సీఆర్‌పీ కావాలంటే..చెల్లించుకో

సీఆర్‌పీ కావాలంటే..చెల్లించుకో - Sakshi


ఖరీదైన తెల్లని కారు... సోమవారం ఉదయాన్నే శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి వచ్చి ఆగింది! అందులో నుంచి ఇద్దరు వ్యక్తులు తెల్లని ఖద్దరు దుస్తులతో మెరిసిపోతూ దిగారు! అచ్చం రాజకీయ నాయకుల్లా! వీరు మాత్రం ఎప్పుడో టీడీపీ జమానాలో రద్దయిపోయిన అనియత విద్య శిక్షకుల యూనియన్‌ నాయకులట! ఒకరు విశాఖ జిల్లాకు చెందిన మహాత్మ! మరొకరు విజయవాడకు చెందిన వెంకన్న! సిక్కోలులో వారికి పనేమిటి అనుకుంటున్నారా? ఆ అనియత విద్య శిక్షకులుగా పనిచేసినవారికి సీఆర్‌పీలుగా ఉద్యోగం వేయిస్తారట! అధికార పార్టీలో చాలా ముఖ్య నాయకుడితో ఒప్పందం చేసేసుకున్నారట! తలో రూ.30 వేలు చొప్పున పార్టీ ఫండ్‌ ఇస్తామనేది దాని సారాంశమట! ముందుగా ఆరు వేల రూపాయలు అడ్వాన్స్‌గా ఇస్తే ఉద్యోగానికి పిలుపు ఖాయమట! ఇలా జిల్లాలో రూ.కోటి వసూలుకు మాయగాళ్లు వేసిన పక్కా స్కెచ్‌ను ‘సాక్షి, సాక్షి టీవీ’ బట్టబయలు చేశాయి.సాక్షి ప్రతినిధి–శ్రీకాకుళం: గ్రామాల్లో నిరక్షరాస్యులను అక్షరాస్యులు చేసేందుకు 1990 దశకంలో అనియత విద్య (నాన్‌–ఫార్మల్‌ ఎడ్యుకేషన్‌) కేంద్రాలను నిర్వహించేవారు. వీటిని రాత్రిబడులు అని పిలిచేవారు. వీటిని ఫేజ్‌–1, ఫేజ్‌–2 కింద ప్రాథమిక విద్య, తర్వాత ప్రాథమికోన్నత విద్య బోధించేవారు. ఇందుకోసం పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీతో పాటు బీఈడీ, డీఈడీ చేసినవారికి శిక్షకులు (ఇన్‌స్ట్రక్టర్లు), సూపర్‌వైజర్లు, క్లస్టర్లుగా నియమించారు. ఈ పథకానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 80%, 20% చొప్పున నిధులు సమకూర్చేవి. అయితే 2001 సంవత్సరంలో నాటి టీడీపీ ప్రభుత్వం ఈ రాత్రి బడులను రాష్ట్రవ్యాప్తంగా ఎత్తివేసింది.  సుమారు 20 వేల మంది ఉపాధి కోల్పోయారు. వారంతా సమష్టిగా పోరాటం చేసినా ఫలితం లేకపోయిది. అయితే వారిలో బీఈడీ, డీఈడీ అర్హత ఉండి, 45 ఏళ్లలోపు వయస్సు ఉన్నవారిని ఎంఈవో కార్యాలయాలల్లో సీఆర్‌పీలుగా నియమిస్తూ 2006 సంవత్సరంలో (జీవో 73) ఆదేశాలిచ్చింది.జీవో 93 ముసుగు...

