వీడిన హత్య కేసు మిస్టరీ

Murder case mystery  - Sakshi

వెంగళాయపాలెం మిర్చియార్డు కూలీ హత్య కేసును ఛేదించిన పోలీసులు

వివాహేతర సంబంధానికి   అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో   హత్య చేయించిన భార్య

ఇద్దరు నిందితులను  అరెస్ట్‌ చేసిన పోలీసులు

గుంటూరు రూరల్‌: మండలంలోని వెంగళాయపాలెం గ్రామం పూలెనగర్‌కి చెందిన మిర్చియార్డు కూలీ హత్య కేసును ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. నల్లపాడు పోలీస్‌స్టేషన్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సౌత్‌జోన్‌ రూరల్‌ డీఎస్పీ ఆర్‌వీఎస్‌ఎన్‌ మూర్తి, సీఐ బాలమురళీకృష్ణ కేసుకు సంబంధించిన వివరాలు విలేకరులకు వెల్లడించారు. వారి మాటల్లోనే... వెంగళాయపాలెం గ్రామానికి చెందిన శివుడునాయక్‌ మిర్చియార్డులో కూలీగా పనిచేస్తుంటాడు. అతనికి భార్య రమావత్‌ సరస్వతిబాయి, ఇద్దరు పిల్లలున్నారు. చదువుల నిమిత్తం నగరంలోని  హాస్టల్‌లో పిల్లలు ఉండేవారు. 

ఈ క్రమంలో సరస్వతి బాయికి వెల్దుర్తి మండలం మండాది గ్రామానికి చెందిన ఉప్పుతూళ్ల సత్యనారాయణతో పరిచయం ఏర్పడింది. అదికాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలో భార్యతో పాటు ఇంటి వద్ద పలుమార్లు సత్యనారాయణను చూసిన శివుడు నాయక్‌ అతను ఇంటికి ఎందుకు వస్తున్నాడు, మన ఇంట్లో ఎందుకు ఉంటున్నాడని పలుమార్లు ప్రశ్నించాడు. దీంతో ఆమె గతంలో తాము అతని వద్ద అప్పు తీసుకున్నామని ఇతరత్రా విషయాలను చెప్పి, తన తమ్ముడని ఇంట్లో ఉంచింది. ఈ విషయమై అప్పుడప్పుడు భార్యాభర్తల మధ్య వివాదం జరుగుతుండేది. ఈ క్రమంలో సత్యనారాయణ, సరస్వతిబాయి తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న శివుడునాయక్‌ను హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. 

హత్య చేసిందిలా...
ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం సత్యనారాయణ శివుడునాయక్‌తో కలిసి ఈ నెల 3వ తేదీన మద్యం తాగుదామని చెప్పి అతని బండిపై బయటకు వచ్చారు. అనంతరం మద్యం షాపునకు వెళ్లి పూటుగా తాగి, మరో రెండు బీర్లు, క్వార్టర్‌ మందును తీసుకుని ఆ దుకాణం నుంచి బయటకు వచ్చారు. ఇంటికి వెళితే వివాదం అవుతుందని, మధ్యలోనే తాగి వెళదామని చెప్పి సత్యనారాయణ పూలేనగర్‌ సమీపంలోని ప్లాట్లలోకి తీసుకెళ్లాడు. అక్కడ తాగేందుకు కూర్చున్న శివుడునాయక్‌పై ముందుగా ప్లాను ప్రకారం వెంటతెచ్చుకున్న రాడ్డుతో దాడి చేసి తలపై బలంగా మోదాడు. 

దీంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే శివుడు మృతి చెందాడు. అనంతరం తాను హత్య చేసినట్లు ఎవ్వరూ గుర్తించకుండా ద్విచక్రవాహనానికి రక్తాన్ని అంటించి శివుడునాయక్‌ పనిచేసే మిర్చి యార్డు సమీపంలోని గోడౌన్‌ వద్ద ద్విచక్రవాహనాన్ని నిలిపి పారిపోయాడు. పనిపూర్తయిందోలేదో తెలియని సరస్వతిబాయి తన భర్త ఇంటికి రాలేదని చెప్పి, అదే రోజు రాత్రి 10 గంటల సమయంలో ఇంటి వద్దనున్న మరొకరి సెల్‌ను తీసుకుని ముద్దాయి సత్యనారాయణకు ఫోన్‌ చేసి విషయాన్ని తెలుసుకుంది. హత్య చేశాడని నిర్ధారణకు వచ్చిన తర్వాత ఇంటికి వెళ్లి తన భర్త అర్ధరాత్రయినా ఇంటికి రాలేదని చుట్టుపక్కల వారికి చెప్పింది. ఇదిలా ఉండగా 4వ తేదీన ఉదయం తెల్లవారు జామున పూలే నగర్‌ సమీపంలో ప్లాట్లలో శవం ఉందని స్థానికుల సమాచారం మేరకు అక్కడికి చేరుకుని తన భర్తను ఎవరో హత్యచేశారని బోరున విలపించింది. 

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలను సేకరించారు. భార్య ఫిర్యాదు మేరకు గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్లు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత భార్యను అనుమానించిన పోలీసులు విచారణ చేయగా అసలు విషయం బయట పడింది. సరస్వతిబాయితోపాటు సత్యనారాయణను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా, తామే ప్రణాళిక ప్రకారమే హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. దీంతో ఆ ఇద్దరిని అరెస్ట్‌ చేసి కోర్టులో శనివారం హాజరు పరిచారు. కేసును ఛేదించిన నల్లపాడు పోలీస్‌స్టేషన్‌ సిబ్బందిని డీఎస్పీ మూర్తి అభినందించారు.
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top