శ్మశానం లేదు.. ఉన్నా వదలరూ.!

No Burial Grounds In Chenchupalem Prakasam - Sakshi

శాశ్వత నిద్రకు ఆరడుగుల నేల కరువయ్యింది. బతికినంత కాలం కష్టాలను వెల్లదీసిన బతుకులకు చివరికి శ్మశానంలో కూడా ఉండటానికి జాగా లేదు. ఉన్న శ్మశానాలను కూడా అక్రమార్కులు ఆక్రమించుకుంటున్నారు. దహన సంస్కారాలకు చోటు లేకపోవడంతో ఏ వాగులోనో వంకలోనో చేయాల్సిన దుస్థితి మండలంలో ఏర్పడింది.

సాక్షి, పొన్నలూరు (ప్రకాశం): మండలంలోని పలు గ్రామాల్లో శ్మశాన స్థలాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శ్మశాన స్థలాలు కరువడంతో మృతి చెందిన తరువాత ఆరుడగుల నేల దొరకని పరిస్థితి నెలకొంది. గత ప్రభుత్వం శ్మశానాల ఏర్పాటులో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో స్థలం లేక ఆయా గ్రామాల ప్రజలు వాగులు, వంకలు, రోడ్లు పక్కనే అంత్యక్రియలు చేస్తున్నారు.

వాగులోనే దహన సంస్కారాలు..
చెంచుపాలెం గ్రామంలో సుమారుగా 140 కుటుంబాలు జీవిస్తున్నాయి. గ్రామం ఏర్పడింది మొదలు శ్మశానం లేక గ్రామ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో ఎవరైన చనిపోతే శ్మశాన స్థలం లేక గ్రామానికి సమీపంలో ఉన్న వాగులోనే దహన సంస్కారాలు చేస్తున్నారు. గ్రామానికి శ్మశాన స్థలం లేక కొన్నేళ్లుగా గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొందరైతే చేసేదేమి లేకా వారి సొంత పొలాల్లో మరణించిన వారిని పూడ్చుతున్నారు. ఎవరు మరణించినా వాగులోనే ఖననం చేస్తుండడంతో వర్షం వచ్చి వాగులో నీళ్లు నిలబడినప్పుడు నానా అవస్థలు పడుతున్నారు. ఒక్కొక్కసారి చేసేదేమిలేకా వాగులో నీళ్లలోనే మృతదేహాలను దహనం, ఖననం చేస్తున్నారు. అలాగే జెడ్‌ మేకపాడు, ముత్తరాసుపాలెం, బోగనంపాడు, చౌటపాలెం, కోటపాడు వంటి గ్రామాల్లో కొన్ని కులాల వారికి సరైన శ్మశాన స్థలాలు లేక అవస్థలు పడుతున్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో ఆయా గ్రామాల ప్రజలు పలుమార్లు అధికారులకు వినతి పత్రాలు సమర్పించిన పట్టించుకోలేదు. అయితే ఇటీవల కూడా ఆయా గ్రామాల ప్రజలు శ్మశాన స్థలం కేటాయించాలని స్థానిక అధికారులకు అర్జీలు సమర్పించారు.

ఉన్న శ్మశాన స్థలాలు ఆక్రమణ..
ఇదిలా ఉంటే కొన్ని గ్రామాలకు శ్మశాన స్థలాలు లేక ప్రజలు వాగులు, వంకల్లో అంత్మక్రియలు చేపడుతూ నానా తంటాలు పడుతుంటే, మర్రి కొన్ని గ్రామాల్లో ఉన్న శ్మశాన స్థలాలను అక్రమార్కులు ఆక్రమించి సొంతం చేసుకుంటున్నారు. పెదవెంకన్నపాలెం గ్రామంలో ఎస్సీల కేటాయించిన శ్మశాన స్థలానికి స్థానికులు కొందరు దాదాపుగా ఎకరా వరకు ఆక్రమించి జామాయిల్‌ పంటలు సాగుచేశారు. సమాధులు ఉన్నప్పటికి కూడా వాటి వరకు వదిలేసి జామాయిల్‌ పంటను సాగు చేశారు. అలాగే కల్లూరివారిపాలెంలో కూడా ఎస్సీలకు కేటాయించిన శ్మశాన స్థలానికి అక్రమార్కులు ఆక్రమించి చదును చేశారు. అయితే ఈ ఆక్రమణలపై ఎస్సీ కాలనీ ప్రజలు నిలదియ్యడంతో కొంత స్థలాన్ని వదిలేశారు. పొన్నలూరులో కూడా ఎస్సీలకు కేటాయించి శ్మశాన స్థలాన్ని చుట్టు పక్కల పొలాలు ఉన్నవారు కొంత మేర దున్నుకుని సొంతం చేసుకున్నారు. ఇలా చాలా గ్రామాల్లో ఉన్న శ్మశానాలను అక్రమార్కులు ఆక్రమించుకోని స్థానిక ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మొత్తంగా కొన్ని గ్రామాల్లో శ్మశాన స్థలాలు లేక ప్రజలు ఇబ్బందులపడుతుంటే, మరికొన్ని గ్రామాల్లో ఉన్న స్థలాలను అక్రమార్కులు ఆక్రమించి చదును చేస్తున్నారు.

శ్మశాన స్థలం కేటాయించాలి
మా గ్రామంలో 140 కుటుంబాల జీవిస్తున్నాయి. అయితే శ్మశాన స్థలం లేక కొన్నేళ్లుగా గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో ఎవరైనా మృతి చెందితే శ్మశాన స్థలం లేక గ్రామానికి పక్కనే ఉన్న వాగులో అంత్యక్రియలు చేస్తున్నాము. దీనిపై అధికారులు స్పందించి శ్మశాన స్థలాన్ని ఏర్పాటు చేయాలి.
- మూలే సుబ్బయ్య, చెంచుపాలెం

ఆక్రమణకు పూనుకుంటున్నారు
గ్రామంలోని ఎస్సీలకు సంబంధించిన శ్మశాన స్థలం ఆక్రమణకు  కొందరు గ్రామస్తులు ప్రయత్నించారు. అయితే కాలనీ ప్రజలు అడ్డుతగలడం వలన కొంత మేర వదిలిపెట్టారు. అధికారులు స్పందించి శ్మశాన స్థలాన్ని అక్రమార్కులు ఆక్రమించకుడా హద్దులు ఏర్పాటు చేయాలి. అలాగే చుట్టూ ప్రహరీ నిర్మించి, శ్మశాన వాటికను నిర్మించాలి.
- కప్పల దానియేలు, కల్లూరివారిపాలెం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top