‘చంద్రబాబూ.. ఇక డ్రామాలు ఆపు’

Minister Anil Kumar Yadav Fire On Chandrababu - Sakshi

టీడీపీ నేతలపై మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ ఫైర్‌

సాక్షి, అమరావతి: రాజకీయ పబ్బం కోసం ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, టీడీపీ నేతలు డ్రామాలు ఆడుతున్నారని ఇరిగేషన్‌ శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..కరకట్ట మీద ఉన్న ఇల్లు ఆయనది కాదన్న చంద్రబాబుకు..ఇప్పుడు వచ్చిన ఇబ్బందేమిటని ప్రశ్నించారు. ప్రైవేటు ప్రాపర్టీ కాదని గతంలోనే చంద్రబాబు చెప్పారని.. ఆ ఇల్లు మునిగిపోతుందన్న విషయం బయట ప్రపంచానికి తెలియనీయకూడదని చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. ఆయన చేసిన తప్పులను ప్రజలకు తెలియనీయకుండా అడ్డుకుంటున్నారన్నారు. వరద వస్తే చంద్రబాబు ఇల్లు మునిగిపోతుందని తాము ఎప్పుడో చెప్పామన్నారు. నేడు ఇసుక బస్తాలు వేసి ఆ నీరు పూర్తిగా ఇంటిలోకి రానీయకుండా అష్టకష్టాలు పడుతున్నారన్నారు.  ఆ ఇల్లు నాది కాదని  చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు మాట మార్చి.. నాదే అని ఎలా అంటున్నారని ప్రశ్నించారు. ఐదేళ్లలో వర్షాలు పడలేదని..దీంతో ప్రకాశం బ్యారేజీకి నీరు రాక పోవడంతోనే చంద్రబాబు ఇల్లు మునిగిపోలేదన్నారు. వరదొచ్చి ఉంటే తన ఇల్లు మునిగిపోకుండా రైతులకు నీరివ్వడం మాని.. చంద్రబాబు గేట్లు ఎత్తించే వారన్నారు. చంద్రబాబు ఇకనైనా డ్రామాలు ఆపాలని.. ప్రభుత్వ విధులను అడ్డుకోవద్దని హితవు పలికారు.

డ్రోన్ల సాయంతో వరద పరిస్థితి అంచనా:
ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు వచ్చే అవకాశముందని మంత్రి అన్నారు. దాదాపు 7 లక్షల క్యూసెక్కుల నీరు చేరే పరిస్థితి కనబడుతుందన్నారు. గంట గంటకూ నీటి  మట్టం పెరుగుతోందన్నారు. వరద పరిస్థితి అంచనా వేయడానికి  గత మూడు రోజులుగా  డ్రోన్లు వినియోగిస్తున్నామన్నారు. ఎగువ నుంచి వచ్చే వరదతో కరకట్ట  వెంబడి కొన్ని ప్రాంతాలు ముంపునకు  గురవుతున్నాయన్నారు. ఆయా ప్రాంతాల్లోని ప్రజల రక్షణ.. ప్రభుత్వ బాధ్యతగా పేర్కొన్నారు. డ్రోన్ల సాయంతో వరద పరిస్థితి ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నామని తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top