ఇంజినీరింగ్‌ పల్టీ

Most Of Engineering Seats Remain Vacant In Andhra Pradesh - Sakshi

జిల్లాలో ఇంజినీరింగ్‌ కళాశాలల యాజమాన్యాల ఆశలు గల్లంతయ్యాయి. మూడేళ్లుగా కళాశాలల్లో పూర్తి స్థాయిలో సీట్లు భర్తీకాక నానా తంటాలు పడుతున్నారు. ఈ ఏడాది పరిస్థితి మరింత దారుణంగా మారింది. తొలి విడతలో కన్వీనర్‌ కోటాలో 55.67 శాతం భర్తీ కావడంతో కొన్ని కళాశాలల యాజమాన్యాలు సీట్లు పెంచుకున్నాయి. అయితే తొలి విడతలో కంటే రెండో విడతలో భర్తీ 4.07 శాతం తగ్గడంతో  యాజమాన్యాలు ఇప్పుడు తలలు పట్టుకుంటున్నాయి. కనీసం ఒక్క కళాశాలలో కూడా 100 శాతం సీట్లు భర్తీ కాలేదంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థమవుతుంది. ఎన్‌బీకేఆర్‌ 81.0 శాతం భర్తీతో జిల్లాలో టాప్‌గా నిలిచింది. రెండు కళాశాలల్లో 2 శాతం లోపు, మరో రెండు కళాశాలల్లో 6.2 శాతం లోపు సీట్లు భర్తీ అయ్యాయి. మొత్తంగా ఇంజినీరింగ్‌ కళాశాలలు సీట్లు భర్తీ చేసుకోవడంలో పల్టీ కొట్టాయి. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో ఇంజినీరింగ్‌ కళాశాలల మనుగడ ప్రశ్నార్థకం కానుంది.

నెల్లూరు (టౌన్‌): జిల్లా వ్యాప్తంగా 21 ఇంజినీరింగ్‌ కళాశాలలు ఉన్నాయి. ఆయా కళాశాలల్లో తొలి విడత కౌన్సెలింగ్‌కు 5,931 సీట్లు ఉన్నాయి. ఈ సీట్లలో 3,302 సీట్లతో 55.67 శాతం భర్తీ అయ్యాయి. అయితే రెండో విడత కౌన్సెలింగ్‌కు ఆయా కళాశాలల్లో 6,523 సీట్లకు పెంచుకున్నారు. వాటిల్లో 3,366 సీట్లతో 51.60 శాతం మాత్రమే భర్తీ అయ్యాయి. రెండో విడతకు డిమాండ్‌ ఉన్న బ్రాంచ్‌ల్లో మొత్తం 592 సీట్లను పెంచుకున్నారు. సీట్లు స్వల్పంగా పెంచుకున్నా ఇంకా 3,157 సీట్లు ఆయా కళాశాలల్లో మిగిలిపోయాయి. తొలి విడత కంటే రెండో విడతలో కేవలం 64 సీట్లలో అధికంగా విద్యార్థులు చేరారు. తొలివిడత కంటే రెండో విడతలో సీట్ల భర్తీలో 4.06 శాతం తగ్గింది.

జిల్లాలో కళాశాలలు 21
మొత్తం సీట్లు  6,523
భర్తీ అయినవి 3,366
భర్తీ కాని సీట్లు 3,157
తొలి విడతలో భర్తీ 55.67 శాతం
రెండో విడతలో భర్తీ 51.60 శాతం

 

