‘చంద్రబాబు తానా అంటే అశోక్‌ బాబు తందానా’

ప్రభుత్వ తొత్తుగా అశోక్‌బాబు!


కడప: ఉద్యోగుల హక్కుల కోసం శ్రమించకుండా, ఎన్జీఓల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు ప్రభుత్వ తొత్తుగా వ్యవహరిస్తున్నారని పశ్చిమ రాయలసీమ శాసనమండలి సభ్యుడు వెన్నపూస గోపాల్‌రెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం వైఎస్సార్‌ జిల్లా కడపలో నిర్వహించిన వైఎస్సార్‌సీపీ జిల్లా ప్లీనరీలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలోకి వచ్చేందుకు అనేక హామీలు గుప్పించి అన్ని వర్గాల ప్రజలను మభ్యపెట్టారన్నారు. ఉద్యోగులను సైతం ‘నేను మారిన మనిషిని...నమ్మండి, మరో అవకాశం కల్పించండని’ వేడుకుంటూ మేక వన్నె పులిలా వ్యవహరించారు.


అధికారంలోకి వచ్చాక తనదారి తనదే అన్నట్లు హామీలన్నీ అబద్ధాలేనని తేటతెల్లం చేశారని ఆరోపించారు. ప్రజలకు తాగు, సాగునీరు ఇవ్వలేని దుస్థితిలో టీడీపీ ప్రభుత్వం ఉందని ధ్వజమెత్తారు. పాలన మొత్తం అవినీతి మయం చేశారని అన్నారు. రైతు రుణమాఫీ నీరుగార్చారు. డ్వాక్రా రుణాలు రద్దు ఉత్తుత్తిదేనని తేల్చారు. నిరుద్యోగ భృతి భ్రమగా మిగిల్చారని ఎమ్మెల్సీ గోపాల్‌రెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రిగా అన్ని వర్గాల ప్రజల అభిమానాలకు దూరమైన వ్యక్తి అని విమర్శించారు.మరోమారు చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసుకోగల్గితే అప్పుడే పర్మినెంటు రాజధాని సాధ్యమౌతోందని ఎన్జీఓ నేత ఆశోక్‌బాబు పేర్కొనడంలో ఔచిత్యమేమిటని నిలదీశారు. ఉద్యోగ వర్గాలకు సైతం న్యాయం చేయకుండా ప్రభుత్వం నియంతృత్వ ధోరణి అవలంభిస్తోందని ఆరోపించారు. ఇప్పటి వరకు ఉద్యోగులకు రావాల్సిన పీఆర్సీ అరియర్స్, డీఏల పట్ల శ్రద్ద చూపి ఉద్యోగుల హక్కుల కోసం పనిచేయాలని అశోక్‌బాబుకు ఆయన హితవు పలికారు. రాజధాని కోసమే మరోమారు సీఎంగా చంద్రబాబు ఉండాలని పేర్కొనడం ఏమేరకు సబబో విజ్ఞనులైన ఉద్యోగులు, ఎన్జీఓలు ఆలోచించాలని కోరారు.


ఎన్జీఓ అధ్యక్షునిగా అశోక్‌బాబు... చంద్రబాబు భుజకీర్తుల కోసం తానా అంటే తందానా అంటూ తబలా కొడుతున్నారని విరుచుకుపడ్డారు. అశోక్‌బాబు ధోరణిని మేధావి వర్గాలు గ్రహించాలని ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. రాబోయే రోజులల్లో చంద్రబాబు పాలనకు ప్రజలు చరమగీతం పాడేందుకు సంసిద్ధంగా ఉన్నారని వివరించారు.

Back to Top