మార్పునకే ఓటు

National Surveys Opinion YSRCP Win in Andhra Pradesh Election - Sakshi

జాతీయ సర్వే సంస్థల వెల్లడి

ఏపీలో జగన్‌కు సై అంటున్న జనం

క్షేత్రస్థాయిలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌కు బ్రహ్మరథం పడుతున్న జనం

ఎన్నికలు సమీపించే కొద్దీ పెరుగుతున్న జనాదరణ

తత్తరపాటుతో ముసుగు రాజకీయాలకు పాల్పడుతున్న చంద్రబాబు

సాక్షి, అమరావతి : రాష్ట్ర ప్రజలు జగన్‌కు జై అంటున్నారు.. మోసపూరిత రాజకీయాలకు బలైన తాము మళ్లీ మళ్లీ బోల్తా కొట్టబోమని ముందుకు కదులుతున్నారు. ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ పట్ల నానాటికీ జనాదరణ పెరుగుతోందని సర్వత్రా వినిపిస్తోంది. గత కొంతకాలంగా రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై అధ్యయనం చేసి అంచనాలు వేస్తున్న జాతీయ సర్వేలు ఎన్నికలు దగ్గర పడేకొద్దీ జగన్‌కే ఆధిక్యత కనిపిస్తోందని సూచిస్తున్నాయి. గత ఐదేళ్ల ‘అనుభవజ్ఞుడి పాలన’లో కునారిల్లిన అన్ని వర్గాల ప్రజలు ఇప్పుడు జగన్‌ను అక్కున చేర్చుకుంటున్నారు. ప్రభుత్వం మాటల్లో చెబుతున్న అభివృద్ధి చేతల్లో లేదనేది ప్రజలు బాగా తెలుసుకున్నారు. తన పట్ల జనం బాగా వ్యతిరేకతతో ఉన్నారనే క్షేత్రస్థాయి వాస్తవాలను గ్రహించినప్పటికీ మేకపోతు గాంభీర్యాలు పోతున్న చంద్రబాబు గత 2014 ఎన్నికల మాదిరిగా కాకుండా జనసేన, కాంగ్రెస్, వామపక్షాలతో ముసుగు రాజకీయాలకు తెరతీశారు. అధికారికంగా ఈ పార్టీలతో ఆయన పొత్తు పెట్టుకోనప్పటికీ లోపాయికారీ లాలూచీ రాజకీయాలు చేస్తున్నారనేది అభ్యర్థుల ఎంపిక సందర్భంగా చంద్రబాబు ప్రదర్శించుకున్నారు. గత ఎన్నికల్లో చంద్రబాబు జనసేన, బీజేపీలతో కలసి ఎన్నికల బరిలోకి దిగారు. ఈ దఫా ఆయన ముసుగు రాజకీయాలతో ముందుకు వస్తున్నా.. ప్రజల్లో చర్చ జరిగే తీరు, వారి నుంచి వ్యక్తమవుతున్న అభిప్రాయాలను పరిశీలిస్తే తెలుగునాట జగన్‌ ప్రభంజనం బలంగా వీస్తోందనేది వెల్లడవుతోంది.

