సీఎం జగన్‌ అహర్నిశలు కృషి చేస్తున్నారు

Minister Botsa Satyanarayana Praises AP CM YS Jagan - Sakshi

సాక్షి, విజయనగరం : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ముఖ్యమంత్రి కాకముందే సమాజంలో చోటుచేసుకున్న అవకతవకలను వైఎస్‌ జగన్‌ తన పాదయాత్రలో తెలుసుకున్నారని పేర్కొన్నారు. ఆదివారం విజయనగరంలో జరిగిన వాలంటీర్ల సభలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ చాలా పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోను పేజీలకు పేజీలు నింపారు తప్ప ఎవ్వరూ పాటించలేదు.  కానీ వైఎస్‌ జగన్‌ 35 వాగ్ధానాలను ఒక్క పేపర్లో మాత్రమే పొందుపరిచారు. అన్నీ ప్రజలకు అర్ధమయ్యే రీతిలో స్పష్టంగా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షల వాలంటీర్లను ప్రభుత్వం నియమించింది.

డబ్బు ప్రధానం కాదు. ఆలోచన విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న ఉద్దేశ్యంతో వాలంటీర్ల నియామకం జరిగింది. వైఎస్సార్‌ సీపీ విడుదల చేసిన మేనిఫెస్టో మనందరికి భగవద్గీత.  జిల్లా వ్యాప్తంగా 777 సచివాలయాలు పెడుతున్నాం. చదువుకునే వాళ్లకి ఉద్యోగం ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం ముందుకు పోతోంది. లక్షా యాభై వేల ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ఈ ప్రభుత్వం ముందుకు సాగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలలో అందర్ని భాగస్వామ్యం చేయాలని భావిస్తున్నాం. జన్మభూమి కమిటీలు ప్రజలను దోచుకున్నాయి.  నవరత్నాలు, ప్రభుత్వ పథకాలు ప్రజలకు వివరించాలని వాలంటీర్లను నియమించారు. ప్రభుత్వం అంతా మీ ద్వారానే పథకాలని అమలు చేస్తుంది. గౌరవంగా పని చేసి పేదవారికి సంక్షేమ పథకాలు అందేలా చూడండి. జన్మభూమి కమిటీల మాదిరిగా పనిచేయకండి.

నిర్భయంగా ఎవరు అర్హులో గుర్తించండి. గతంలో పెన్షన్ గాని.. రేషన్ కార్డు  గాని..  ఇవ్వాలన్నా సాధ్యమయ్యేది కాదు. సేవ చేయాలన్నా, చూస్తూ ఉండిపోవల్సి వచ్చేది. ఇప్పడు సీఎం వైఎస్‌ జగన్‌.. సేవ చేసే అవకాశం మీకప్పగించారు. వెనుకబడిన జిల్లా మనది. అక్షరాస్యతలోనూ వెనుకబడి ఉన్నాం. ఆర్ధిక ఇబ్బందుల నేపథ్యంలో చాలమంది తమ పిల్లలను చదివించుకోలేక పోయారు. ఇప్పుడు ప్రభుత్వమే ప్రోత్సాహకాలను అందిస్తుంది. ప్రతి ఒక్కరు చదువుకోవాలని చెప్పండి. తప్పు చేస్తే ఉద్యోగంలోంచి తొలగిస్తాం. బాధ్యతగా పని చేసుకోండ’’ని అన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top