నాడి తెలిసిన వాణి!

MP Satyavati Spoke On Anakapalli Parliamentary Constituency Issues In Parliament - Sakshi

పార్లమెంటులో అనకాపల్లి ప్రతిధ్వని

గళం విప్పిన ఎంపీ సత్యవతి

స్థానిక సమస్యల ప్రస్తావన

రైల్వే ప్రయాణికుల సమస్యలు తీర్చాలని విజ్ఞప్తి

బొజ్జన్నకొండను అభివృద్ధి చేయాలని వినతి 

అనకాపల్లి పార్లమెంటు స్థానం నుంచి తొలి మహిళా ఎంపీగా ఎన్నికైన డాక్టర్‌ భీశెట్టి వెంకట సత్యవతి పార్లమెంట్‌లో గళం విప్పారు. జిల్లాకు సంబంధించిన పలు సమస్యలు ప్రస్తావించారు. అవసరాలపై వాణిని వినిపిస్తున్నారు. వైద్యురాలైన సత్యవతి ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి 86 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. పార్లమెంట్‌ సమావేశాల్లో పాల్గొనడమే గొప్ప అని భావించకుండా తన వాణిని, బాణిని వినిపిస్తున్నారు. వందలాదిమంది పార్లమెంటు సభ్యుల సమక్షంలో ఆమె జిల్లాకు చెందిన సమస్యలపై ప్రస్తావిస్తున్న తీరుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. నియోజకవర్గ పరిధిలోని ప్రజల నుంచి వచ్చిన వినతులను పార్లమెంట్‌ దృష్టికి తీసుకురావడంలో సఫలీకృతమయ్యారు. ఇప్పటికే మూడు అంశాలపై తనకు వచ్చిన అవకాశం ద్వారా పార్లమెంట్‌లో విశ్లేషిస్తూ అన్నిపార్టీల వారిని ఆకట్టుకున్నారు

సాక్షి, అనకాపల్లి: నిశితమైన పరిశీలన.. స్పష్టమైన వ్యాఖ్యానంతో ఎంపీ భీశెట్టి వెంకట సత్యవతి పార్లమెంటులో జిల్లాకు చెందిన సమస్యలను ప్రస్తావిస్తున్నారు. గురువారం రాత్రి జరిగిన సెషన్‌లో రైల్వేకు సంబంధించిన అంశాలను లేవనెత్తారు. అనకాపల్లి రైల్వేస్టేషన్‌లో ఫలక్‌నూమా ఎక్స్‌ప్రెస్‌కు, నర్సీపట్నం రోడ్డు వద్ద జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌కు హాల్టు కల్పించాలని కోరారు. నిత్యం తిరుపతికి జిల్లా నుంచి భక్తులు ఎక్కువగా వెళ్లడంతో అదనపు రైలును కేటాయించాలని కోరారు. విశాఖ నుంచి వారణాసికి వెళ్లేందుకు ప్రత్యేక రైలును ఏర్పాటు చేయాలని ప్రస్తావించారు. నర్సీపట్నం రోడ్డులో జన్మభూమి హాల్టు కోసం స్వయంగా రైల్వేశాఖ మంత్రి పియూష్‌గోయల్‌కు వినతిపత్రం అందజేశారు. జన్మభూమితోపాటు రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ కూడా నర్సీపట్నం రోడ్డు వద్ద హాల్టు కల్పించాలని విన్నవించారు. ఆ  పరిసర ప్రాంతాల్లోని ఉద్యోగులు, విద్యార్థులు, రోజువారీ ప్రయాణికులు నర్సీపట్నం రోడ్డు నుంచి ఇటు విశాఖపట్నం, అటు రాజమండ్రి వెళ్తుంటారని, అలాంటివారి సౌకర్యార్థం తప్పకుండా జన్మభూమి, రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌లకు హాల్టు కల్పించాలని రైల్వేశాఖ మంత్రిని కోరారు.

‘బొజ్జన్నకొండను అభివృద్ధి చేయాలి’ 
అనకాపల్లి మండలంలోని శంకరం వద్ద ఉన్న బొజ్జన్నకొండ అభివృద్ధిపై పార్లమెంట్‌లో సత్యవతి  ప్రస్తావించారు. గతంలో కేంద్రం నుంచి నిధులు మంజూరైనట్లు తెలుసుకున్న మేరకు బొజ్జన్నకొండ విశిష్టత గురించి వివరించడంతోపాటు దేశ విదేశాలకు చెందిన బౌద్ధబిక్షువులు, ప్రముఖులు వస్తున్నట్లు వివరించారు. అనకాపల్లి ఏరియా ఆస్పత్రిపై కూడా ఆమె పార్లమెంట్‌లో ప్రస్తావించారు. అనకాపల్లి ఆస్పత్రిని కేజీహెచ్‌ తరలో అభివృద్ధి చేయాలని ఆమె కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అనకాపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో ఉన్న దీర్ఘకాలిక సమస్యలను కేంద్రం ద్వారా పరిష్కరించగల అంశాలపై క్షుణ్ణంగా అ«ధ్యయనం చేస్తూ ఎంపీ సత్యవతి పార్లమెంట్‌లో ప్రసంగించడం కొత్త అయినప్పటికీ దృఢ సంకల్పంతో తన వాణి వినిపించారు.
 
నిరుద్యోగుల తరఫున గళం 
ఎంపీ సత్యవతి పార్లమెంట్‌ సమావేశాల్లో నిరుద్యోగుల తరఫున గళం విప్పారు. రైల్వే నియామక బోర్డు లేకుండా విశాఖపట్నం రైల్వేజోన్‌ ఏర్పాటు చేశారని, ఈ కారణంగా ఈ ప్రాంతంలో నిరుద్యోగ యువతకు న్యాయం జరగడం లేదన్నారు. అనకాపల్లి రైల్వేస్టేషన్‌ పేరుకే ఏ–1 రైల్వేస్టేషన్‌గా పరిగణిస్తున్నప్పటికీ లోకమాన్యతిలక్, ఫలుక్‌నూమా, అమరావతి, నాందేడు–విశాఖపట్నం సూపర్‌ఫాస్ట్‌ రైళ్లకు అనకాపల్లిలో హాల్టు కల్పించడం లేదన్నారు. విశాఖపట్నం నుంచి బెంగళూరుకు కూడా ప్రత్యేక రైలును ఏర్పాటు చేయాలని ఆమె కోరారు. పార్లమెంటు స్థానిక సమస్యలను ఎంపీ లేవనెత్తిన విషయం తెలుసుకున్న ప్రజలు ప్రశంసలు కురుపిస్తున్నారు. తమకు సరైన నాయకురాలు దొరికారంటున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top