చంద్రబాబు వైఖరి దుర్మార్గం

చంద్రబాబు వైఖరి దుర్మార్గం


వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధ్వజంసాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులను అరెస్టు చేయించి, బహిరంగ సభలు జరుపుకోవడం దుర్మార్గం, గర్హనీయమని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో సాగునీటి ప్రాజెక్టులకు కేటాయించిన నిధులు, పూర్తయిన పనులపై చర్చకు వస్తారా? సిద్ధమేనా? అని చంద్రబాబుకు సవాలు విసిరారు. శ్రీకాంత్‌రెడ్డి బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.పులివెందులలో ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డిని తొలుత గృహ నిర్బంధంలో ఉంచడాన్ని, ఆ తరువాత సీఎం సభ వద్దకు వెళ్లకుండా అడ్డుకుని అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. తానేదో అభివృద్ధి చేశానని చంద్రబాబు అనుకున్నప్పుడు ప్రజాప్రతినిధులను సభకు రానిచ్చే ధైర్యం ఉండాలని అన్నారు. వారు వాస్తవా లు చెబుతారని ముందే భయపడిపోయి ఎంపీని, ప్రజాప్రతినిధులను, కార్యకర్తలను రానివ్వకుండా అరెస్టులు చేయించడం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని విమర్శించారు. పులివెందులకు తానే నీళ్లిస్తున్నట్లు చంద్రబాబు చెప్పుకోవడం ఏమాత్రం నిజం కాదని, వైఎస్‌ వల్లే అది సాధ్యమైందని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు.ప్రజలే  నాలుక కోస్తారు..జేసీకి హెచ్చరిక

సంస్కారహీనంగా రౌడీలా, గూండాలా మాట్లాడితే ప్రజలే ఆయన నాలుక కోస్తారని అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డిని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి హెచ్చరించారు. పైడిపాలెం సభలో జేసీ వ్యవహరించిన తీరుపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు.  రాయలసీమలో ఫ్యాక్షన్‌ కక్షలకు ఆజ్యంపోసి, రక్తపాతం సృష్టించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు.

Back to Top