‘తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌గా లక్ష్మీ పార్వతిని నియమించాం’

Ministers Taneti Vanita And Adimulapu Suresh Talks In Legislative Council In Amaravati - Sakshi

సాక్షి, అమరావతి: సీపీఎస్‌ రద్దుపై ప్రభుత్వం కట్టుబడి ఉందని స్త్రీ, శీశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. సోమవారం శాసనమండలిలో ఆమె మాట్లాడుతూ.. సీపీఎస్‌ రద్దుపై  మంత్రుల కమిటీని నియమించామని తెలిపారు. సీపీఎస్‌ రద్దుపై ఇప్పటికే ఈ కమిటీ రెండు సార్లు భేటి అయ్యిందని, ఈ కమిటీకి సూచనలు ఇచ్చేందుకు సీఎస్‌ నేతృత్వంలో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులతో వర్కింగ్‌ కమిటీని నియమించామని తెలిపారు. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి ఈ కమిటీ నివేదికను మంత్రుల కమిటీకి సమర్పిస్తుందన్నారు. సీపీఎస్‌ రద్దు తరువాత ఉద్యోగులకు ఏరకంగా పెన్షన్‌ను ఖరారు చేయాలనే అంశంపై సాంకేతిక సమస్యలు ఉన్నాయని, ఈ సందర్భంగా  ఆర్థిక పరమైన అంశాలను కూడా  పరిశీలించాల్సి ఉంటుందని అన్నారు. అయితే వాటికి అనుగుణంగా ఉద్యోగులకు మేలు చేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తుందని మంత్రి పేర్కొన్నారు.

అలాగే విద్యశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ పోట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, తెలుగు అకాడమీలపై శాసన మండలిలో మాట్లాడారు. ఈ క్రమంలో రాష్ట్ర విభజన చట్టం రాజ్యాంగంలోని  10వ షెడ్యూల్‌లో తెలుగు యూనివర్శిటీ అంశం ఉందని, అందువల్లే ఇంకా యూనివర్శిటీ విభజన జరగలేదని అన్నారు. ఏపీలో తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం బావిస్తోందని, దానిలో భాగంగానే ఏపీకి చెందిన ఉద్యోగుల ప్రయోజనాల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని అన్నారు. అయితే హైదరాబాద్‌లోనే విలువైన రాతప్రతులు, కైఫాయితులు ఉన్నాయని, రాష్ట్రానికి తీసుకువచ్చే ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. తమ ప్రభుత్వం తెలుగు భాష గౌరవాన్ని, ఔన్నత్యాన్ని కాపాడెందుకు కృతనిశ్చయంతో ఉందని, ఇప్పటికే భాషాసంస్కృతికి సంబంధించిన 14వేల డాక్యుమెంట్లను డిజిటలైజ్‌ చేశామని తెలిపారు.

అయితే ఇంకా వెయ్యి డాక్యుమెంట్లను డిజిటలైజ్‌ చేయాల్సి ఉందని, ప్రస్తుతం 32 మైక్రో ఫిల్మ్‌ రోల్స్‌ సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. వాటితో పాటు 111 ఫిల్మ్ రోల్స్‌ కూడ ఉన్నాయని వాటిని కూడా స్టోర్‌ చేశామని చెప్పారు. అలాగే విలువైన తాళపత్ర గ్రంథాలను స్కాన్‌ చేసి భద్రపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామని, త్వరలోనే తెలుగు అకామీ ద్వారా పాఠ్యపుస్తకాల ముద్రణ ప్రారంభిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా తెలుగు అకాడమీకి నందమూరి లక్ష్మీ పార్వతిని చైర్‌ పర్సన్‌గా ప్రభుత్వం నియమిస్తున్నట్లు తెలిపారు. అకాడమీ కార్యక్రమాలను తాడేపల్లి నుంచి నిర్వహిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top