ఆ ఖాకీలపై చర్యలేవీ?

No Action on Corruption Police in Anantapur - Sakshi

అధికార ముసుగులో అరాచకాలు

డీఎస్పీలు, సీఐలు చెప్పినట్లు వినాల్సిందే!

ప్రశ్నిస్తే బదిలీ వేటు.. జనంపై అక్రమ కేసులు

ఆ డీఎస్పీలు, సీఐలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు?

సాక్షి ,చిత్తూరు  , టాస్క్‌ఫోర్స్‌: పోలీసులకు ఆ డీఎస్పీలు, సీఐలు అంటే హడల్‌.  అధికార ముసుగులో వారి అరాచకాలు అడ్డేలేకుండా పోయింది. పోలీసు శాఖలో పనిచేసే కొందరు అధికారులు..రాజకీయ పార్టీ నాయకులు, సామాన్య జనం వాళ్లు చెప్పింది వినాలి. ఎదిరిస్తే శంకరిగిరి మాన్యాలకు పంపటం...అక్రమ కేసులు బనాయించి చిత్రహింసలకు గురిచేయడం వీరి నైజం. ప్రస్తుతం వీరంతా బదిలీలు, ఉద్యోగోన్నతుల కోసం పైరవీలు చేస్తున్నారు. మరోవైపు ఇక్కడి నుంచి ఇతర జిల్లాలకు వెళ్లిన వారు తిరిగి వచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా వారికి అనుకూలంగా ఉన్న కొందరు ఉన్నతాధికారుల ద్వారా ప్రయత్నాలు ప్రారంభించారు. విషయం తెలుసుకున్న బాధితులందరూ ఏకమయ్యారు. జిల్లాలో పనిచేసి ఇతర జిల్లాకు బదిలీపై వెళ్లిన వారందరి జాబితాతో పాటు అవినీతి అక్రమాలకు సంబంధించిన ఆధారాలతో ఉన్నతాధికారులను కలిసి వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. బాధితుల కథనం మేరకు..టీడీపీ ప్రభుత్వంలో చిత్తూరులో ఎస్బీ డీఎస్పీగా పనిచేసిన అధికారి గురించి కుప్పం నుంచి అమరావతి వరకు తెలియని వారు ఉండరు. ఇతను విధులను పక్కనపెట్టి టీడీపీ కోసం అహర్నిశలు పనిచేశారు. జిల్లా పోలీసు యంత్రాంగం ఇతని కనుసన్నల్లోనే పనిచేసింది. ఆయన ఆదేశం లేనిదే ఎలాంటి బదిలీలు, ఉద్యోగోన్నతులు ఉండని పరిస్థితి. ఆయనపై పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయి. కోట్ల రూపాయలు కూడబెట్టుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈయన అనంతపురం జిల్లాలో పనిచేస్తున్నారు. తిరిగి చిత్తూరుకు బదిలీ చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.

కేసులు ఉన్నా క్లీన్‌చిట్‌!
చిత్తూరు ట్రాఫిక్‌ డీఎస్పీగా పనిచేసి ప్రస్తుతం అమరావతికి బదిలీపై వెళ్లిన ఆయన గతంలో ఏసీబీకి పట్టుబడ్డారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే కేసును కొట్టేయించుకున్నారు. టీడీపీ కోసం ప్రతిపక్షపార్టీ నేతలను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేశారనే ఆరోపణలు ఉన్నాయి. చిత్తూరు, అర్బన్‌ జిల్లాలో ఏ పోలీసుకు బదిలీ, ప్రమోషన్‌ కావాలన్నా ఆ ఇద్దరు సీఐలను కలవాలి. వారిలో ఒకరు రేణిగుంట సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేశారు. మరొకరు తిరుపతిలో పనిచేసేవారు. ఎన్నికల సమయంలో టీడీపీకి లబ్ధి చేకూర్చేందుకుగాను గతంలో పనిచేసిన ఎస్బీ డీఎస్పీ వీరిద్దరినీ అమరావతికి బదిలీ చేయించుకున్నారు.  వీరిద్దరూ ఆ డీఎస్పీతో సమానంగా అమరావతి వరకు తమ పలుకుబడి పెంచుకుని టీడీపీకి తలలో నాలుకలా వ్యవహరించారు. ఈ ముగ్గురూ మాజీ డీఐజీకి అత్యంత సన్నిహితులు కావడం గమనార్హం!
చిత్తూరు స్పెషల్‌ బ్రాంచ్‌లో పనిచేస్తున్న మరో పోలీసు అధికారి టీడీపీ ఏజెంట్‌గా పనిచేశారనే ఆరోపణలు ఉన్నాయి. టీడీపీ కార్యకర్తలు ఎవరైనా వైఎస్సార్‌సీపీలో చేరుతున్నారనే సమాచారం వచ్చిన వెంటనే అక్కడికి వెళ్లి వారిని బెది రించి టీడీపీ వీడకుండా జాగ్రత్తలు తీసుకునేవారు. ఇదిలా ఉంటే... అనంతపురం జిల్లా ధర్మవరంలో పనిచేసిన ఒక సీఐ ఓ హత్య కేసులో హంతకుల బదులు వేరొకరిని చూపించారనే ఆరోపణ లు ఉన్నాయి. ఆ సీఐ మదనపల్లెకు బదిలీ చేశారు.

