1న ప్రధాని విశాఖ రాక

Narendra Modi Tour in Visakhapatnam March 1st - Sakshi

27 పర్యటన వాయిదా

సాక్షి, విశాఖపట్నం: ప్రధాని నరేంద్రమోదీ విశాఖ పర్యటన మరోసారి వాయిదా పడింది. తొలుత ఈనెల 16న ఆయన విశాఖ పర్యటనకు రావలసి ఉంది. అయితే దీనిని 27వ తేదీకి మార్పు చేశారు. తాజాగా ఈ తేదీని కూడా మార్చారు. అనివార్య కారణాల వల్ల ప్రధాని 27న విశాఖ రావడం లేదని, ఆయన రాక మార్చి ఒకటో తేదీకి వాయిదా పడిందని అసెంబ్లీలో బీజేపీ శాసనసభాపక్ష నేత పి.విష్ణుకుమార్‌రాజు ఆదివారం రాత్రి ‘సాక్షి’కి చెప్పారు. ప్రధాని మార్చి ఒకటో తేదీన కన్యాకుమారిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని అక్కడ నుంచి నేరుగా విశాఖ వస్తారన్నారు. ఆరోజు రాత్రి 7.30 గంటలకు విశాఖలో బహిరంగ సభలో ప్రధాని ప్రసంగిస్తారని తెలిపారు. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం ఈ బహిరంగ సభ ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్‌ కాలేజీ గ్రౌండ్‌లోనే జరుగుతుందన్నారు. ఈ కాలేజీ గ్రౌండ్‌లో బహిరంగ సభకు అనుమతివ్వాలని ఇప్పటికే రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి తానే స్వయంగా లేఖ ఇచ్చానని చెప్పారు. ఏయూ మైదానంలో సభ కోసం ఎవరి నుంచి తమకు లేఖ రాలేదంటూ మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పడం సరికాదని, అవసరమైతే సోమవారం మరోసారి లేఖ ఇస్తానని తెలిపారు.

బాబుకు ప్రకృతి కూడా సహకరించలేదు..
ప్రధాని మోదీ గుంటూరు సభను విఫలం చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన కుయుక్తులు ఫలించలేదని విష్ణుకుమార్‌రాజు విమర్శించారు. మోదీ రాకను నిరసిస్తూ ఆయన పార్టీ కార్యకర్తలతో నల్ల బెలూన్లు ఎగురవేసేందుకు ప్రయత్నించారని, కానీ ప్రకృతి సహకరించకపోవడంతో అవి ఎగురలేదని చెప్పారు. దీన్ని బట్టి ప్రకృతికి కూడా చంద్రబాబు వ్యతిరేకమని స్పష్టమైందన్నారు. ప్రధాని రాష్ట్రానికి వస్తే ముఖ్యమంత్రి లేదా మంత్రులు విమానాశ్రయానికి వెళ్లి సాదర స్వాగతం పలకడం సంప్రదాయమని, కానీ ఆ మర్యాదను పాటించకపోవడం వారి సంస్కారాన్ని తెలియజేస్తోందన్నారు. విశాఖకు రైల్వే జోన్‌ ప్రకటనకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని విష్ణుకుమార్‌రాజు తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top