కూతపెట్టని చిత్తూరు కోడి

neggligence on chittoor kodi scheme - Sakshi

ప్రతిష్టాత్మకంగా చిత్తూరు కోడి పథకం

రైట్‌రాయల్‌గా అధికార దోపిడీ

అర్హులకు ముప్పుతిప్పలు

విస్తుపోయిన అధికారులు

పథకాన్ని అటకెక్కించిన వైనం

చిత్తూరు కోడి పథకం లక్ష్యం నీరుగారింది. అధికార దాహంతో టీడీపీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. సబ్సిడీ మొత్తాన్ని దిగమింగేందుకు ప్రణాళిక రూపొందించారు. సహకార సంస్థ కూడా చేతివాటాన్ని చూపడంతో అరకొర లబ్ధిదారులు ముప్పుతిప్పలు ఎదుర్కొన్నారు. చేసేదిలేక అధికారులు చిత్తూరు కోడి కూతపెట్టకనే పథకానికి మంగళంపాడాల్సి వచ్చింది.

చిత్తూరు కలెక్టరేట్‌: రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా జిల్లాలో వినూత్నంగా అధికారులు చిత్తూరు కోడి పథకాన్ని రూపొందించారు. ఈ పథకం ద్వారా పౌష్టికాహారం, మాంసం ఉత్పత్తిని మరింత పెంపొందించాలన్నది లక్ష్యం. లక్ష్యం ఉన్నతమైనది అయినా స్వార్థపరుల ధనదాహానికి నీరుగారింది.

వెయ్యి యూనిట్లు లక్ష్యం
ఈ పథకం ద్వారా షెడ్డు నిర్మాణానికి, కోళ్లను పెంచేందుకు అవసరమైన పరికరాల కొనుగోలుకు గాను రూ.3.57 లక్షల మేర లబ్ధిదారునికి అందజేయాలి. అందులో రూ.లక్ష సబ్సిడీ. ఈ మొత్తాన్ని నేరుగా లబ్ధిదారులని బ్యాంకు ఖాతాకు జమచేస్తారు. మరో రూ.2.57 లక్షలను సహకార బ్యాంకుల ద్వారా రుణంగా అందిస్తారు. ముందుకు వచ్చే వారు షెడ్డు నిర్మాణానికి కావలసిన స్థలం, నీటి సౌకర్యాన్ని చూపిం చాలి. జిల్లా వ్యాప్తంగా వెయ్యి యూనిట్ల మేరకు మంజూరు చేయాలన్నది లక్ష్యం.

80 షెడ్లు పూర్తి
ఈ పథకం ద్వారా షెడ్డు నిర్మించుకునే లబ్ధిదారుడు కోళ్ల పెంపకాన్ని అధికారులు సూచించిన హేచరీస్‌ల ద్వారానే చేపట్టాలి. అధికార పార్టీకి చెందిన ఓ హేచరీస్‌ యజమానికి లబ్ధిచేకూరేలా ఉందని గత ఏడాది నవంబర్‌ 23న ‘సాక్షి’లో ‘చిత్తూ రు కోడి ఎవరికి పలావ్‌’ శీర్షికన వార్త ప్రచురితమైంది. అధికారులు ఈ పథకం అమల్లో భాగంగా మొదటి విడతలో 87, రెండో విడతలో 120 షెడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. ఇందుకోసం ముందస్తుగానే స్పె షల్‌ డెవలప్‌మెంటు ఫండ్‌ కింద కలెక్టర్‌ రూ.5 కోట్ల మేర నిధులు వె చ్చించినట్లు సమాచారం. ఈ నిధుల ద్వారా లబ్ధిదా రులకు అందించాల్సిన సబ్సిడీ రూ.లక్ష చొప్పున అందించేందుకు చర్యలు తీసుకున్నారు. ఇప్పటి వరకు మొత్తం 80 షెడ్లు పూర్తయినట్లు సమాచారం. 

దోపిడీ ఇలా..
చిత్తూరు కోడి పథకం ద్వారా షెడ్డు నిర్మించుకున్న లబ్ధిదారులు ఇంటిగ్రేషన్‌ కింద కోళ్ల పెంపకాన్ని అధికారులు సూచించిన ఓ హేచరీస్‌ ద్వారానే చేపట్టేలా చర్యలు తీసుకున్నారు. షెడ్డు నిర్మాణానికి అవసరమైన రూ.2.57 లక్షల రుణాన్ని సహకార బ్యాంకుల ద్వారానే తీసుకోవాలనే ఆంక్షలు పెట్టారు. బ్యాంకు రుణాలు తామే ఇస్తామని ముందుకు వచ్చిన సహకార పాలకవర్గం ఆఖరుకు చుక్కలు చూపించింది. సహకార సంస్థల జిల్లా పాలకవర్గం చైర్మన్‌ రుణాల మంజూరులో చేతివాటాన్ని ప్రదర్శించినట్లు సమాచారం. రైతులకు రుణాలు అందించడంలో అనేక ఆంక్షలు పెట్టడం, షెడ్డు నిర్మాణ స్థలంతోపాటు వారి ఆస్తులను తనఖా పెట్టాలని షరతులు విధించారు. ఇతర బ్యాంకుల కన్నా అధిక వడ్డీరేట్లను పెట్టారు. రైతులు తమ భూములను తాకట్టు పెట్టేందుకు వెనుకాడారు. కొందరు రుణం కోసం చేసుకున్న దరఖాస్తులను సైతం వెనక్కు తీసుకునేలా చేశారు. అధికారులు చిత్తూరు కోడికి అందించే సబ్సిడీ మొత్తాలను కాజేసేందుకు మాత్రం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సహకార సంస్థ పాలకవర్గమే తమకు అనుకూలమైన వారికి చెందిన పాత కోళ్లఫారాల షెడ్డులకు వెల్లవేసి కొత్తగా నిర్మిచినట్లు, వాటికి రుణాలు ఇస్తున్నట్లు చెప్పి సబ్సిడీ నిధులను స్వాహా చేసేందుకు ప్రయత్నించారు. విషయం పసిగట్టిన అధికారులు ఏకంగా చిత్తూరు కోడి పథకానికి మంగళం పాడారు.

సబ్సిడీ నిధులు వెనక్కి తీసుకోండి
ఇప్పటికే రెండు దఫాలుగా 207 షెడ్ల నిర్మాణాలకు సబ్సిడీ నిధులు రూ.2.07 కోట్ల మేరకు లబ్ధిదారుల ఖాతాల్లో జమచేశారు. ఇప్పటికి 80 షెడ్లు గ్రౌండ్‌ అయినట్లు అధికారిక లెక్కలు. మరో 127 పూర్తికాలేదు. మూడో విడతలో మరో 350 నిర్మాణాలకు అనుమతుల కోసం కలెక్టర్‌ వద్దకు ఫైల్‌ వెళ్లగా ఆయన తిప్పి పంపినట్లు తెలిసింది. నిర్మాణాలు పూర్తి కాని 127 షెడ్లకు కేటాయించిన సబ్సిడీ నిధులను కూడా ఈ నెల 20లోగా వెనక్కి తీసుకోవాలని ఆదేశించినట్లు సమాచారం. దీన్నిబట్టి చూస్తే అధికార పార్టీకి చెందిన సహకార సంస్థల జిల్లా పాలకవర్గం ఏ మేరకు దోపిడీకి ప్రయత్నించిందో ఇట్టే తెలు స్తోంది. అధికారులు చేసేదిలేక పథకానికి మంగ ళం పాడాల్సి వచ్చింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top