ఎవరిదీ పాపం?

Officials Neglect On Boat Accidents In East Godavari Kakinada - Sakshi

స్థానికంగా అందని సేవలు

సుదూర ప్రాంతానికి వెళ్లి అందని తీరాలకు..

పడవ ప్రయాణమే గతి అవుతున్న దుస్థితి

ప్రమాదాల బారిన పడుతున్న పరిస్థితి

సాక్షి ప్రతినిధి, తూర్పుగోదావరి ,కాకినాడ:  కచ్చులూరు గ్రామానికి చెందిన కొణతల చిరంజీవి, శివకుమారి దంపతులు తన ఇద్దరు కవల పిల్లలు, పెద్దకుమారుడితో కలిసి వైద్యం చేయించుకునేందుకు పోలవరం ఆస్పత్రికి వెళ్లారు. వైద్యం చేయించుకుని తిరిగి వస్తుండగా లాంచీ ప్రమాదంలో చిక్కుకున్నారు. కవల పిల్లలు, శివకుమారి మృతదేహాలు లభ్యంకాగా ఇంటి యజమాని చిరంజీవి ఆచూకీ దొరకలేదు. స్థానికంగా వైద్యం అందకపోవడం వల్లే సుదూర ప్రాంతానికి వెళ్లి వైద్యం చేయించుకుని వస్తుండగా ప్రాణాలు పోగొట్టుకున్నారు.

వైద్యం నిమిత్తం కచ్చులూరు గ్రామానికి చెందిన నెరం దుర్గమ్మ పోలవరం ఆస్పత్రికి వెళ్లింది. ఆమె కూడా తిరిగి వస్తుండగా ప్రమాదంలో మృతి చెందింది. స్థానికంగా వైద్యం అందక వేరే ప్రాంతానికి వెళ్లి ప్రాణం కోల్పోయింది.

తాళ్లూరుకు చెందిన కొణతల బాబూరావు తన కుమార్తె రాజ్యలక్ష్మితో  పాటు రెండు నెలల వయసున్న మనవడితో కలిసి ప్రసూతి చెక్కు డ్రా చేసేందుకు వెళ్లి బోటు ప్రమాదంలో మృతి చెందాడు.

తాటివాడకు చెందిన కోళ్ల రామిరెడ్డి తన కుమార్తె నడిపూడి అక్కమ్మ మనుమరాలు అశ్వినితో కలిసి ఇందుకూరుపేట విజయబ్యాంక్‌కు వెళ్లారు. అక్కడ తన మనుమరాలు చదువుకోసమని డబ్బులు అవసరమై బ్యాంక్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. వీరిలో మనుమరాలు అశ్విని ప్రాణాలతో బయటపడగా రామిరెడ్డి, అక్కమ్మ గల్లంతయ్యారు.

ఇలా చెప్పుకుంటూ పోతే లాంచీ ప్రమాదంలో చిక్కుకుని మరణించిన వారంతా ఏదో ఒక అవసరార్థం వెళ్లి తనువు చాలించారు. దేవీపట్నం పోలవరం ముంపు మండలం కావడంతో ఇక్కడ ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ ఇందుకూరుపేటకు తరలిపోవడంతో వీరంతా ఆయా అవసరాల కోసం తప్పనిసరిగా బోటు మీద వెళ్లి రావాల్సి వస్తుంది. అదే నేడు ప్రాణాంతకమైంది. అదే ఆయా గ్రామాల్లో మౌలిక వసతులు, దగ్గరలో ఉండే దేవీపట్నంలో కార్యాలయాలు ఉన్నట్టయితే ఇంత హడావుడితో వెళ్లాల్సి ఉండేదికాదు. బాధితులంతా కొండమొదలు, కచ్చులూరు, కె.గొందూరు, తాళ్లూరు, తాటివాడ గ్రామస్తులే. వారికి స్థానికంగా వైద్య సేవలు అందకపోవడంతో సుదూర ప్రాంతాలకు వెళ్లి రావాల్సి వస్తుంది. కొండమొదలులో టెలిఫోన్‌ సౌకర్యంతో పాటు రహదారి సౌకర్యం లేక పడవల పైనే ప్రయాణించాల్సి వస్తుంది. కచ్చులూరులో పది రోజులుగా విద్యుత్‌ సరఫరా కూడా నిలిచిపోయింది. పడిపోయిన విద్యుత్‌ స్థంభాలను పునరుద్ధరింలేదు. దీంతో వారంతా చీకట్లోనే కాలం గడుపుతున్నారు. కానీ ఏ ఒక్క అధికారీ పట్టించుకోలేదు. కె.గొందూరు, తాళ్లూరు, తాటివాడ, కచ్చులూరు గ్రామస్తులకు కూడా పడవ ప్రయాణం తప్పడం లేదు. కనీసం రహదారి సౌకర్యం లేక, వైద్యం అందక ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు కూడా ఇక్కడ ఉన్నాయి.

సామర్థ్యానికి మించి లాంచీ ప్రయాణం
ప్రమాదానికి గురైన లాంచీ సామర్థ్యానికి మించిన బరువుతో ప్రయాణించింది. దేవీపట్నం పోలీస్‌స్టేషన్‌ ఎదురుగానే కిక్కిరిసిన లాంచీ ముందుకు సాగింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం లాంచీలో 58 మందిని ఎక్కించినట్టు స్పష్టమవుతోంది. అలాగే 50 బస్తాల సిమెంటు, 12 బస్తాల బియ్యం, కూరగాయలు, ఇతరత్రా లగేజీతో వెళ్లి ప్రమాదం బారిన పడింది. ఇదే లాంచీ 1992లో పోలవరంలో ప్రమాదానికి గురై 108 మంది చావుకు కారణమయ్యింది. ఇదే లాంచీని ప్రస్తుత యజమాని ఎస్‌కే ఖాజా కొనుగోలు చేసి నడుపుతున్నాడు. ప్రమాదానికి గురైన లాంచీని అదే రోజు ఫిట్‌నెస్‌ టెస్ట్‌ చేసినట్టు అధికారులు చెబుతున్నారు. మరి ఫిట్‌నెస్‌ బాగా ఉన్న లాంచీ అదే రోజు సాయంత్రం ప్రమాదానికి గురవ్వడానికి కారణం ఏమిటో అధికారులే చెప్పాలి. దీన్ని బట్టి లాంచీల పరిశీలన ఏ స్థాయిలో ఉందో అవగతమవుతుంది. ఇటీవల ఒక బోటు అగ్నిప్రమాదానికి గురై దగ్ధమైంది. ఆ ఘటనలో డ్రైవర్‌ చాకచక్యంగా వ్యవహరించడంతో పర్యాటకుల ప్రాణాలకు ఎలాంటి ముప్పు వాటిల్లలేదు. కానీ అదేరోజు ప్రమాదం జరిగి ఉంటే అధిక సంఖ్యలో ప్రాణాలు కోల్పోయేవారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని అయినా పడవల ఫిట్‌నెస్‌పై అధికారులు మరింత ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంది. కానీ ఆ పరిస్థితులు ఉండటం లేదని తాజా లాంచీ ప్రమాదంతో స్పష్టమవుతోంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top