కృష్ణానది బోటు ప్రమాదంలో కొత్త కోణం

A new angle in Krishna boat capsize incident - Sakshi

సాక్షి, విజయవాడ : కృష్ణానది పెను విషాదంలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. కొండలరావు అనే వ్యక్తి స్పీడ్‌ బోటుకు అనుమతి తీసుకుని, పర్యాటకుల బోటు నడిపినట్లు నిర్థారణ అయింది. నదిలో మార్గంపై అవగాహన లేకపోవడంతో బోటు  ఇసుక దిబ్బలను ఢీకొట్టింది. మరోవైపు బోటు నిర్వహాకుడు శేషగిరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా బోట్ల నిర్వహణ వ్యవహారం ఇద్దరు మంత్రుల కనుసన్నల్లో నడుస్తోంది. పర్యాటక సంస్థ అనుమతి ఇవ్వకపోయినా వారిద్దరి కనుసైగతో వారు చెప్పిన బోట్లను అనధికారికంగా నదిలో తిప్పాల్సిందేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇప్పటి వరకు యధేచ్ఛగా సాగిన ఈ వ్యవహారం ప్రమాదం నేపథ్యంలో వెలుగు చూస్తోంది. తూర్పు గోదావరి జిల్లా పర్యాటక అభివృద్ధి సంస్థలో పని చేస్తున్న ఒక ఉద్యోగి ఓ మంత్రికి అత్యంత అనుచరుడిగా వ్యవహరిస్తూ నిబంధనలకు విరుద్ధంగా విజయవాడలో మకాం వేసి బోటింగ్‌ వ్యవహారం అంతా తానై వ్యవహరిస్తున్నాడు. వచ్చే ఆదాయంలో 50 శాతం వరకు మంత్రులకు చేరుతోందనే ఆరోపణలు బలంగా విన్పిస్తున్నాయి.  

కానీ, కృష్ణా నదిలో ప్రైవేటు బోట్ల సిబ్బందిలో దాదాపు ఎవరికీ ఈ నైపుణ్యంలేదని విజిలెన్స్‌ నివేదిక స్పష్టంచేసింది. దీనిపై ప్రభుత్వం అప్పుడే స్పందించి తగిన చర్యలు తీసుకుని ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదని అధికార వర్గాలు చెబుతున్నాయి. అలాగే, పర్యాటక బోట్లలో డ్రైవర్‌తో సహా ప్రయాణికులందరికీ లైఫ్‌ జాకెట్లు సమకూర్చాలి. గజ ఈతగాళ్లను అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. కానీ, ఆదివారం ప్రమాదానికి గురైన బోటులో ఇవేవీ లేకపోవడం గమనార్హం. ఇక ఎంతమంది పర్యాటకులు బోటు ఎక్కుతున్నారో అన్నదానిపై సరైన రికార్డులూ నిర్వహించడంలేదు. ఎందుకంటే అందులో 10శాతం పర్యాటక శాఖకు చెల్లించాల్సి ఉంటుంది. అందుకే పర్యాటకుల సంఖ్యపై ఆపరేటర్లు సరైన రికార్డులు నిర్వహించడంలేదు.

నిర్దిష్ట అనుమతులు లేకుండానే ప్రైవేటు ఆపరేటర్లు కృష్ణా నదిలో బోటు సర్వీసులు నిర్వహిస్తున్నారు. లైసెన్సు ఇచ్చే ముందు జల వనరులు, రెవెన్యూ, అగ్నిమాపక శాఖల అనుమతులు పొందడంలేదు. ప్రైవేటు ఆపరేటర్లు తగిన భద్రతా ప్రమాణాలు పాటించడంలేదు. నదిలో కొన్నిచోట్ల ఇసుక దిబ్బలు ఉంటాయి కాబట్టి వాటిని ముందే గుర్తించి బోటు గమనాన్ని మార్చాలి. ఇక ఉధృతి పెరిగినప్పుడు కూడా చాకచక్యంగా బోటును నడపాల్సి ఉంటుంది. బోటు సామర్థ్యం ఎంత, ఎంతమందిని ఎక్కించాలన్న దానిపై సిబ్బందికి అవగాహన ఉండాలి.  అయితే  ప్రభుత్వ పెద్దలు ఆ నివేదికను ఏమాత్రం పట్టించుకోలేదు. పైగా.. సీజ్‌ చేసిన బోట్లను వెంటనే విడుదల చేయాలని జలవనరుల శాఖను ఆదేశించి అప్పటికప్పుడు తూతూ మంత్రంగా అనుమతులిచ్చేశారు. ప్రభుత్వ పెద్దలే పర్యాటక మోజులో వారికి దన్నుగా నిలవడంతో మరికొందరు ప్రైవేటు బోటు ఆపరేటర్లు సైతం కృష్ణా నదిలో నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు చేపట్టారు.

ఫలితం.. కృష్ణా నదిలో ఆదివారం పెను విషాదానికి దారితీసింది. అంతేకాదు.. జలక్రీడలకు సైతం ఇటీవల ఇష్టారాజ్యంగా అనుమతులు ఇచ్చేస్తోంది. ప్రకాశం బ్యారేజీ ఎగువన కృష్ణా నదీ గర్భంలో అధికారపార్టీ పెద్దల ఒత్తిళ్లకు తలొగ్గి ఫ్లోటింగ్‌ రెస్టారెంట్ల ఏర్పాటుకు ఛాంపియన్స్‌ యాచెట్స్‌ క్లబ్‌కు అనుమతిస్తూ గత జూన్‌ 21న జలరవాణా శాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేయడం.. దీనివల్ల చేకూరే ప్రమాదాలపై ‘సాక్షి’ కథనాలు ప్రచురించడంతో గత ఆగస్టు 29న ఆ అనుమతులను రద్దు చేసిన విషయం తెలిసిందే.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top