ఎగువ బొండాపల్లిలో హత్య

Murder In Yeguva Bondapalli Visakhapatnam - Sakshi

పశువులు వరి పనలుతినేశాయని యజమానిపై దాడి

దెబ్బలకు తాళలేక మృతి

పోలీసుల వద్ద లొంగిపోయిన నిందితుడు    

పెదబయలు(అరకులోయ): తన వరి కుప్పలో పనలను పశువులు తినేశాయన్న కోపంతో వాటి యజమానిపై ఓ వ్యక్తి దాడి చేసి, తీవ్రంగా కొట్టడంతో మృత్యువాత పడ్డాడు.  హతుని కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం మేరకు  వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని బొండాపల్లి పంచాయతీ ఎగువ బొండాపల్లి గ్రామానికి చెందిన పలాసి ప్రసాద్‌(25) అనే వ్యక్తికి చెందిన పశువులు  సోమవారం ఉదయం  ఇదే గ్రామానికి చెందిన నాయుడు బోడన్నకు చెందిన కుప్పల్లో వరి పనలను మేశాయి. ఈ విషయం తెలిసిన బోడన్న  అదేరోజు సాయంత్రం ప్రసాద్‌ ఇంటికి వెళ్లి అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అక్కడితో ఆగకుండా అతన్ని కొట్టుకుంటూ రెండు వీధుల్లో తిప్పి,  తరువాత  కల్లానికి లాక్కుని వెళ్లి అక్కడ కూడా  తీవ్రంగా  కొట్టాడు.

  తన భర్తను  కొట్టవద్దని, పశువులు తిన్న వరి పనల విలువ ఎంత అయితే అంతా డబ్బులు ఇస్తామని చెప్పినా వినకుండా తీవ్రంగా  కొట్టినట్టు ప్రసాద్‌ భార్య కవిత తెలిపింది. గ్రామస్తులు వారించే ప్రయత్నం చేసినా వదలలేదని, అతి కష్టం మీద తప్పించుకుని ఇంటికి వచ్చిన తన భర్త అర్ధరాత్రి ఇంట్లోనే మృతి చెందినట్టు  కవిత, బంధువులు తెలిపారు. మంగళవారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని పోలీసులు... అంబులెన్స్‌లో పెదబయలు తరలించి పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. బోడన్న  కొట్టిన దెబ్బల వల్లే మృతి చెందాడా? లేక  గ్రామస్తులు  చూస్తుండగా గ్రామాల్లో పలు వీధుల్లో తిప్పి కొట్టడంతో మనస్తాపం  చెంది ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో విచారణ చేస్తున్నామని  పెదబయలు ఎస్‌ఐ రామకృష్ణారావు తెలిపారు. నిందితుడు నాయుడు బోడన్న పోలీసు స్టేషన్‌కు వచ్చి లొంగిపోయినట్టు ఆయన చెప్పారు.  ప్రసాదు మృతదేహాన్ని స్థానిక జెడ్‌పీటీసీ జర్సింగి గంగాభవానీ, వెచ్చంగి  కొండయ్య తదితరులు పరిశీలించి,  సంతాపం వ్యక్తం చేశారు.

మృతి చెందిన ప్రసాద్‌కు భార్య, ఇద్దరు చంటి పిల్లలు  ఉన్నారు. కుటుంబ పెద్ద దిక్కు మృతితో తమకు ఆధారం లేకుండా పోయిందని భార్య, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని వారు కోరారు. ఏ దిక్కూ లేని ప్రసాద్‌ కుటుంబాన్ని ఆదుకోవాలని బంధువులు కోరారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top