయించి వాట్సప్‌లో అప్‌లోడ్‌ చేస్తే వాటిని ఉపాధ్యాయులు పరిశీలించి మార్కులు కూడా కేటాయిస్తున్నారు.  
పదో తరగతి విద్యార్థులకు త్వరలో నిర్వహించే పరీక్షల్లో విద్యార్థుల సామర్థ్యాలకు పదును పెట్టేందుకుగాను ప్రభుత్వం దూరదర్శన్‌ సప్తగిరి చానల్‌ ద్వారా ఉదయం ఒక గంట, సాయంత్రం ఒక గంట బోధనను అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఓ కార్పొరేట్‌ కాలేజీ వర్చువల్‌ క్లాసురూములను అందుబాటులోకి తీసుకువచ్చింది. విద్యా
ర్థికి ఒక లింక్‌ను వారి వాట్సప్‌కు పంపారు. జూమ్‌ క్లాస్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని అందులో వారి అడ్మిషన్‌ నంబర్‌ టైప్‌ చేస్తే వారు వర్చువల్‌ క్లాసురూంకు అనుసంధానం అవుతారు. విద్యార్థులందరినీ అధ్యాపకులు చూస్తూ వారికి బోధిస్తుంటారు. అదే విధంగా విద్యార్థులకు సందేహాలు వస్తే వారు తమ ఫోన్‌ వద్ద నుంచే అధ్యాపకులను ప్రశ్నలు అడిగే అవకాశం కూడా ఏర్పాటైంది.
మరో కార్పొరేట్‌ కాలేజీ, ఓ టీవీ చానల్‌లో ఉదయం నుంచి సాయంత్రం వరకు దాదాపు 4గంటల పాటు సమయాన్ని బుక్‌ చేసుకుంది. తమ విద్యాసంస్థ విద్యార్థులే కాకుండా ఏ విద్యార్థులు అయినా పాఠ్యాంశాలు వినేందుకు అవకాశం కల్పించింది. అత్యున్నతమైన సామర్థ్యాలు ఉన్న భోదకులను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఐఐటీ జేఈఈ, ఎంసెట్‌ వంటి పోటీ పరీక్షలకు సిద్ధం చేస్తున్నారు.  
ఇవి కాకుండా మన టీవీ ఎ.పి 1, మన టీవీ ఎ.పి 2, మన టీవీ టి.ఎస్‌ 1, మన టీవీ టి.ఎస్‌ 2 చానళ్లు కూడా  పాఠ్యాంశాలను బోధిస్తున్నాయి.  
ఐఐటీ జేఈఈ, ఎంసెట్, జిప్‌మర్, బిట్స్‌ పిలానీ వంటి పోటీ పరీక్షలకు, లాసెట్, ఏ.యు పి.జి సెట్, ఆంధ్రా యూనివర్శిటీ పి.జి సెట్‌ వంటి అనేక పోటీ పరీక్షలకు ప్రిపేర్‌ అయ్యేవారికి సాక్షి ఎడ్యుకేషన్‌.కాం వంటి వెబ్‌సైట్ల ద్వారా పాత ప్రశ్నపత్రాలు, మాదిరి ప్రశ్నపత్రాలతోపాటు పాఠ్యాంశాలకు సంబంధించిన అభ్యసనాన్ని , గైడెన్స్‌ను కూడా అందిస్తున్నాయి.  
అయితే ఆన్‌లైన్‌ తరగతులుండాలంటే కంప్యూటర్‌ లేదా ల్యాప్‌టాప్‌లు ఉండాలని మరి పేద విద్యార్థుల సంగతేంటనే ప్రశ్న ఉదయిస్తుంది. అందుకే దూరదర్శన్, ఒక కార్పొరేట్‌ కాలేజీ ఒక చానల్‌ ద్వారా అందిస్తున్న బోధన, మన టీవీ ఏపీ, మన టీవీ టీఎస్‌కు సంబంధించిన నాలుగు చానళ్లను ఫాలో అయితే కార్పొరేట్‌ విద్యను సైతం సొంతం చేసుకునే సౌలభ్యం ఉంది.

దూరదర్శన్‌ ద్వారా పది విద్యార్థులకు..
ఒంగోలు టూటౌన్‌: లాక్‌డౌన్‌ నేపథ్యంలో పదో తరగతి విద్యార్థులకు ఇంటి వద్ద నుంచి పరీక్షలకు సిద్ధమయ్యేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దూరదర్శిన్‌లోని సప్తగిరి చానల్‌ ద్వారా ఆన్‌లైన్‌ శిక్షణ తరగతులను నిర్వహిస్తోంది. ఇప్పటికే పాఠాల ఆందించే సమయం కూడా నిర్ణయించి అమల్లోకి తీసుకొచ్చారు. ప్రతి రోజూ ఉదయం 10 గంటల నుంచి గంటల వరకు పాఠాలు అందిస్తున్నారు. అదే విధంగా సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు పాఠాలు ప్రసారం అవుతున్నాయి. కరోనా వ్యాధి నివారణలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ విధించడంతో పాఠశాలలు మూతబడ్డాయి. వీటితో పాటు సంక్షేమ వసతి గృహాలు కూడా మూతపడ్డాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రభుత్వం వసతి గృహాల్లో చదువుకుంటున్న పిల్లలందరిని ఇళ్ళకు అధికారులు పంపించి వేశారు. గత నెలలో పిల్లలకు జరపాల్సిన  పరీక్షలు నిలిచిపోయాయి. ఏప్రిల్‌ 14 తరువాత లాక్‌డౌన్‌ ఎత్తి వేస్తారనుకున్న సమయంలో కరోనా కేసులు పెరుగుతున్నదృష్ట్యా మళ్ళీ మే 3 వరకు కేంద్రం పొడిగించింది. ఈ పరిస్థితులలో పదో తరగతి విద్యార్థులకు ఇంకా సిలబస్‌  పూర్తవ్వని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రభుత్వం దూరదర్శిన్‌లోని సప్తగిరి చానల్‌ ద్వారా ఆన్‌లైనలో తరగతులు నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. చానల్‌ ద్వారా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్న విషయాన్ని విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు తెలియజేయాలని సాంఘిక సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ ఎన్‌. లక్ష్మానాయక్‌ ఆదేశించారు. జిల్లాలో ఎస్సీ హాస్టల్స్‌ 79, బీసీ వసతి గృహాలు మరో 67, ఇంకా గిరిజన ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలున్నాయి. వీటిలో పనిచేసే వార్డెన్లు, అసిస్టెంట్‌ సోషల్‌ వెల్ఫేర్‌ అధికారులు, ఉపాధ్యయులను ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమశాఖ జిల్లా అధికారులు అప్రమత్తం చేశారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top