ఎన్టీఆర్ అభినవ అంబేద్కర్: రేవంత్

ఎన్టీఆర్ అభినవ అంబేద్కర్: రేవంత్ - Sakshi


సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు రక్షణగా నిలవటంతోపాటు బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి కృషి చేసిన ఎన్టీఆర్ అభినవ అంబేద్కర్‌గా నిలిచారని తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. పటేల్, పట్వారీ, పెత్తందార్ల వ్యవస్థలో మగ్గుతున్న తెలంగాణ ప్రాంతానికి వారి నుంచి విముక్తి కల్పించిన మహానేత అని, ఆయన తెలంగాణవాదో, సమైక్యవాదో కాదని.. గొప్ప మానవతావాదని కితాబిచ్చారు. టీ బిల్లుపై చర్చలో భాగంగా శనివారం అసెంబ్లీలో రేవంత్‌రెడ్డి సుదీర్ఘంగా ప్రసంగించారు. రాష్ట్ర విభజనకు తొలుత ఇందిరాగాంధీయే నిర్ణయం తీసుకుని తర్వాత వెనుకడుగు వేశారన్నారు. కేసీఆర్ మనసులో ఏమున్నా ఆయన తెలంగాణ కోసం చేసిన ప్రయత్నాలను గుర్తించాలని చెప్పారు. 2008 వరకు తమ పార్టీ సమైక్య నినాదంతో ఉన్న మాట వాస్తవమేనని, ఆ తర్వాత తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుందని తెలిపారు. తెలంగాణ విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ముఖ్యమంత్రి వ్యతిరేకించటం రాజ్యాంగ ద్రోహంగా అభివర్ణించారు.

 

 ఎన్టీఆర్ హయూంలోనే ‘చుండూరు.. కారంచేడు’: ఎన్టీఆర్‌ను అభినవ అంబేద్కర్‌గా పేర్కొనడాన్ని కాంగ్రెస్ సభ్యులు తప్పుబట్టారు. ‘చుండూరు, కదిరికుప్పం, కారంచేడు తదితర ప్రాంతాల్లో దళితుల ఊచకోత ఎన్‌టీఆర్ హయాంలోనే జరిగింది. అలాంటి నాయకుణ్జి అంబేద్కర్‌తో ఎలా పోల్చుతారు..’ అని మాజీ మంత్రి విశ్వరూప్, విప్ గండ్ర ప్రశ్నించారు.

 

 ఓటింగ్ నిర్వహించాల్సిందే: వైఎస్సార్‌సీపీ




 ఇప్పటికైనా శాసనసభలో రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై ఓటింగ్ నిర్వహించాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్ చేసింది. ఉదయం సభ ప్రారంభం  కాగానే పార్టీ సభ్యులు పోడియం వద్దకు వెళ్లి ఓటింగ్ కోసం డిమాండ్ చేశారు. చర్చలో పాల్గొనటం ద్వారా సభ సజావుగా సాగేందుకు సహకరించాలని స్పీకర్ చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చిన సభ్యులు ఓటింగ్ నిర్వహించాల్సిందేనని పట్టుపట్టారు.

 

 మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..

 

 బిల్లు వచ్చిన రోజు కళ్లు మూసుకున్నారా?




 అసెంబ్లీ వేదికగా సీఎం కిరణ్, ప్రతిపక్షనేత చంద్రబాబు మాట్లాడిన తీరు చూస్తే దొంగే దొంగా దొంగా అని అరిచినట్లుంది. ఈ మాటలు బిల్లు వచ్చినరోజే చెప్పి పంపించవచ్చు కదా? వీరిద్దరూ బీఏసీ సమావేశాలకు డుమ్మా కొట్టి, ఇరు ప్రాంత నేతలను పంపి డ్రామాలు చేయించి.. ఇప్పుడు సరికొత్త డ్రామాకు తెరలేపారు. మేం మొదటిరోజు నుంచీ చాలా స్పష్టంగా బిల్లు లోపభూయిష్టంగా ఉందని, సమగ్ర సమాచారం లేదని, సభా నిబంధనలు 77, 78 ప్రకారం బిల్లుపై ఓటింగ్ నిర్వహించి తిప్పిపంపాలని, సభలో సమైక్య తీర్మానం చేయాలని డిమాండ్ చేశాం. అయితే వీరిద్దరూ ఏరోజూ మా డిమాండ్‌కు స్పందించకుండా ప్రజల్ని మభ్యపెట్టారు. బిల్లును రాష్ట్రపతి పంపినందున ‘సమైక్య తీర్మానం’ చేయడం సబబు కాదంటూ మా గొంతు నొక్కారు. రోజూ మేం సభలో డిమాండ్ చేస్తున్నా పట్టించుకోలేదు. కిరణ్, చంద్రబాబులిద్దరూ కుమ్మక్కై బిల్లుపై చర్చ జరపాల్సిందేనంటూ మాపై ఎదురుదాడి చేస్తూ.. మా పార్టీని అపహాస్యం చేశారు. విభజన బిల్లును చర్చకుపెట్టి ఇరుప్రాంత ప్రజలమధ్య మరింత విద్వేషాలు రగిలించారు.

 

 - శోభానాగిరెడ్డి, సుచరిత, నల్లపురెడ్డి, కాపు రామచంద్రారెడ్డి(వైఎస్సార్‌సీపీ)




 కొత్త దుకాణం తెరిచేందుకే కిరణ్ ప్రయత్నం

 బిల్లు తప్పుల తడకంటున్న సీఎం కిరణ్.. 42 రోజులుగా నిద్రపోయారా? ఆయన తీరు చూస్తుంటే ఆయనకు సీమాంధ్ర ప్రజలపై ఉన్నది ప్రేమ కాదని, తపనంతా కొత్త దుకాణం(కొత్తపార్టీ) ఏర్పాటు చేసుకోవడానికే.     

 -కేటీఆర్(టీఆర్‌ఎస్)

 

 రాష్ట్రపతిని అవమానపరిచిన కిరణ్

 తెలంగాణ బిల్లును తిప్పిపంపాలంటూ సీఎం కిరణ్ సభలో వ్యాఖ్యానించిన తీరు రాష్ట్రపతిని అవమానించడమే. బిల్లు తప్పుల తడక అయితే చర్చకు మరింత సమయం కావాలని ఎందుకు కోరారు?   


 -యెన్నం, నాగం (బీజేపీ)

 

 ఇన్నాళ్లూ సభలో ఎందుకు చర్చించినట్లు?

 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు తప్పుల తడకగా ఉందంటున్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఇన్నాళ్లూ సభలో ఎందుకు చర్చ నిర్వహించారు? కిరణ్‌కు చిత్తశుద్ధి ఉంటే పదవికి రాజీనామా చేసి బయటకొచ్చి మాట్లాడాలి. బిల్లుపై స్పీకర్ న్యాయనిపుణులతో చర్చించి బీఏసీ సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకోవాలి.

 -జూలకంటి రంగారెడ్డి(సీపీఎం)




 కిరణ్ క్రిమినల్ లాయర్

 సీఎం కిరణ్ సభలో మాట్లాడిన మాటలు నాలుగున్నర కోట్ల మంది ప్రజల గుండెల్లో గునపం గుచ్చినట్టుగా ఉంది. కిరణ్ తీరు క్రిమినల్ లాయర్ మాదిరిగా ఉంది. పదవిపోయాక లాయర్ కోటు వేసుకుని ప్రాక్టీస్ చేసుకోవాలి.

 -గుండా మల్లేష్(సీపీఐ)

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top