ఇసుక మాఫియాకు అండదండలు
రేణిగుంట సీఐగా పనిచేసిన ఓ పోలీసు అధికారి ఏర్పేడు ఇసుక మాఫియా నాయకులకు అనుకూలంగా పనిచేశారనే విమర్శలు ఉన్నాయి. 16 మంది ప్రాణాలను బలిగొన్న ఇసుక మాఫియాపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంలో  ఆయన పాత్ర ఉందని బాధితుల ఆరోపణ. అయితే ఇతనికి వైఎస్సార్‌ కడప జిల్లా కోడూరు సీఐగా బాధ్యతలు అప్పగించారు.
చిత్తూరు స్పెషల్‌ బ్రాంచ్‌లో ఉంటూ... వైఎస్సార్‌సీపీపై నిఘా ఉంచి బలమైన నాయకులను ఇద్దరు సీఐలు బెదిరించేవారు. ఎవరైనా టీడీపీలో నుంచి వైఎస్సార్‌ సీపీలోకి వచ్చిన వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేసేవారు.
కర్నూలు నుంచి ఉద్యోగోన్నతిపై వచ్చి తిరుపతి ఈస్ట్‌ సీఐగా పనిచేసిన చంద్రబాబు నాయుడుపై పలు ఆరోపణలు ఉన్నాయి. ఆయనపై మూడు కేసులు ఉన్నా ఎన్నికల కమిషన్‌ను తప్పదోవ పట్టించి విధులు నిర్వర్తించారని పోలీసు శాఖలో ప్రచారం సాగుతోంది. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను బెదిరించి వారి నుంచి పెద్ద ఎత్తున డబ్బులు తీసుకుని తిరిగి అక్రమ కేసులు బనాయించినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.
ప్రొద్దుటూరులో పనిచేసిన ఇద్దరు సీఐలలో ఒకరు గతంలో నగరిలో పనిచేశారు. ఆ సమయంలో టీడీపీకి వ్యతిరేకంగా పనిచేసే వారిపై కక్షగట్టి తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. అక్రమ కేసులు బనాయించి చిత్రహింసలు పెట్టేవారనే విమర్శలు ఉన్నాయి.
మరో సీఐ పాకాలలో పనిచేసే సమయంలో పశువుల, క్వారీ అక్రమ వ్యాపారంలో కీలక పాత్ర పోషించారనే ఆరోపణలు ఉన్నాయి.
పీలేరు రూరల్‌ సీఐగా పనిచేసిన మరో అధికారి నోట్ల రద్దు సమయంలో ఓ మార్వాడీ వద్ద రూ.20 లక్షల నగదును స్వాధీనం చేసుకుని ప్రభుత్వానికి లెక్క చూపకుండా బాధితులను బెదిరించినట్లు సమాచారం. ఇది ఉన్నతాధికారులకు తెలిసినా పట్టించుకోకపోగా ఇతని నుంచి మరో డీఎస్పీ స్థాయి అధికారి రూ.15 లక్షలు తీసుకుని వీఆర్‌కు పంపినట్లు ప్రచారం జరుగుతోంది.
కుప్పంలో పనిచేసిన ఓ సీఐ వేధింపులకు ఇద్దరు మహిళా పోలీసులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినా ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా బాధితులను వేర్వేరు పోలీస్టేషన్లకు బదిలీ చేశారు. దీంతో కుప్పంలో ఆయన ఆడిందే ఆట–పాడిందే పాటగా సాగింది. ఆ సీఐ దౌర్జన్యాలను చూసి టీడీపీలోని అసంతృప్తి వర్గం పార్టీ వీడేందుకు ప్రయత్నించినా అడ్డుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. టీడీపీ ప్రభుత్వంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వీరందరిపై చర్యలు తీసుకోవాలని బాధితులు ఏకమై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలియవచ్చింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top