యానాదులం..అభివృద్ధిఎరుగం

No Facilities For Tribals In West Godavari - Sakshi

సాక్షి, కాళ్ల (పశ్చిమగోదావరి) :  ఎన్నో ఏళ్లుగా ఎదుగూబొదుగూ లేని బతుకులు.. ఇప్పటికీ చీకటిలోనే జీవితాలు.. ఇన్నాళ్లూ పరిపాలించిన ప్రభుత్వాలు వారి జీవన విధానంలో ఎటువంటి మార్పును తీసుకురాలేకపోయాయి. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా కట్టుకోవడానికి సరైన బట్ట, నివాసం లేక కాలువ, పొలాల గట్ల మీద కాలం వెళ్లదీస్తున్నారు. జిల్లాలోని కాళ్ల మండలంలో వీరు ఎక్కువగా ఉన్నారు. కాళ్ల, దొడ్డనపూడి, ఏలూరుపాడు గ్రామాల్లో సుమారు 10 కుటుంబాలు ఈ విధంగానే జీవిస్తున్నాయి. సరైన గూడు లేక ఎండకు ఎండి, వానకు తడుస్తూ కనీసం కరెంటు సౌకర్యం లేకుండా చీకట్లోనే జీవిస్తున్నారు. పొలాల్లో ఎలుకలను, కాలువల్లో చేపలను పట్టుకుని జీవించడం వీరి వృత్తి. కనీసం వీరి పిల్లలు చదువు సంధ్య లేకుండా పొలాలగట్లపై తిరుగుతున్నా ఏ అధికారి పట్టించుకున్న పాపాన పోలేదు. 

20 ఏళ్లుగా కాలువ గట్టునే.. 
కాళ్ల మండలంలోని దొడ్డనపూడి పంట కాలువ గట్టును ఆనుకుని సుమారు 20 ఏళ్లుగా రావూరి బ్రహ్మం, రావూరి శ్రీను కుటుంబాలు జీవిస్తున్నాయి. కనీసం వీరికి రేషన్‌కార్డులు కూడా లేవు. కొన్నేళ్ల క్రితం వీరు చీకట్లో ఉండటం చూసి విద్యుత్‌ స్తంభం వేశారు. అయితే ఆ విద్యుత్‌ స్తంభం పాడైపోయి ఏడాదిన్నర గడుస్తున్నా కరెంటు కనెక్షన్‌ మాత్రం ఇవ్వలేదని బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. దిక్కతోచని స్థితిలోనే పాములు, పురుగుల మధ్య కాళం వెళ్లదీస్తున్నామని చెప్పారు. అదే కాలువ గట్లను ఆనుకుని ఉన్న ఆక్వా చెరువులకు విద్యుత్‌ ఆగితే నిమిషాల మీద పనిచేసే అధికారులు పేదలు చీకట్లో మగ్గుతున్నా పట్టించుకోవడం లేదని గ్రామంలో పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖాధికారులు పట్టించుకుని విద్యుత్‌ లైట్లు వేయాలని, అదే విధంగా రేషన్‌కార్డులు అందించి, సౌకర్యాలు కల్పించాలని వారు కోరుతున్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top