‘ఆత్మా’ కింద ఏపీకి ఐదేళ్లలో రూ.92 కోట్లు 

Narendra Singh Tomar answer to Vijayasai Reddy question - Sakshi

విజయసాయిరెడ్డి ప్రశ్నకు రాజ్యసభలో కేంద్ర మంత్రి సమాధానం 

సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ: ఆత్మా (అగ్రికల్చరల్‌ టెక్నలాజికల్‌ మేనేజ్‌మెంట్‌ ఏజెన్సీ) పథకం కింద 2014–15 నుంచి ఇప్పటి వరకు ఐదేళ్లలో కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు సుమారు రూ.92 కోట్లు గ్రాంట్‌–ఇన్‌–ఎయిడ్‌ కింద విడుదల చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ శుక్రవారం రాజ్యసభకు తెలిపారు. వైఎస్సార్‌సీపీ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఆత్మా పథకం అమలు కోసం ప్రతి రెండు గ్రామాలకు ఒక రైతుమిత్రను నియమించేందుకు తమ మంత్రిత్వశాఖ అనుమతించినప్పటికీ ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఈ పథకం కింద రైతుమిత్రలను గుర్తించలేదని మంత్రి తెలిపారు.  

ధాన్యం సేకరణలో ప్రైవేట్‌కు అనుమతి 
కనీస మద్దతు ధర చెల్లించి రైతుల నుంచి ధాన్యం సేకరించేందుకు ప్రైవేట్‌ ఏజెన్సీలు, స్టాకిస్టులకు అనుమతిస్తున్నట్లు ఆహార, ప్రజా పంపిణీ శాఖ సహాయ మంత్రి  దాన్వే రావుసాహెబ్‌ దాదారావు వెల్లడించారు. రాజ్య సభలో శుక్రవారం విజయసాయిరెడ్డి అడిగిన మరో ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ ప్రధాన మంత్రి అన్నదాత ఆయ్‌ సంరక్షణ్‌ అభియాన్‌ (పీఎం–ఆషా)ను అక్టోబర్‌ 2018లో ప్రారంభించినట్లు చెప్పారు. కనీస మద్దతు ధరతో ధాన్యం సేకరించే ప్రైవేట్‌ ఏజెన్సీల పనితనాన్ని సానుకూలంగా వినియోగించుకోవడం ఈ పథకం ఉద్దేశమని చెప్పారు. 

జాతీయ రైతు కమిషన్‌ ఏర్పాటు చేయాలి 
జాతీయ రైతు కమిషన్‌ ఏర్పాటు చేయాలని వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి కేంద్రాన్ని కోరారు. నేషనల్‌ ఫార్మర్స్‌ కమిషన్‌ ఏర్పాటుకు సంబంధించిన ప్రైవేట్‌ మెంబర్‌ తీర్మానంపై శుక్రవారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ‘విజయ్‌పాల్‌ సింగ్‌ ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి మద్దతు పలుకుతున్నాను. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ తరహాలో నేషనల్‌ ఫార్మర్స్‌ కమిషన్‌ ఏర్పాటు చేయాలని, రాష్ట్రాల్లో కూడా ఈ కమిషన్‌ ఉండాలన్న ప్రతిపాదన బాగుంది’ అని విజయసాయిరెడ్డి అన్నారు.  

గవర్నర్‌ను అభినందించేందుకు భువనేశ్వర్‌ వెళ్లిన విజయసాయిరెడ్డి 
ఆంధ్రప్రదేశ్‌ నూతన గవర్నర్‌గా నియమితులైన విశ్వభూషణ్‌ హరిచందన్‌ను కలుసుకుని ఆయనను అభినందించేందుకు వైఎస్సార్‌ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వి.విజయసాయిరెడ్డి శుక్రవారం సాయంత్రం భువనేశ్వర్‌కు వెళ్లారు. శనివారం హరిచందన్‌ను కలిసి పార్టీ తరపున ఆయనకు శుభాకాంక్షలు తెలియ జేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top