జిల్లాలో టాప్‌ భర్తీ 81 శాతమే
జిల్లాలో ఆశించిన స్థాయిలో కళాశాలల్లో సీట్లు భర్తీ కాలేదు. రెండో విడత కౌన్సెలింగ్‌ ఈ నెల 13వ తేదీతో ముగిసింది. జిల్లాలో ఏ కళాశాలలోనూ 100 శాతం సీట్లు భర్తీ కాలేదు. ఎన్‌బీకేఆర్‌ 81 శాతం సీట్లు భర్తీఅయి జిల్లాలో టాప్‌గా నిలిచింది. ఆ తర్వాత రెండో స్థానంలో విశ్వోదయ 77.6 శాతం, మూడో స్థానంలో వీసీకేవీ 76.5 శాతం, నాలుగో స్థానంలో శ్రీ వెంకటేశ్వర ఇంజినీరింగ్‌ కళాశాల 74.3 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఆ తర్వాత 50 శాతానికి పైగా 5 కళాశాలల్లో సీట్లు భర్తీ అయ్యాయి. జిల్లాలో రెండు కళాశాలల్లో 2 శాతం లోపు సీట్లు భర్తీ కాగా, 10 శాతం లోపు మరో 3 కళాశాలలు ఉన్నాయి. వీటితో పాటు మరో 7 కళాశాలల్లో 10 నుంచి 50 శాతం లోపు సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి.

సీఎస్‌ఈ, ఈసీఈలకే డిమాండ్‌ 
ఇంజినీరింగ్‌లో సీఎస్‌ఈ, ఈసీఈ, సివిల్, మెకానికల్, ట్రిపుల్‌ ఈ, ఐటీ తదితర బ్రాంచ్‌లు ఉన్నాయి. వీటిల్లో సీఎస్‌ఈ, ఈసీఈ బ్రాంచ్‌లకే డిమాండ్‌ ఉంది. ఈ రెండు కోర్సుల్లో చదివేందుకే విద్యార్థులు మొగ్గు చూపుతున్నారు. కంప్యూటర్‌ కోర్సు పూర్తి చేస్తే వెంటనే ఉద్యోగంలో చేరవచ్చన్న భావన విద్యార్థుల్లో నెలకొంది. జిల్లా వ్యాప్తంగా ఆయా కళాశాలల్లో 1,711 సీఎస్‌ఈ సీట్లు ఉంటే 1,297 మందితో 75.8 శాతం భర్తీతో టాప్‌గా నిలిచింది. ఆ తర్వాత ఈసీఈలో 1,977 సీట్లుకు 1,297 భర్తీతో 65.6 శాతం, ట్రిపుల్‌ఈలో 933 సీట్లకు 309 భర్తీతో 33.1 శాతం, మెకానికల్‌లో 863 సీట్లకు 236 భర్తీతో 27.3 శాతం, సివిల్‌లో 1,039 సీట్లకు 227 మంది చేరి 21.8 శాతం భర్తీ అయ్యాయి.

నిరాశలో యాజమాన్యాలు
ఇంజినీరింగ్‌ రెండో విడత కౌన్సెలింగ్‌లో ఆశించిన స్థాయిలో సీట్లు భర్తీ కాకపోవడంతో ఆయా ఇంజినీరింగ్‌ కళాశాలల యాజమన్యాలు నిరాశలో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తామని ప్రకటించింది. ఇప్పుడే పరిస్థితి ఈ విధంగా ఉంటే రానున్న రోజుల్లో ఏ విధంగా ఉంటుందోనన్న ఆందోళనలో కళాశాలల యజమానులు ఉన్నారు. ఇప్పటికే కొన్ని ఇంజినీరింగ్‌ కళాశాలలు మూత పడే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిసింది. ప్రధానంగా జిల్లాలో ఇంటర్‌ చదివిన విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఇంజినీరింగ్‌ కళాశాలల్లో చేరేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ రీతిలో ప్రతి ఏటా 3 వేల మందికి పైగా విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లో చదివేందుకు వెళుతున్నట్లు చెబుతున్నారు. ఇక్కడ కళాశాలల్లో మౌలిక సదుపాయాలతో పాటు బోధన, కంప్యూటర్‌ ల్యాబ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ తదితర సౌకర్యాలు సరిగా లేవన్న అభిప్రాయం ప్రతి ఒక్కరిలో నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఎక్కువ మంది విద్యార్థులు ఇంజినీరింగ్‌ చదివేందుకు ఇతర రాష్ట్రాల వైపు వెళ్తున్నట్లు తెలిసింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top