నెట్టింట నయాట్రెండ్‌

New Trend in Social media - Sakshi

జనం ముంగిట సోషల్‌ మీడియా

ఎన్నికల రణక్షేత్రంలోనూ కీలకం

ఒక్క క్లిక్‌తో అంతా తేటతెల్లం

సెల్‌ఫోన్‌ తెరపై రాజకీయ కాక

ఫేస్‌బుక్‌లో లైక్‌లు... షేర్లు

సమాచార వేగిరానికి వాట్సాప్‌

ట్వీట్‌ చేస్తే హిట్‌ కొట్టొచ్చు

పొలిటికల్‌ ప్రొఫెషనల్స్‌ సిద్ధం

ఐదేళ్లలో అనూహ్య మార్పు

ఒకప్పుడు ఎన్నికలంటే... ఊరూవాడా గోడల నిండా రాతలు వీధివీధినా ఎగిరెగిరిపడే జెండాలు చెవులు చిల్లులుపడేలా డప్పు మోతలు నట్టింట్లోకి వినపడేలా నినాదాల హోరు మరిప్పుడు ఎన్నికలంటే... ఫేస్‌బుక్‌లో చర్చోపచర్చలు వాట్సాప్‌లో వాదోపవాదనలు ట్విట్టర్‌లో మాటల తూటాలు యూట్యూబ్‌లో విశ్లేషణలు

...అంతా కాల మహిమ. సోషల్‌ మీడియా మాయ. చూపుడు వేలితో చిటికెలో నెట్టింట్లోకి వెళ్లిపోవడం, చకచకా... ఆ మాటకొస్తే కారుచౌకగా ఏం జరుగుతుందో తెలుసుకోవడం, ఎవరేమిటో అంచనా కట్టేయడం... అంతా క్షణాల్లో తేల్చేసేయడం. మరిక... ‘కనెక్టవని’ వారెవరుంటారు చెప్పండి? కచ్చితంగా చెప్పాలంటే రెండు, మూడేళ్లలోనే అంతా మారిపోయింది. ఆ తీరేంటో ‘చూడండి’ మరి!

సాక్షి, అమరావతి: సామాజిక మాధ్యమం (సోషల్‌ మీడియా) ఇప్పుడు సామాన్యుడి ఆయుధమైంది. ఎన్నికల నగరాతో పాటే సమరానికి సిద్ధమంటోంది. ఫేస్‌బుక్‌ రాజకీయ వేడి పుట్టిస్తోంది. చాటింగ్‌తో వాట్సాప్‌ ఎన్నికల ముచ్చట్లను షికార్లు చేయిస్తోంది. నువ్వెంతంటే నువ్వెంతంటూ ట్విటర్‌ ట్వీట్లతో పోటెత్తుతోంది. విశ్లేషణలతో కూడిన వీడియోలతో యూట్యూబ్‌ ఎవరి సంగతేంటో తేల్చేస్తోంది. అమెరికా నుంచి ఆంధ్రప్రదేశ్‌ వరకు ఇదే తీరు. ఇదే జోరు. ‘పొలిటికల్‌ వ్యూ పాయింట్‌’ ఏమిటోనంటూ ప్రజలు ప్రధానంగా సోషల్‌ మీడియానే వెతుకుతున్నారు. ఆ మాధ్యమం వేదికగా చర్చలు, విశ్లేషణలు చేస్తున్నారు. రాజకీయ జీవితాన్ని కోరుకునే ప్రతి నాయకుడు ఇటువైపు చూడటం తప్పనిసరైంది. పల్లె నుంచి ఢిల్లీ దాక నట్టింట్లోకి దూసుకొచ్చిన ఈ నెట్టింటి నయా చుట్టాన్ని ఒకసారి పలకరిస్తే తప్ప సానుకూల వాతావరణం ఏర్పడదని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. ‘ప్రధాన సమాచార స్రవంతిలో లభించని సంతృప్తి సామాజిక మాధ్యమంలో పొందుతున్నా’మని ఇటీవల జరిపిన సర్వేల్లో తేటతెల్లం చేశారు ప్రజలు. నిన్నమొన్నటి దాక వ్యక్తిగత సంబంధాలకే పరిమితమైన ఈ మీడియాను రాజకీయ పార్టీలూ ప్రధానంగా భావిస్తున్నాయి. పైసా ఖర్చు లేని పోస్టింగ్‌తో వాస్తవం సీమ టపాసులా దూసుకెళ్తుందని జగమంతా భావిస్తోంది. 

9 రెట్లు పెరుగుదల
ఐదేళ్ల క్రితంతో పోలిస్తే ఇప్పుడు సోషల్‌ మీడియా రాజకీయ పాత్ర అనూహ్యంగా పెరిగింది. 2014 కన్నా 2019లో సామాజిక మాధ్యమ విస్తృతి తొమ్మిది రెట్లు, వినియోగదారులు 14 రెట్లు పెరుగుతారని ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న ఓ సంస్థ ఏడాది క్రితం చేసిన సర్వేలో స్పష్టమైంది. టీవీ ఛానల్స్‌ను అనుసరించే అవకాశం, ఓపిక లేని వాళ్లు తాజా రాజకీయ ధోరణి కోసం ఫేస్‌బుక్‌ను క్లిక్‌ చేస్తున్నారు. మనోభావాలను తక్షణం పోస్ట్‌ చేసేందుకు ఈ వేదిక బాగుందనే అభిప్రాయం వినిపిస్తోంది. వ్యక్తిగత అభిప్రాయాలను ఎక్కువమందికి చేరవేసేందుకు, అవసరమైతే ప్రధాన మాధ్యమాలను ఆకర్షించేందుకు వాట్సాప్‌ను ఆయుధంగా వాడుతున్నారని సర్వే చెబుతోంది. ఈ కారణంగా ఎన్నికల పోస్టింగ్‌లు ఆరు రెట్లు పెరుగుతాయని అంచనా వేశారు. తాజా వ్యాఖ్యలు, నేతల తీరును నిశితంగా గమనించేవారు ట్విట్టర్లకు లింక్‌ అవుతున్నారు. ఒక నేతకు నేరుగా ఏదైనా చెప్పే వీలుండదు. అదే ట్విట్టర్‌లో పోస్ట్‌ చేస్తే అనుకున్నది సాధించినట్టేననేది యూజర్ల ఉద్దేశం.

