చీకట్లో కనుమరుగై..చివరికి కన్నవారి చెంతకు

చీకట్లో కనుమరుగై..చివరికి కన్నవారి చెంతకు


రాజమండ్రి, న్యూస్‌లైన్ :పది నెలలు మోసి కన్నబిడ్డ.. ఈదురుగాలికి తెగిపడి, ఎటో కొట్టుకుపోయిన చిగురాకులా అదృశ్యం కాగా- ఆ తల్లిమనసు రంపపుకోతను అనుభవించింది. ‘మమ్మీడాడీ’ అన్న మాటలు తప్ప తన పేరు కూడా చెప్పలేని ఆ చిన్నారి.. చిమ్మచీకట్లో అమ్మానాన్నలకు దూరమై.. ఎన్నడూ ఎరగని చోటికి చేరుకుని.. గూటిని వీడిన పక్షికూనలా బెంగటిల్లింది. అయితే.. విధి వశాత్తు కథ సుఖాంతమైంది. ఆ తల్లి దుఃఖాశ్రువులు ఆనందభాష్పాలుగా మారాయి. ఆ బిడ్డ తిరిగి తల్లి ఒడికి చేరింది. విశాఖ జిల్లా అనకాపల్లిలో ఈనెల 24న రాత్రి అదృశ్యమైన రెండున్నరేళ్ల పసిపాప.. బుధవారం రాజమండ్రిలో తిరిగి తల్లిదండ్రుల చెంతకు చేరింది. అనకాపల్లిలో ‘హైటెక్ ఆప్టికల్స్’ పేరుతో కళ్లజోళ్ల వ్యాపారం నిర్వహించే విన్నకోట ప్రవీణ్ కుమార్తె కౌశిక. ఆ పాప ఈ నెల 24న రాత్రి 7.30 గంటల సమయంలో షాపు వద్ద ఆడుకుంటుండగా ఈదురుగాలులు వీచి కరెంటు పోయింది. ఆ చీకట్లోనే పాప అదృశ్యమైంది. ఆచూకీ కోసం గాలించినా ఫలితం లేకపోవడంతో తల్లిదండ్రులు అనకాపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 

 కరపత్రాలతో పాటు సీసీసీ ఛానల్‌లో స్క్రోలింగ్ ద్వారా ప్రచారం చేశారు. అయినా ఆచూకీ తెలియకపోవడంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. కాగా ఈనెల 26న రాజమండ్రిలోని గీతా అప్సరా థియేటర్ వద్ద తప్పతాగిన ఇద్దరు స్త్రీ పురుష యాచకులు వారి వద్ద ఉన్న రెండున్నరేళ్ల చిన్నారి ‘నాదంటే, నాదని’ ఘర్షణ పడుతుండగా సమీపంలో కూరగాయల వ్యాపారం చేసే పోకల కామమ్మ, పిట్టా ఆదిలక్ష్మి, ముత్తులక్ష్మి, పిట్టా యర్రమ్మ, రట్టె యల్లమ్మలకు అనుమానం వచ్చి నిలదీశారు. యాచకులు ఆ పాప తమ కూతురి కుమార్తె అని చెప్పారు. మహిళలు పాప తల్లిని తీసుకురావాలంటే చనిపోయిందన్నారు. పోనీ, తండ్రినైనా తీసుకురావాలంటే అతడూ మరణించాడని చెప్పారు. దీంతో అనుమానం బలపడిన యాచకులను, బిడ్డను వన్‌టౌన్ పోలీసులకు అప్పగించారు. యాచకులను మందలించి వదిలేసిన పోలీసులు..బిడ్డను ఆచూకీ తెలిసే వరకూ సంరక్షించాలని ఆ మహిళల్లో పిల్లలు లేని ముత్తులక్ష్మికి అప్పగించారు.

 

 విశాఖ జిల్లా చోడవరానికి చెందిన దుర్గాప్రసాద్ బుధవారం టీవీలో కౌశిక తప్పిపోయినట్టు వచ్చిన స్క్రోలింగ్ చూశాడు. ముత్తులక్ష్మి కుటుంబానికి పరిచితుడైన అతడికి తప్పిపోయిన ఓ పాప  రాజమండ్రిలో వారి వద్ద ఉంటున్న సంగతి తెలుసు. దాంతో అతడు ప్రవీణ్‌కు ఫోన్ చేసి విషయం చెప్పాడు. ప్రవీణ్ వెంటనే రాజమండ్రిలో తన స్నేహితుడైన గీతా ఆప్టికల్స్ యజమాని గజేంద్రకు ఫోన్ చేసి ముత్తులక్ష్మి వద్ద ఉన్న పాప ఫోటో తీసి తనకు పంపాలని కోరాడు. గజేంద్ర పంపిన ఫొటో తమ కుమార్తెదే కావడంతో ఆ తల్లిదండ్రుల ఆనందానికి హద్దు లేదు. వెంటనే రాజమండ్రి చేరుకున్నారు. వన్ టౌన్ ఎస్సై రాజశేఖర్ అనకాపల్లి ఎస్సై పి.కోటేశ్వరరావు సమక్షంలో కౌశికను తల్లిదండ్రులకు అప్పగించారు.

 

 యాచకులే కిడ్నాప్ చేశారా?

 అనకాపల్లిలో అదృశ్యమైన కౌశిక రాజమండ్రిలో యాచకుల వద్దకు ఎలా వచ్చిందనేది ఇప్పటికీ చిక్కుప్రశ్నగానే ఉంది. పాపను యాచకులే కిడ్నాప్ చేసి ఉండవచ్చన్న అనుమానం వ్యక్తమవుతోంది. మహిళలు తమకు అప్పగించిన యాచకులను మందలించి వదిలేసిన పోలీసుల వైఖరి కూడా విమర్శనార్హమవుతోంది. యాచకులను నిర్బంధంలోకి తీసుకుని క్షుణ్నంగా విచారించి ఉంటే.. కౌశిక అదృశ్యం వెనుక పిల్లలను అపహరించే ముఠా ఉన్న పక్షంలో బయటపడేది. అలా చేయకపోవడం పోలీసుల నిర్లక్ష్యాన్ని చాటుతోంది. శనివారం  అదృశ్యమైన కౌశిక సోమవారం వరకూ ఎక్కడ ఉందనేది కూడా తెలియాల్సి ఉంది.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top