ఢిల్లీ వర్సిటీకి విద్యాశాఖ మంత్రి సురేష్‌ లేఖ

Minister Adimulapu Suresh Respond On AP Student Problems In Delhi University - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్‌బోర్డు గ్రేడింగ్‌ విధానంతో ఢిల్లీ యూనివర్సీటీలో ఏపీ విద్యార్థులు పడుతున్న కష్టాలపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ స్పందించారు. ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని కాలేజీ ప్రవేశాల్లో ఏపీ విద్యార్థులకు న్యాయం చేయాలని ఆయన శనివారం ఆ వర్సిటీ ఉపకులపతికి లేఖ రాశారు. ఏపీలో మార్కుల విధానానికి బదులు పర్సంటేజీ ప్రకారం గ్రేడింగ్‌ పాయింట్లు ప్రవేశపెట్టారన్నారు. ఈ విధానంలో వచ్చిన గ్రేడ్లను 10తో కాకుండా వర్సిటీ కేవలం 9.5తో గుణిస్తుండడంతో ఏపీ విద్యార్థులు సీట్లు కోల్పోతారని పేర్కొన్నారు. ఈ విషయంలో సానుకూలంగా స్పందించాలని వీసీని మంత్రి కోరారు.

కాగా దేశ రాజధాని ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో ఇంటర్‌లో ఉత్తీర్ణులైన విద్యార్థులు అండర్‌ గ్రాడ్యుయేషన్‌ కోసం ఢిల్లీ వర్సిటీ, దాని అనుంబంధ కళాశాలల్లో అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇంటర్‌లో మార్కులకు బదులుగా రాష్ట్రంలో కొత్తగా ప్రవేశపెట్టిన సీజీపీఏ గ్రేడ్ల విధానం వల్ల ఏపీ విద్యార్థులకు ప్రవేశాలు దొరకని పరిస్థితి ఏర్పడింది. ఇతర రాష్ట్రాల్లో యూజీ కోర్సుల ప్రవేశాలకు దరఖాస్తు చేసుకొనే ఏపీ విద్యార్థుల గ్రేడ్‌ పాయింట్లను 10తో గుణించి వచ్చే శాతాన్ని అడ్మిషన్ల ప్రక్రియలో పరిగణించాలని ఇంటర్‌ బోర్డు విద్యార్థులకు జారీ చేసిన మెమోలో స్పష్టం చేసింది. అయితే ఢిల్లీ వర్సిటీ మాత్రం తమకు ఏపీ ఇంటర్‌ బోర్డు నుంచి సమాచారం లేదంటూ విద్యార్థుల గ్రేడ్‌ పాయింట్లను 10తో కాకుండా 9.5తోనే గుణిస్తామంటూ స్పష్టం చేయడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.

తాము తీవ్రంగా నష్టపోతామని, కోరుకున్న కాలేజీలో ఎంచుకున్న కోర్సులో సీటు దక్కదని వాపోతున్నారు. సోమవారం మధ్యాహ్నంతో మొదటి విడత కౌన్సిలింగ్‌ ప్రక్రియ పూర్తవుతుందని, ఈలోగా రాష్ట్ర ప్రభుత్వం, ఇంటర్‌ బోర్డు తక్షణం స్పందించి తమకు న్యాయం చేయాలని అడ్మిషన్ల కోసం ఢిల్లీ వచ్చిన సుమారు 550 మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ విషయమై శనివారం ఢిల్లీలో ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ ప్రకాశ్‌ను కలసి సమస్యను వివరించారు. దీంతో ఆయన ఢిల్లీ వర్సిటీ తీరును వివరిస్తూ ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి ఆర్‌ సుబ్రహ్మణ్యంకు లేఖ రాశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top