కరోనాను ఓడించారు

Mother And Child Relief From Coronavirus in Anantapur - Sakshi

పూర్తిగా కోలుకున్న తొలి రెండు పాజిటివ్‌ బాధితులు

హర్షధ్వానాల మధ్య ఆసుపత్రి బయటకు..

అంబులెన్స్‌లో ఇళ్లకు తరలింపు

వైద్యులు, అధికార యంత్రాంగం కృషికి అభినందనలు

నిండా పదేళ్లు కూడా లేని బాలుడు. మరో 35 ఏళ్ల మహిళ. కుటుంబానికి దూరమై సరిగ్గా 19 రోజులు. క్షణమొక యుగంలా గడిపారు. ఎన్నో అనుమానాలు.. మరెన్నో ఆందోళనలూ.. అయినా వైద్యుల సాయంతో కరోనా మహమ్మారిపై పోరు సాగించారు. అంతిమంగా మహమ్మారిపై విజయం సాధించారు. సంపూర్ణ ఆరోగ్యవంతులై గురువారం సాయంత్రం సరిగ్గా 6.50 నిమిషాలకు ఆస్పత్రి నుంచి బయటకు అడుగుపెట్టారు. అప్పటికే అక్కడకు చేరుకున్న వైద్యులు, జిల్లా యంత్రాంగం చప్పట్లతో వారికి స్వాగతం పలికారు. మృత్యువుపై విజయం సాధించిన వారిని అభినందించి ఇళ్లకు పంపారు. వైరస్‌ను జయించిన వీరిద్దరూ ఎందరికో బతుకులపై ఆశలు కల్పించారు.

అనంతపురం హాస్పిటల్‌:  ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిపై ‘అనంత’ వైద్యులు తొలి విజయం సాధించారు. జిల్లాలో నమోదైన తొలి రెండు పాజిటివ్‌ కేసులను పూర్తిగా నయం చేశారు. వైద్యుల నిరంతర శ్రమకు బాధితుల ఆత్మస్థైర్యం తోడు కావడంతో వైరస్‌ బారిన పడిన పదేళ్ల బాలుడు అయాన్, 35 ఏళ్ల ఆయేషా వేగంగా కోలుకున్నారు. కరోనా నిర్ధారణ పరీక్షల్లోనూ ఇద్దరికీ  నెగిటివ్‌ రిపోర్టు రాగా జిల్లా అధికారులు వారిని గురువారం డిశార్చ్‌ చేశారు. కరోనా బారిన పడిన వారు బతుకుతారో లేదోనని జనమంతా ఆందోళన చెందుతున్న సమయంలో వీరిద్దరూ సంపూర్ణ ఆరోగ్యవంతులు కావడంతో అధికార యంత్రాంగం ఊపిరి తీసుకుంది. ఇక వైద్యులు కూడా రెట్టించిన ఉత్సాహంతో బాధితుల సేవల్లో నిమగ్నమయ్యారు.

తొలి రెండు పాజిటివ్‌ కేసులూ నెగిటివ్‌  
మక్కాకు వెళ్లొచ్చిన హిందూపురానికి చెందిన 35 ఏళ్ల మహిళ షేక్‌ ఆయేషా, అలాగే మక్కాకు వెళ్లి వచ్చిన  కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారితో సన్నిహితంగా మెలిగిన లేపాక్షికి చెందిన 10 ఏళ్ల బాలుడు అయాన్‌ మార్చి 29న కరోనా పరీక్షలు చేయగా రిపోర్ట్‌  పాజిటివ్‌ వచ్చింది. దీంతో వారిని హిందూపురం ఆస్పత్రిలోని ఐసోలేషన్‌లో కొన్ని రోజులు పాటు ఉంచి సేవలందించారు. అనంతరం ప్రభుత్వం ఆదేశాల మేరకు అనంతపురంలోని కోవిడ్‌ ఆస్పత్రి కిమ్స్‌–సవీరాకు తరలించారు. అక్కడ కార్పొరేట్‌ వైద్యాన్ని ఉచితంగా అందించారు. రోజూ వారికి మంచి పౌష్టికాహారంతో పాటు వైద్య చికిత్సలు అందించారు. ఈ క్రమంలో వారి ఆరోగ్యం నిలకడగా ఉండడంతో ఈ నెల 15న వారికి పరీక్షలు నిర్వహించారు. ఇద్దరికీ నెగిటివ్‌ రిపోర్ట్‌ వచ్చింది. వారితో పాటు వైద్య కళాశాలలోని వైద్యుడు (అనుమానిత కేసు)కు  పరీక్షలు జరిపారు. ఆయనకు నెగిటివ్‌ రిపోర్టు వచ్చింది. 