రిపబ్లిక్‌–సీ ఓటర్‌ సర్వే మొదలు..
తాజాగా టైమ్స్‌ నౌ నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ వరకూ ఏపీలో జగన్‌కు.. చంద్రబాబుపై సంపూర్ణ ఆధిక్యత ఉన్నట్టు స్పష్టం చేశాయి. మార్చి 19న విడుదల చేసిన ‘టైమ్స్‌ నౌ’ సర్వేలో రాష్ట్రంలోని 25 లోక్‌సభ స్థానాలకు 22 సీట్లలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ విజయకేతనం ఎగురవేస్తుందని వెల్లడైంది. అధికారంలో ఉన్న టీడీపీకి మూడు సీట్లు దక్కడం గగనమని పేర్కొంది. మార్చి 19నే విడుదలైన వీఎంఆర్‌ సర్వేలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌కు 23 లోక్‌సభ స్థానాలు, టీడీపీకి 2 స్థానాలు లభిస్తాయనే అంచనా వెల్లడైంది. ఇక మార్చి 10న ఇండియా టీవీ/సీఎన్‌ఎక్స్‌ వెల్లడించిన సర్వే కూడా వైఎస్సార్‌ సీపీ 22 లోక్‌సభా స్థానాలను కైవసం చేసుకుంటుందని వెల్లడించింది. టీడీపీ మూడు స్థానాలకు పరిమితం అవుతుందని స్పష్టమైంది. ఈ ఏడాది ప్రారంభంలో జనవరి 25న మొట్టమొదటిగా వెల్లడైన  ‘ది రిపబ్లిక్‌ టీవీ–సీ ఓటర్‌’ సర్వే ప్రకారం అప్పట్లో మొత్తం 25 ఏపీ లోక్‌సభ స్థానాల్లో ఆరు స్థానాలు మాత్రమే అధికార టీడీపీకి లభిస్తాయనేది వెల్లడైంది. 19 సీట్లతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ భారీ విజయం సాధించబోతోందని ఆ సర్వే తేల్చిచెప్పింది. గత ఫిబ్రవరి 18న ‘స్పిక్‌ మీడియా’ ప్రకటించిన సర్వే వివరాల ప్రకారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌కు 22, టీడీపీకి 3 స్థానాలు లభిస్తాయని అంచనా వేసింది.

ఓట్ల శాతంలోనూ భారీ ఆధిక్యత
‘టైమ్స్‌ నౌ’, వీఎమ్మార్‌ రెండు సర్వేల్లోనూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి 49.5 శాతం ఓటర్లు మద్దతు పలుకుతారని జగన్‌–చంద్రబాబు మధ్య భారీ వ్యత్యాసం ఉందని వెల్లడైంది. చంద్రబాబుకు ప్రజల మద్దతు ఈ దఫా 36 శాతానికి పడిపోనుందని తెలియజేసింది. అంతకుముందు 45.5 శాతం మద్దతు ఉన్న జగన్‌కు పోలింగ్‌ దగ్గర పడేకొద్దీ అది 49.5 శాతానికి పెరగగా అదే సమయంలో 40.5 శాతం ప్రజల మద్దతు ఉన్న చంద్రబాబుకు 36 శాతానికి పడిపోయిందని సూచించింది. ‘రిపబ్లిక్‌ టీవీ–సీ ఓటర్‌’ జనవరిలో వెల్లడించిన సర్వే ప్రకారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ 41.3 శాతం ఓట్లతో బాగా ముందంజలో ఉండగా టీడీపీ 33.1 శాతం ఓట్లతో సుమారు పది శాతం వెనుకబడి ఉంది.

చంద్రబాబుపై వ్యతిరేకత
తొలి నుంచీ వెల్లడవుతున్న జాతీయ మీడియా, ఇతర సంస్థల వివరాల ప్రకారం టీడీపీపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ సంపూర్ణ ఆధిక్యతను సాధించడానికి ప్రధాన కారణంగా మూడు అంశాలను పేర్కొంటున్నారు. జగన్‌ రాజకీయవేత్తగా బాగా ఎదిగారని ప్రజలు గుర్తిస్తూ ఉండటం, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై వెల్లువెత్తుతున్న ప్రజా వ్యతిరేకత, దీంతోపాటు విభజన వల్ల అన్నివిధాలా నష్టపోయిన ఏపీకి ప్రత్యేక హోదా కావాలనే డిమాండ్‌కు తొలినుంచీ కూడా ఒకే విధానానికి కట్టుబడి ఉండటం అనేది సర్వేల్లో వెల్లడవుతూ వస్తోంది. ఎన్నికలు దగ్గర పడేకొద్దీ జగన్‌కు జనాదరణ మరింత పెరుగుతోందే తప్ప ఇసుమంతైనా తగ్గడం లేదనే సరళిని విశ్లేషకులు కూడా అంగీకరిస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top