ఆ బలం ఎంత?
ఎన్నికల సమయంలో రాజకీయ పక్షాలు రకరకాల సర్వేలు చేయడం సహజం. ఇవన్నీ దాదాపు థర్డ్‌ పార్టీతోనే ఉంటాయి. ఇందుకు ఆయా రంగాల్లో నిష్ణాతులనే ఎంపిక చేసుకుంటాయి. అయితే, ఆ ట్రెండ్‌ మారింది. 2014 ఎన్నికల వరకు క్షేత్ర స్థాయి సర్వేలకు ప్రాధాన్యం ఇచ్చేవాళ్లు. ఇప్పుడు వాటితోపాటు సోషల్‌ మీడియాకూ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇది గుర్తించిన కొన్ని సంస్థలు మూడేళ్ల నుంచే ఐటీ ప్రొఫెషనల్స్‌ను నియమించుకున్నాయి. సోషల్‌ మీడియా సమాచారం ఆధారంగా అవసరమైన నివేదికలు రూపొందించే వీలును సమకూర్చుకున్నాయి. మూడు, నాలుగు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రత్యేకంగా దృష్టిపెట్టి, సమాచార సేకరణ చేసి, దాన్ని విశ్లేషించి నివేదికలు ఇస్తుండటంతో అభ్యర్థికి ఉన్న ఫాలోయింగ్, ప్లస్, మైనస్‌లు స్పష్టంగా తెలిసిపోతున్నాయి. ఇక వైరిపక్షాల వ్యూహాలు, పోస్టింగ్‌లు, వాటికి కౌంటర్స్‌ ఇచ్చే ప్రత్యేక ఏర్పాటు కూడా ఉంటోంది.

లైక్‌లు... షేరింగ్‌లు
తమ రాజకీయ సందేశం ఎంతవరకు వెళ్తుంది? జనం దాన్ని ఏ స్థాయిలో స్వీకరిస్తున్నారు? వంటివాటిని రాజకీయ పార్టీలు కీలకంగా భావిస్తుంటాయి. వీటికిప్పుడు సామాజిక మాధ్యమమే కొలమానమైంది. దీన్ని క్షుణ్నంగా పరిశీలించడానికి ప్రతి పార్టీ ఓ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసుకుంది. ఫేస్‌బుక్‌లో తమ పోస్టింగ్‌కు వచ్చిన లైక్‌లెన్ని? షేర్‌లెన్ని? ఏయే వర్గాల నుంచి ఎలాంటి స్పందన ఉంది? ఎవరినుంచి, ఎందుకు వ్యతిరేకత వస్తోంది? ట్విట్లర్‌లో ప్రతి స్పందన తీరు ఎలా ఉంది? అనేది గమనించడం ఈ విభాగాల విధి. ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పాదయాత్ర సందర్భంగా రాజకీయ స్పందన బాగా పెరిగింది. ఆ సమయంలో జగన్‌ ప్రజా సంకల్ప పాదయాత్ర, ఆయన ఆహార్యాన్ని, తీరును పలువురు పెద్దఎత్తున సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఇదే క్రమంలో పాదయాత్ర ప్రభావాన్ని తక్కువ చేసేందుకు ప్రభుత్వం వివిధ పథకాల గురించి ప్రచారం ఊదరగొట్టింది. కానీ, జగన్‌ పాదయాత్ర పోస్టింగ్‌లకు అనూహ్య స్పందన వచ్చింది. ప్రభుత్వ పోస్టింగ్‌లు జనంలోకి వెళ్లలేదని సర్వే సంస్థలు విశ్లేషించాయి. 

దుర్వినియోగంపై నిఘా
ఏదైనా ఘటన రెండో కోణం తెలుసుకునే వెసులుబాటు సామాజిక మాధ్యమం ద్వారా కలుగుతోంది. జన సామాన్యంలోకి ఈ స్థాయిలో దూసుకెళ్లిన ఈ మీడియా కొన్నిసార్లు దుర్వినియోగమతోంది. సమాచారం శరవేగంగా చేరడంతో పాటు వదంతులూ అదే స్థాయిలో వ్యాపిస్తున్నాయి. వీటిలో కొన్ని సమస్యాత్మకంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఈ తరహా ఆలోచనలు మరింత పదునెక్కుతాయి. తమ గురించి తాము ప్రచారం చేసుకుంటే ఫర్వాలేదు కాని ప్రత్యర్థిపై బురదజల్లే రాజకీయ వ్యూహాలకు సోషల్‌ మీడియా వేదికవుతోంది. ఇటీవల ఇలాంటి ఫిర్యాదులు అనేకం వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం కూడా నిఘా వ్యవస్థను పటిష్టం చేయాలని భావిస్తోంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top