హర్షధ్వానాల మధ్య ఇళ్లకు..
కరోనా వైరస్‌ బారిన పడి పూర్తిగా కోలుకున్న ఆయేషా, అయాన్‌లను గురువారం సాయంత్రం 6.50 గంటల సమయంలో కిమ్స్‌ సవీరా నుంచి డిశ్చార్జ్‌ చేశారు. ఇన్‌చార్జ్‌ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ పద్మావతి, ఏడీఎంహెచ్‌ఓ డాక్టర్‌ రామసుబ్బారావు, డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ రమేష్‌నాథ్‌ సమక్షంలో వారికి ప్రత్యేక అంబులెన్స్‌లో ఇంటికి పంపారు. వారిని డిశ్చార్జ్‌ చేసే సమయంలో కిమ్స్‌–సవీరా యాజమాన్యం, వైద్యులు, సిబ్బంది చప్పట్లుతో స్వాగతం పలికారు. ఆ సమయంలో కరోనాను జయించిన మహిళ, బాలుడు విక్టరీ సింబల్‌ చూపుతూ..‘మేము ఆరోగ్యంగా ఉన్నామంటూ చేతులూ ఊపారు. అనంతరం వారిని ప్రత్యేక 108 అంబులెన్స్‌లో ఇళ్లకు పంపారు. 

ఆరోగ్యం కాపాడుకోవాలి  
ప్రస్తుతం ఇళ్లకు వెళ్తున్నప్పటికీ 14 రోజుల పాటు హోం ఐసోలేషన్‌లోనే ఉండి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఇన్‌చార్జ్‌ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ పద్మావతి, ఏడీఎంహెచ్‌ఓ డాక్టర్‌ రామసుబ్బారావు, డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ రమేష్‌నాథ్‌ హిందూపురంకు చెందిన ఆయేషా, లేపాక్షికి చెందిన ఆయాన్‌కు సూచించారు. జిల్లా అధికార యంత్రాంగం, కిమ్స్‌ సవీరా వైద్యుల కృషితో సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండడంతో డిశ్చార్జ్‌ చేశామన్నారు. వీరికి హిందూపురం, లేపాక్షి వైద్యులు వారి ప్రాంతాల్లో  స్వాగతం పలుకుతారన్నారు. ప్రభుత్వ సూచనల ప్రకారం నడుచుకుంటూ, సామాజిక దూరం పాటిస్తే వైరస్‌ను పారదోలవచ్చన్నారు.

కలెక్టర్‌ అభినందన
కరోనా బారిన పడిన వారు పూర్తిగా కోలుకొనేలా సపర్యలు చేసిన కిమ్స్‌–సవీరా వైద్యులు, సిబ్బంది, ఆరోగ్యశాఖ సిబ్బందిని కలెక్టర్‌ గంధం చంద్రుడు అభినందించారు. జిల్లాలో నమోదైన తొలిరెండు పాజిటివ్‌ కేసులు నెగిటివ్‌ రావడంపై కలెక్టర్‌ హర్షం వ్యక్తం చేశారు. ఇదే తరహాలో మిగితా బాధితులకు పూర్తిగా నయం చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటుందన్నారు.

జగన్‌ భయ్యాకు సలాం
కరోనా సోకితే ప్రాణాలు పోతాయని అందరూ చెప్పేవాళ్లు. చాలా భయమేసింది. కానీ కలెక్టర్‌ సార్, ఇంకొందరు పెద్దోళ్లు మాట్లాడి భయపడవద్దని ధైర్యం చెప్పారు. కిమ్స్‌–సవీరాలో వైద్యులు బాగా చూసుకున్నారు. భోజనానికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఏమైనా సమస్య ఉందా అని తరచూ అడిగేవారు. ఇవాల డిశ్చార్జ్‌ చేసి పంపుతున్నారు. చాలా థ్యాంక్స్‌ సార్‌. ముఖ్యంగా జగన్‌ భయ్యాకో సలాం. మాలాంటి పేదోళ్లకు పెద్దాస్పత్రిలో ఉంచి సేవలందించారు.  –  షేక్‌ ఆయేషా, హిందూపురం
 
చాలా హ్యాపీ
ఆస్పత్రిలో సారోళ్లు బాగా చూసుకున్నారు. టైంకి భోజనాలందించారు. నేను ఆరోగ్యంగా ఉన్నా.  అమ్మ, నాన్నలను కలిసేందుకు వెళ్తున్నా . చాలా సంతోషంగా ఉంది. బాగా చూసుకున్నందుకు అందరికీ థ్యాంక్స్‌.– అయాన్, లేపాక్షి

ప్రారంభదశలో గుర్తిస్తే ఉత్తమ ఫలితం 
కరోనా కేసులను ప్రారంభదశలోనే గుర్తిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు. కరోనా వైరస్‌ నుంచి పూర్తిగా కోలుకుని ఇద్దరు డిశ్చార్జ్‌ కావడం ఆనందంగా ఉంది. ఈ నెల 7న వారిద్దరూ ఆస్పత్రిలో అడ్మిట్‌ అయ్యారు. ప్రస్తుతం ఆస్పత్రిలో మరో 15 కేసులు అడ్మిషన్‌లో ఉన్నాయి. వారిని కూడా పూర్తిగా ఆరోగ్యవంతులను చేసేందుకు సేవలందిస్తున్నాం.– డాక్టర్‌ రవిశంకర్, కిమ్స్‌ సవీర క్రిటికల్‌ కేర్‌ హెడ్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top