రుణమాఫీ లేనట్టే..!

రుణమాఫీ లేనట్టే..! - Sakshi


 బ్యాంకులకు ఆంధ్రప్రదేశ్ రైతులు బకాయిలు కట్టాల్సిందే

 ప్రతిగా ప్రభుత్వం తరఫున రైతులకు బాండ్లజారీ

 బకాయి చెల్లిస్తేనే బ్యాంకుల నుంచి కొత్త రుణాలు

 ఇప్పుడు బాండ్ల జారీ.. తర్వాతి నాలుగేళ్లలో డబ్బుల చెల్లింపు

 పలు రకాల కసరత్తుల తర్వాత ప్రభుత్వం తేల్చిందిదీ

 బ్యాంకుల సీఎండీలతో చంద్రబాబు సమీక్ష

 

 సాక్షి, హైదరాబాద్: అక్షరాలా కోటి మంది రైతుల రుణాల మాఫీపై ప్రభుత్వం చేతులెత్తేసింది. ప్రస్తుతానికి రైతులే రుణాలను చెల్లించేయూలన్నట్టుగా చెప్పేసింది. రైతులు చెల్లించిన మొత్తాలకు బాండ్లు జారీ చేసి తదనంతర కాలంలో చెల్లింపులు చేస్తామంటూ కొత్త ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో రూ.87,612 కోట్ల రైతుల రుణాలను మాఫీ చేస్తామన్న ప్రభుత్వం ఇంతకాలం రకరకాల కసరత్తుల పేరుతో కాలయాపన చేస్తూ వచ్చింది. ఇప్పటికీ సమస్యకు పరిష్కారం చూపకపోగా దాన్ని మరింత సంక్లిష్టంగా మార్చింది. రుణాలను ముందు రైతులే చెల్లించుకుంటే.. ప్రభుత్వ బాండ్ల ద్వారా నాలుగేళ్లలో డబ్బులిచ్చే విధంగా ఏర్పాటు చేస్తామని స్పష్టం చేసింది.

 

 సోమవారం లేక్‌వ్యూ అతిథిగృహంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 23 బ్యాంకులకు చెందిన సీఎండీలతో రుణమాఫీపై సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం 20 శాతం నిధులను బ్యాంకులకు చెల్లిస్తామని, ఆ నిధులను వడ్డీ కింద జమ చేసుకుని రైతుల రుణాలను రెన్యువల్ చేయాలని బ్యాంకర్లను కోరారు. దీనిపై బ్యాంకర్లు స్పందిస్తూ ఏడుగురితో సబ్ కమిటీ ఏర్పాటు చేసుకుని, మంగళవారం చర్చించుకుని విషయం తెలియజేస్తామని తెలిపారు. ఖరీఫ్ సీజన్ ముగిసిన నేపథ్యంలో అక్టోబర్ వరకు ఖరీఫ్ రుణాల మంజూరును పొడిగించాలని ఎస్‌ఎల్‌బీసీ ద్వారా ఆర్బీఐని, అలాగే పంటల బీమా గడువు కూడా ముగిసినందున ఆ గడువును కూడా అక్టోబర్ వరకు పొడిగించాలని బీమా కంపెనీని కోరతామని చంద్రబాబు బ్యాంకులకు చెప్పారు. ఇలావుండగా రాష్ట్ర ప్రభుత్వం రైతుల రుణాలకు చెందిన వడ్డీ చెల్లింపు కింద ప్రస్తుతం రూ.6 వేల కోట్లను (20 శాతం) బ్యాంకులకు చెల్లిస్తుంది. అంటే మిగతా 80 శాతం రుణాలను రైతులే బ్యాంకులకు చెల్లించుకోవాలి. ఆ తరువాత నాలుగేళ్ల కాలంలో రైతులకు బాండ్ల రూపంలో డబ్బులు ఇవ్వడానికి ప్రత్యేకంగా రైతు సాధికారత కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారు.

 

  ఈ కార్పొరేషన్ ఏర్పాటు ఫైలుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి సోమవారం ఆమోదం తెలిపారు. లక్షన్నర రూపాయల అప్పు ఉంటే ఆ రైతుకు ఒక్కొక్కటి రూ.25 వేల చొప్పున ఆరు బాండ్లను జారీ చేస్తారు. ఆ బాండ్లకు కాలపరిమితి విధిస్తారు. ఆ సమయంలోగా కార్పొరేషన్‌కు వచ్చి 10% వడ్డీతో డబ్బులు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వం రైతుల రుణ మాఫీకి పలు షరతులతో కూడిన మార్గదర్శకాలను జారీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఏ రైతుల రుణాలు రెన్యువల్ చేయాలి, ఏ రైతులు రుణ మాఫీకి అర్హులనేది తేలకుండా ఏ రైతుల రుణాలకు సంబంధించిన వడ్డీని ప్రభుత్వం చెల్లిస్తుందనే సమస్య నెలకొంది. అసలు రుణ మాఫీ అర్హుల జాబితా ఇప్పటివరకు ఖరారే కాలేదు. దీనికి పది నుంచి పదిహేను రోజుల సమయం పడుతుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఆరు నెలల్లోగా రైతు సాధికారత కార్పొరేషన్‌కు అప్పులు ఇవ్వాల్సిందిగా బ్యాంకులను చంద్రబాబు కోరారు. అయితే ఆరు నెలల్లో కదా.. మార్గదర్శకాల ప్రకారం అప్పుడు ఆలోచిస్తామని బ్యాంకర్లు పేర్కొన్నారు.