సర్వశిక్షా అభియాన్‌ (రాజీవ్‌ విద్యామిషన్‌) కార్యకలాపాల పర్యవేక్షణలో ప్రధాన ఉపాధ్యాయులకు సహాయకు (క్లస్టర్‌ రిసోర్స్‌ పర్సన్‌)లను నియమించేందుకు 2016, నవంబరు 25వ తేదీన ప్రభుత్వం 93 జీవో జారీ చేసినట్లు విశాఖ జిల్లాకు చెందిన మహాత్మ, విజయవాడకు చెందిన వెంకన్న ఇద్దరూ ఒక ప్రతిని తమవెంట తీసుకొచ్చారు. నాటి టీడీపీ ప్రభుత్వ నిర్ణయంతో ఉపాధి కోల్పోయిన అనియత విద్య సిబ్బంది జిల్లాలో 346 మంది ఉన్నారు. వారందరి పేర్లు, చిరునామా, ఫోన్‌ నంబర్లు సహా వివరాలు సేకరించి ఒక జాబితా రూపొందించారు. వారందరికీ గత ఏడాది విశాఖలోని వుడాపార్కులో సమావేశం ఏర్పాటు చేశారు. తర్వాత విజయనగరం జిల్లాలో, రెండు నెలల క్రితం టెక్కలిలో కూడా సమావేశాలు నిర్వహించారు. నాన్‌ఫార్మల్‌ ఎడ్యుకేషన్‌ సూపర్‌వైజర్స్, ఇన్‌స్ట్రక్టర్స్‌ అసోసియేషన్‌ తరఫున అధికార పార్టీలో ముఖ్య నాయకులతో మంతనాలు చేస్తున్నామని వారిని నమ్మించారు. పార్టీ ఫండ్‌గా రూ.30 వేల చొప్పున ఇస్తే సీఆర్‌పీ పోస్టింగ్‌ ఖాయమని చెప్పారు.అడ్వాన్సు వసూళ్లు

శ్రీకాకుళంలోని ఒక ప్రైవేట్‌ సంస్థ కార్యాలయం వద్దకు అనియత విద్య మాజీ సిబ్బందిని సోమవారం వసూలు రాయుళ్లు పిలిపించారు. ‘‘అధికార పార్టీకి ఫండ్‌ ఇస్తామని చెప్పాం. ఇప్పుడు డబ్బులు కట్టినవారి పేర్లు పార్టీ ఆఫీసుకు పంపిస్తాం. ఈ ఉద్యోగాలకు వెయ్యి మంది దరఖాస్తు చేసుకున్నా డబ్బులు కట్టిన 246 మంది పేర్లను పోస్టింగ్‌ జాబితాలో చేర్చిన తర్వాతే మిగతావారికి పోస్టులు ఉంటాయి’’ అని మహాత్మ, వెంకన్న ఇద్దరూ నమ్మించారు. అలా నమ్మించి 246 మంది నిరుద్యోగుల నుంచి రూ.6 వేల చొప్పున అడ్వాన్సు వసూలు చేశారు. ఈ ఉచ్చులో చిక్కుకొని 346 మంది రూ.30 వేలు చొప్పున పార్టీ ఫండ్‌ చెల్లిస్తే ఆ మొత్తం రూ.కోటి పైమాటే!

ఆ జాబు నిజమేనా?మహాత్మ, వెంకన్నలకు డబ్బులు చెల్లించిన వారిలో డిగ్రీ ఉత్తీర్ణులు 105 మంది, ఇంటర్‌ 74 మంది, పదో తరగతి ఉత్తీర్ణులు 67 మంది ఉన్నారు. సీఆర్‌పీలుగా జాబ్‌లో చేరిన తర్వాతే రూ.30 వేలు చెల్లించాలని మహాత్మ, వెంకన్న చెప్పారు. అయితే బీఈడీ లేకపోయినా, 57 ఏళ్లలోపు వయస్సున్నా సీఆర్‌పీగా ఎలా నియమిస్తారనే సందేహం అక్కడివారిలో వ్యక్తమైంది. రూ.లక్ష ఇస్తే జాబితాలో కొత్తగా పేర్లు చేర్చవచ్చని, రూ.12 వేలు అడ్వాన్సుగా ఇవ్వాలని అడిగారు. ఇది కూడా గందరగోళానికి దారితీసింది. గత మూడేళ్లలో కొత్తగా ఉద్యోగాల భర్తీ లేకపోవడం, ఉన్న కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ సిబ్బందినీ తగ్గించేస్తున్న నేపథ్యంలో అసలు ఆ జీవో, జాబు నిజమేనా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top