ఆస్పత్రికి వెళ్తూ మృత్యుఒడిలోకి!

One dies in road accident - Sakshi

లారీ ఢీకొని యువకుడు దుర్మరణం

శ్రీకాకుళం సింహద్వారం వద్ద ఘటన

మృతుడిది సంతకవిటి మండలం గరికిపాడు 

ఎచ్చెర్ల క్యాంపస్‌: జ్వర పీడితుడిని మృత్యువు వెంటాడింది. చికిత్స చేయించుకునే క్రమంలో ఆస్పత్రికి వెళ్తుండగా లారీ ఢీకొట్టిన ఘటనలో సంతకవిటి మండలం గరికిపాడుకు చెందిన పొగిరి సునీల్‌కుమార్‌(32) మృత్యువాతపడ్డాడు. శ్రీకాకుళం వచ్చే దారిలో కుశాలపురం పంచాయతీ సింహద్వారం వద్ద శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సునీల్‌కుమార్‌ గ్రామంలో కిరాణా వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. విషజ్వరాల నేపథ్యంలో శ్రీకాకుళంలో ప్రైవేట్‌ ఆస్పత్రికి శనివారం ఉదయం వెళ్లాడు.

 వైద్యులు వివిధ టెస్టులు రాయడంతో ల్యాబ్‌లో రిపోర్టుల కోసం నిరీక్షించి కొద్దిసేపటి తర్వాత చిలకపాలెం వైపు వ్యక్తిగత పనిమీద వెళ్లాడు. పని ముగించుకొని తిరిగి సాయంత్రం వైద్యున్ని సంప్రదించేందుకు బైక్‌పై శ్రీకాకుళం పట్టణానికి బయలుదేరాడు. ఈ క్రమంలో సింహద్వారం వద్ద 16వ నంబరు జాతీయ రహదారిపై యూటర్న్‌ తీసుకుంటుండగా విశాఖపట్నం నుంచి ఒడిశా వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. లారీ అతివేగమే ఈ ఘటనకు కారణమని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో సునీల్‌కుమార్‌ తల నుజ్జునుజ్జు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. 

విషయం తెలుసుకున్న జేఆర్‌ పురం సీఐ రామకృష్ణ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. లారీని ఎచ్చెర్ల పోలీసులు స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించారు. ఎచ్చెర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సునీల్‌కుమార్‌కు భార్య సత్యవతి, ఇద్దరు కుమారులు సాహిత్య, వర్షిత్‌ ఉన్నారు. ఈ ప్రదేశంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో వేగ నియంత్రణ సాధనాలు ఏర్పాటు చేసినా వాహనాల అతివేగం వల్ల ఫలితం లేకుండాపోతోంది.   

గరికిపాడులో విషాదం 
సంతకవిటి: సునీల్‌కుమార్‌ మృతితో స్వగ్రామం గరికిపాడులో విషాదఛాయలు అలముకున్నాయి. సునీల్‌కుమార్‌ అంటే ఇద్దరు కుమారులకు ప్రాణం. నిత్యం నాన్న అంటూ తిరుగుతూ ఉంటారు. శని, ఆదివారాలు సెలవుకావడంతో తనతో పాటు తన ఇద్దరు పిల్లలను చిన్నాన్న ఇంటికి తీసుకెళ్లి అక్కడే ఉండి వైద్యం చేయించుకుని రావాలని అనుకున్నాడు. ఇంతలోనే లారీ రూపంలో మృత్యువు వెంటాడటంతో కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top