సారొచ్చారు..


ఏది ఏమైనా జిల్లాను వదిలేది లేదని బెట్టు చేసిన ఉషాకుమారి పట్టు సడలించక తప్పలేదు. నాటకీయ పరిణామాల నేపథ్యంలో జేసీ బదిలీ ఉత్తర్వులు ఎట్టకేలకు అమల్లోకి వచ్చాయి. ఇన్నాళ్లు వేచిచూసే ధోరణితో వ్యవహరించిన మురళి ఇప్పుడు వచ్చి విధుల్లో చేరి హైదరాబాద్ వెళ్లిపోవడానికి కారణాలు ఉన్నాయి. మొత్తానికి జిల్లా జాయింట్ కలెక్టర్ బదిలీ వ్యవహారంలో నాలుగు నెలలుగా కొనసాగుతున్న ఉత్కంఠకు మంగళవారంతో తెరపడింది.

 

 కలెక్టరేట్ (మచిలీపట్నం), న్యూస్‌లైన్ :

 జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన బుద్ధప్రకాష్ ఎం.జ్యోతి, జాయింట్ కలెక్టర్ పి.ఉషాకుమారిలను ఒకేసారి బదిలీ చేస్తూ గత ఏడాది అక్టోబర్ ఎనిమిదిన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. రాజకీయ కోణంలో ఒకేసారి జిల్లాకు చెందిన ఇద్దరు కీలక అధికారులు బదిలీ కావడం అప్పట్లో పెద్ద చర్చనీయాంశమైంది. కలెక్టర్‌గా ఇక్కడికి బదిలీపై వచ్చిన ఎం.రఘునందన్‌రావు అక్టోబర్ 14న విధుల్లో చేరగా బుద్ధప్రకాష్ రిలీవయ్యారు. జేసీ ఉషాకుమారి మాత్రం రిలీవ్ కాకుండానే జిల్లాలో కొనసాగేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. ఒక దశలో ఆమెకు మంత్రి కొలుసు పార్థసారథి అండదండలు ఉండటంతో బదిలీ నిలుపుదల చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు ప్రచారం జరిగింది. ఇదే విషయంలో కాంగ్రెస్‌కు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు సైతం ఉషాకుమారికి మంత్రి వత్తాసు పలుకుతున్నారంటూ కారాలు మిరియాలు నూరారు. ఈ నేపథ్యంలో జేసీ ఉషాకుమారి బదిలీ వ్యవహారంపై ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించింది. మరోపక్క ఉషాకుమారి అనేక ప్రయత్నాలు చేసుకున్నా.. బెట్టు చేసినా.. జిల్లా నుంచి రిలీవ్ కాక తప్పలేదు.

 

 అకస్మాత్తుగా ‘మురళీగానం’ వెనుక..

 దాదాపు నాలుగు నెలలుగా ఇదిగో వచ్చేస్తున్నా.. అంటూ నెట్టుకొచ్చిన మురళి జిల్లా జేసీగా మంగళవారం హడావుడిగా బాధ్యతలు తీసుకోవడం వెనుక అనేక కారణాలున్నాయి. సీఎం పేషీలో డెప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్న మురళి జేసీగా బదిలీ అయినా విధుల్లో చేరకపోవడంతో సీఎం సైతం ఇంకా ఎందుకు జిల్లాకు వెళ్లలేదని గతంలో ప్రశ్నించినట్టు సమాచారం. అప్పట్లో ఉషాకుమారి ప్రయత్నాల కారణంగా మురళి ఇక్కడికి రావడానికి కొంత ఇబ్బంది ఏర్పడింది. ఉషాకుమారి రిలీవ్ కాకపోవడంతో ఆయన వచ్చి విధుల్లో చేరేందుకు అడ్డంకులు ఏర్పడ్డాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన హడావుడిగా వచ్చి విధుల్లో చేరడంతో ఉషాకుమారి రిలీవ్‌కాక తప్పలేదు. హైదరాబాద్ నుంచి విమానంలో ఆయన గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడినుంచి బందరు వచ్చి కలెక్టర్‌ను కలిసి విధుల్లో చేరారు. దీంతో ఉషాకుమారి జేసీగా రిలీవ్ అవుతూ ఆయనకు బాధ్యతలు అప్పగించారు. బాధ్యతలు తీసుకున్న వెంటనే మురళి మధ్యాహ్నం ఫ్లైట్‌కు హైదరాబాద్ వెళ్లిపోయారు. ఆయన తిరిగి ఈ నెల 24న జిల్లాకు వస్తారని చెబుతున్నారు. ఇంత హడావుడిగా ఆయన చేరడం వెనుక రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందన్న కంగారు ఒకటని చెబుతున్నారు. మరోవైపు తెలంగాణ నోట్‌పై చర్చించేందుకు అసెంబ్లీకి సమయం ఇవ్వకపోతే సీఎం, మంత్రులు రాజీనామాలు చేసే అవకాశముందని, అదే జరిగితే రాష్ట్ర ప్రభుత్వం రద్దయ్యే అవకాశముందని.. అటు తరువాత బదిలీలు అమలులోకి రావనే కారణంగానే ఆయన ఇప్పుడు విధుల్లోకి చేరారని విశ్వసనీయ సమాచారం. జేసీగా విధుల్లో చేరిన మురళిని ఏజేసీ చెన్నకేశవరావు, డీఆర్వో ఎల్.విజయచందర్‌లు మర్యాదపూర్వకంగా కలిశారు.

 

 మంచి సేవలందిస్తా : జేసీ మురళి

  జిల్లా జాయింట్ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మురళి విలేకరులకు వివరించిన విశేషాలివీ...

  జిల్లా ప్రజలకు మంచి సేవలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు.

  1996లో డెప్యూటీ కలెక్టర్ హోదాను సాధించి గుంటూరు ఆర్డీవోగా పనిచేసినట్లు చెప్పారు.

  - గుంటూరు జిల్లాలోనే డీఆర్‌డీఏ పీడీగా, అనంతరం విజయనగరం, మెదక్, విశాఖపట్నం, మహబూబ్‌నగర్ జిల్లాల్లోనూ అదే పోస్టులో విధులు నిర్వర్తించినట్లు వివరించారు.

  ఆ తర్వాత రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా, హైదరాబాదులో సెర్ఫ్ డెరైక్టర్‌గా పనిచేసినట్లు చెప్పారు.

  2012 నుంచి కన్‌ఫమ్డ్ ఐఏఎస్‌గా సీఎం పేషీలో డెప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్నట్టు తెలిపారు.

  సీఎం హామీలను నెరవేర్చేలా ఇందిరమ్మబాట కార్యక్రమం అమలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నుంచి వచ్చిన వినతులను పరిశీలించి పరిష్కరించేలా చర్యలు తీసుకునేవాడినని చెప్పారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top