పౌరుల ప్రశ్నలకు సమాధానం చెప్పరా?

పౌరుల ప్రశ్నలకు సమాధానం చెప్పరా?

రాష్ట్ర ప్రభుత్వంపై ముద్రగడ ధ్వజం

 

కిర్లంపూడి:  మాజీ ఎంపీ, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం నిర్వహించ తలపెట్టిన పాదయాత్రను 18వ రోజైన శనివారం కూడా పోలీసులు అడ్డుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ఇంటి నుంచి ముద్రగడ బయలుదేరగానే పాదయాత్రకు అనుమతి లేదని పోలీసులు ఆయన్ను నిలువరించారు. దీనిపై ముద్రగడ స్పందిస్తూ.. కాపులకు ఇచ్చిన హామీలను గుర్తుచేయడం కోసం పాదయాత్ర చేస్తానంటే అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమన్నారు. పౌరులు అడిగే ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరంలేదా? అని  ప్రశ్నించారు.తమ జాతికి ఇచ్చిన హామీలను గుర్తు చేయడం కోసం శాంతియుతంగా పాదయాత్ర చేపడితే.. కేసులు నమోదు చేశారని.. ఆ కేసులను కోర్టుకు అప్పగిస్తే అక్కడైనా బాధలు చెప్పుకుంటామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంత కాలం అడ్డుకున్నా పాదయాత్రను ఆపే ప్రసక్తే లేదన్నారు. రాష్ట్రంలో గుడ్డిపాలన కొనసాగుతోందని, దానికి నిరసనగా తలకు నల్ల ముసుగులు ధరించి నిరసన తెలియజేశారు. జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చంద్రబాబుకు వ్యతిరేకంగా, ముద్రగడకు మద్దతుగా నినాదాలు చేశారు. పాదయాత్రకు తక్షణమే అనుమతి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు,  మహిళలు, కాపు నేతలు పాల్గొన్నారు. ముద్రగడ చేస్తున్న పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నందుకు నిరసనగా ఆయన ఇంట మధ్యాహ్నం కంచాలమోత కార్యక్రమాన్ని నిర్వహించారు.
Back to Top