కొనసాగుతున్న పోలీసుల వేట


  •     తప్పించుకు తిరుగుతున్న ఆందోళన కారులు

  •      చీడికాడ, బైలపూడిల్లో భయాందోళనలు

  • చీడికాడ: చీడికాడ, బైలపూడిల్లో పోలీసులపై దాడికి పాల్పడినవారు లొంగిపోకుండా తప్పిం చుకు తిరుగుతున్నారు. రెండో రోజు గురువారం కూడా అల్లరి మూకల వేట ఈ రెండు గ్రామాల్లో కొనసాగింది. దీంతో అంతటా భయాందోళనలు నెలకొన్నాయి. బైలపూడిలో కళ్లాల నుంచి గురువారం ఉదయాన్నే ఇంటికి వస్తున్న ఎనిమిది మందిని పోలీసులు జీపులో ఎక్కించుకొని తీసుకెళ్లారు.



    ఈమేరకు ఆయా కుటుంబాలకు చెందిన మహిళలు స్టేషన్‌కు వ చ్చి తమ వారికి ఈ దాడితో సంబంధం లేదని వాపోయారు. రుజువైతే చర్యలు తీసుకొవాలని చోడవరం ఇన్‌చార్జి సిఐ భూషన్ నాయుడు వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. గంటల తరబడి మహిళలు కదలకపోవడంతో ఆ ఎనిమిది మందిని విడిచిపెట్టాశారు. కాగా దాడిలో ప్రధాన  నిందుతులు పరారీలో ఉండడంతో వారి కుటుంబ సభ్యులను స్టేషన్‌కు పిలిపించి ఏఎస్పీ బాబూజీ విచారణ చేపడుతున్నారు.   



    అనుమానితులుగా ఎవరిని తీసుకుపోతారోనని రెండు గ్రామాల్లోని యువకులను ఆయా తల్లిదండ్రలు ఇప్పటికే గ్రామాలు దాటించేశారు. ఇలా రెండు గ్రామాల్లోనివారు భయం గుప్పిట్లో ఉన్నారు.అయితే  బుధవారం ఉదయం అదుపులోకి తీసుకున్న అనుమానితులు కొందరిని బుధవారం రాత్రే చీడికాడ నుంచి చోడవరం తరలించారు. అయితే ఇన్‌చార్జి సీఐ భూషన్ నాయుడు దీనిని నిర్ధారించడం లేదు. విచారణ ఎన్నిరోజులైనా చేపడతామని, ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదన్నారు.

     

    విచారణ పేరుతో అమాయకుల వేధింపు



    పోలీసులపై దాడి సంఘటనలో అమాయకులను వేధించడం పోలీసులకు తగదని సీపీఎం మండల కార్యదర్శి గంటా శ్రీరాం అన్నారు.గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సంఘటన దురదృష్టకరమే అయినా పోలీసుల తీవ్ర పోకడలతో భయాందోళనలకు గురి చేయడం తగదన్నారు. తప్పు చేసిన వారిపై చర్యలు సబబే కానీ, అమాయకులను విచారణ పేరుతో స్టేషన్‌లో వేధించడం తగదన్నారు.  అధిక సంఖ్యలో పోలీసులు ఇళ్లను చుట్టుముట్టి అమాయకులను భయాందోళనలకు గురిచేస్తున్నారన్నారు. దీనిపై శుక్రవారం ఎస్పీని కలిసి ఇక్కడి విషయాలను వివరిస్తామన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top