చిరు, పవన్లను అడ్డుపెట్టుకొని..


కాకినాడ: కాపులను బీసీల్లో చేరుస్తామని టీడీపీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం డిమాండ్ చేశారు. ఆదివారం కాపు ఐక్య గర్జన పోస్టర్ను ఆవిష్కరించిన ఆయన జనవరి 31న తునిలో కాపు ఐక్య గర్జన మహా సభను నిర్వహించనున్నట్లు ప్రకటించారు.  కాపులను బీసీల్లో చేరుస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చినందునే కాపులు ఇప్పుడు రోడ్లమీదకు వచ్చి నిరసనలు తెలుపుతున్నారని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హామీని నిలబెట్టుకోవాలన్నారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్లను అడ్డుపెట్టుకొని కాపు ఉద్యమాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.




కిర్లంపూడిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముద్రగడ మాట్లాడారు. కాపులను బీసీల్లోకి చేర్చుతామని, ఏటా రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తామని, కార్పొరేషన్ ఏర్పాటు చేసి కాపుల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని చెప్పి కాపుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఏడాదిన్నర దాటినా హామీలను నెరవేర్చకపోవడమే కాక కాలయాపనతో కాపులను మోసగించేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. ఆర్థికంగా వెనుకబడిన కాపుజాతికి రిజర్వేషన్ ఫలాలు దక్కాలనే ఉద్దేశంతోనే ఉద్యమిస్తున్నట్టు చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ కోటాకి ఎలాంటి నష్టం లేకుండా మిగిలిన 50 శాతంలోనే కాపులకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్‌లు కేటాయించాలని డిమాండ్ చేశారు.


ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అమలు చేసేవరకు కాపుల పోరాటం ఆగదని, కమిషన్‌ల పేరుతో కాలయాపన చేస్తే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పారు. రాజస్థాన్‌లో గుజ్జర్లను బీసీ జాబితాలో చేర్చుతూ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేయడమే కాక కేంద్రానికి సిఫార్సు చేసిందన్నారు. జీఓ ద్వారానే కాపులను బీసీ జాబితాలో కలపాలి తప్ప కమిషన్‌ల వల్ల ఉపయోగం లేదన్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top