‘అందులో ఎలాంటి మొహమాట పడను’

Minister Anil Kumar Yadav Visits Polavaram Project - Sakshi

సాక్షి, పశ్చిమ గోదావరి : ఆర్‌అండ్ఆర్‌ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌ అధికారులకు సూచించారు. ఈ నెల 28న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు రానున్న నేపథ్యంలో బుధవారం మంత్రి అనిల్‌కుమార్‌, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ప్రాజెక్టును పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టు కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అనిల్‌ మాట్లాడుతూ.. వచ్చే వారం అన్ని ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలను పరిశీలిస్తానని చెప్పారు. పునరావాస గ్రామాల్లో నాణ్యతా పరమైన చర్యలు తీసుకుని పటిష్టంగా నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించారు. (చదవండి : వైఎస్సార్‌ మత్స్యకార భరోసా చెల్లింపులు ప్రారంభం​)

నిర్వాసితులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా.. వారు సంతోషంగా ఉండేలా సౌకర్యాలు కల్పించాలని మంత్రి అనిల్‌ సూచించారు. అధికారులు బాగా పనిచేస్తే వారి కృషిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతానని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఆ విషయం కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడంలో ఎలాంటి మొహమాట పడనని చెప్పారు. అనుకున్న ప్రకారం కచ్చితంగా పనులు జరగాలని అన్నారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రితో పాటుగా జిల్లా కలెక్టర్‌, ఎస్పీ, ఇరిగేషన్‌,రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top