 

 ‘రైతు సాధికారత’కు కార్పొరేషన్

 

 సాక్షి, హైదరాబాద్: రైతు సాధికారత కార్పొరేషన్ (ఫార్మర్స్ ఎంపవర్‌మెంట్ కార్పొరేషన్) ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. అక్టోబర్ 1న జరిగే మంత్రివర్గ సమావేశంలో కార్పొరేషన్ ఏర్పాటుకు ఆమోదముద్ర వేస్తారు. కార్పొరేషన్‌కు ప్రభుత్వం తొలుత ఐదు నుంచి  7 వేల కోట్లను మూలధనంగా ఉంచుతుంది. ఈ కార్పొరేషన్‌కు ఐఏఎస్ అధికారి ఎండీగా వ్యవహరిస్తారు. డెరైక్టర్లు కూడా ఉంటారు. బ్యాంకుల నుంచి గతంలో వ్యవసాయ రుణాలు తీసుకున్న రైతులకు ఒక్కొక్కటి రూ.25 వేల ముఖ విలువ గల బాండ్లను ప్రభుత్వం జారీ చేస్తుంది. వచ్చే ఏడాది జనవరి1 నుంచి ఈ బాండ్లను రైతులు అవసరమైతే కార్పొరేషన్‌కు అప్పగించి నగదు తీసుకోవచ్చు. కార్పొరేషన్ ఏర్పాటు సమయంలో ప్రభుత్వం  సమకూర్చే మూలధనాన్ని రైతులు చెల్లించాల్సిన రుణాల స్థానంలో బ్యాంకులకు చెల్లిస్తారు. ఎంపీ సుజనా చౌదరి నేతృత్వంలోని ప్రభుత్వ వనరుల సమీకరణ కమిటీ సోమవారం తొలుత బ్యాంకర్లతో సమావేశమైంది. ఆ తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు బ్యాంకర్లు, వనరుల సమీకరణ కమిటీతో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రణాళికా మండలి వైస్‌చైర్మన్ చెరుకూరి కుటుంబరావు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేష్ పాల్గొన్నారు.అనంతరం వివరాలను కుటుంబరావు, రమేష్ తదితరులతో కలిసి సుజనా చౌదరి మీడియాకు వెల్లడించారు. పలువురు బ్యాంకు ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారని తెలిపారు. సుజనా చౌదరి విలేకరుల సమావేశంలో వెల్లడించిన, ఆ తరువాత ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు కుటుంబరావు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేష్ అందచేసిన వివరాల ప్రకారం....

 

  కార్పొరేషన్ ఏర్పాటు గురించి బ్యాంకర్లకు వివరించాం. కార్పొరేషన్‌కు ప్రభుత్వం మూలధనం సమకూర్చటం, ఆ మొత్తాన్ని కార్పొరేషన్ బ్యాంకులకు చెల్లించటం గురించి తెలిపాం. వారు ఒక సబ్ కమిటీని నియమించుకున్నారు. మంగళవారం జరిగే బ్యాంకర్ల సమితి సమావేశం సమయానికి వారి నిర్ణయాన్ని వెల్లడిస్తారు.

  రాష్ట్రం లోటు బడ్జెట్‌తో ఉంది. దాన్ని అధిగమించేందుకు ఒకవైపు చర్యలు తీసుకుంటూనే మరోవైపు రైతాంగానికి రాష్ట్రం ఉమ్మడిగా ఉన్న సమయంలో ఇచ్చిన రుణమాఫీ హామీని అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అందులో భాగంగానే ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నాం. దీనికి ప్రస్తుతం ఉన్న కార్పొరేషన్‌లకు సంబంధం ఉండదు.  

  రుణమాఫీపై చేసిన ప్రతిపాదనను బ్యాంక ర్లు సూత్రప్రాయంగా అంగీకరించారు. బ్యాం కులు ప్రస్తుతం ఉన్న రుణాలను బుక్ ఎడ్జెస్ట్ చేసుకుని కొత్తవి ఇవ్వాల్సిందిగా కోరాం.

  ఈ నెలాఖరుకు బీమాకు సంబంధించి గడువు ముగిసిందని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. స్టేట్ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌తో మాట్లాడాం. వారు మరో నెల రోజులు గడువు పొడిగించారు. రైతులు చెల్లించాల్సిన బీమా మొత్తాన్ని మేం ఏకమొత్తంగా చెల్లిస్తాం.

  ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంవల్ల 96 శాతం మంది రైతులకు ప్రయోజనం కలుగుతుంది. బ్యాంకుల నుంచి రైతులు రుణాలు తీసుకున్నా... ప్రస్తుతం రుణమాఫీ అనే పద ం లేదు. రైతులకు కొత్త రుణాలు వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top