వారూ మనుషులే..

వారూ మనుషులే.. - Sakshi


వారున్నది బద్వేలుకు కూతవేటు దూరంలో ఉన్న వల్లెలవారిపల్లె ఎస్సీ కాలనీలో.. జనవాసాలకు దగ్గరగా ఉన్నా దశాబ్ధాలుగా ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేకపోతున్నారు.. కనీస సౌకర్యాలు కూడా వారు పొందటం లేదు.. తాగునీరు.. వీధిలైట్లు లేక అవస్థలు పడుతున్నారు.. అడవుల్లో లభించే బంక, తేనె, పాలగడ్డలే వారికి జీవనాధారం..  వీటికోసం అడవిలోకి వెళ్లినప్పుడు ఎవరైనా చనిపోతే శవాన్ని అక్కడే  వదిలేసుకోవాల్సిన దుర్గతి..



వీరికి సరైన  గూడు లేదు...పొదుపులో ఉన్నా మాఫీ కాలేదు...  రేషన్, ఆధార్‌కార్డులు ఇచ్చిన పాపానపోలేదు. ఇంతవరకు ఏ అధికారి వీరిగురించి  పట్టించుకోలేదు... ఏళ్ల తరబడి చెరువులోని బావే వారికి ఆధారం.  అన్నింటికీ అదే నీటిని వాడుకుంటూ రోగాలతో నరకయాతన అనుభవిస్తున్నారు. బద్వేలు ఎమ్మెల్యే తిరువీధి జయరాములు వారితో మమేకం అయ్యారు.. వీఐపీ రిపోర్టర్‌గా వారి సమస్యలు తెలుసుకున్నారు.  

 

 ఆయన బద్వేలు ఎమ్మెల్యే జయరాములు. నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొం టున్న సమస్యలు, వారి కష్టాలు తెలుసుకునేందుకు సాక్షి వీఐపీ రిపోర్టర్‌గా మారారు. మారుమూల గ్రామాలు, దళిత వాడలు, గిరిజన ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించారు.



ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను కళ్లారా చూశారు. నవనాగరికి సమాజంలోనూ కనీస వసతులు కూడా లేకుండా బతుకీడుస్తున్న అడవి బిడ్డల జీవితాలు చూసి చలించిపోయారు. వారి కన్నీళ్లను చూసి కరిగిపోయారు. మీకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై పోరాటం చేస్తానని చెప్పారు.


 

 సాక్షి, కడప :

 వాహనంలో వెళుతూ.. వెళుతూ.. కాశినాయన మండలం ఓబులాపురం గ్రామం వద్ద రోడ్డు పక్కనే మంచంపై పడుకొని ఉన్న  మానసిక వికలాంగుడితో..

 వీఐపీ రిపోర్టర్ జయరాములు: అయ్యా! మీ పేరు ఏమి? ఏంటి ఇలా మంచంపై పడుకున్నారు? పింఛన్ వస్తుందా? సదరమ్ క్యాంపునకు వెళ్లారా?

 మానసిక వికలాంగుడు: సార్. నా పేరు ప్రభాకర్. నాకు కాళ్లు పనిచేయవు. సక్రమంగా వినబడదు..మాట కూడా అంతంత మాత్రమే సార్. నాకు ఇంతకుమునుపు రూ. 500 పింఛన్ వచ్చేది. అధికారులెందుకో నిలిపేశారు. ఎవరిని అడిగినా ఏం చెప్పరు. సదరమ్ క్యాంపుకు వెళ్లి అన్నీ తెచ్చినా ఎవరూ పట్టించుకోలేదు.

 వీఐపీ రిపోర్టర్: (ఇంటి నిర్మాణాన్ని చూసిన అనంతరం గుడిసెలో ఉన్న వారితో) అమ్మా..ఎంతకాలం నుంచి పూరి గుడిసెలో ఉన్నారు. కొట్టం పడిపోయేలా ఉంది. ఇల్లు రాలేదా?

 బండి లక్షుమ్మ: ఏడేళ్లయింది సార్...పది మంది ఉన్నాం. ఇది సరిపోలేదు సార్...కొట్టంలోనే అందరం అగచాట్లు పడతాండాం. కొట్టంలో ఉంటే ఇంట్లో ఉన్నట్లు ఉండదు. చెట్టుకింద ఉన్నట్లుగా ఉన్నాం. ప్రభుత్వం పట్టించుకోలేదు. మాకిద్దరు ఆడపిల్లలు. అయితే ఇప్పుడు పిల్లోళ్ల పెళ్లి చేద్దామంటే మా వల్ల కాలేదు. స్నానాలు చేయడానికి కూడా ఇబ్బంది పడుతున్నామయ్యా! ఇల్లు కూడా రాలేదు.

 వీఐపీ రిపోర్టర్: ఎందుకు ఇల్లు అసంపూర్తిగా పెట్టుకున్నారు? ఎంత బిల్లు ఇచ్చారు?

 జేమ్స్ : ఎంత అంటే అంత బేస్ మట్టానికి మాత్రమే ఇచ్చారు. మేము రెండు కుటుంబాలు కలిసి ఉన్నాం. అంతా ఒక్కసారి రూ. 13 వేలు ఇచ్చారు. అంతే ఇంకా బిల్లు ఇవ్వలేదు. రెండు ఇళ్లు మంజూరయ్యాయి. రూ 1.30 లక్షలు వస్తుందన్నారు. అప్పుచేసి ఇల్లు కట్టుకుంటూ డబ్బుల్లేక మధ్యలో ఆపేశాం. దీంతో నిర్మాణంలో ఉన్న ఇళ్ల మధ్యనే చెట్లు మొలుస్తున్నాయి తప్ప ప్రభుత్వం కనికరించలేదు.

 వీఐపీ రిపోర్టర్: నమస్తే అమ్మా..బాగున్నారా? నేనమ్మా మీ ఎమ్మెల్యేని. ఇల్లు రాలేదా తల్లీ. ఎంతమంది కాపురాలు ఉంటున్నారు? అంగన్‌వాడీ కేంద్రం ఉందా? పిల్లలకు టీకాలు వేస్తారా...రక్షణ ఎలా?

 బుజ్జమ్మ: (వరికుంట్లపల్లె యానాది కాలనీ) : సార్...మా కాలనీ గురించి ఎవరూ  పట్టించుకోరు సార్. మాకు బిల్లులు రాలా? అంగన్‌వాడీ స్కూలుకు వెళ్లాలంటే రెండు కిలోమీటర్లు పోవాలా. పిల్లలంతా ఇక్కడే తిరుగుతుంటారు. అడవి జంతువులు వస్తాంటాయ్..పోతంటాయి....ఎప్పుడైనా నర్సులు వచ్చి పోతుంటారుసార్. రక్షణ అంటే ఏమీ లేదు.

 సమీపంలో ఉన్న ముసలావిడను చూసి

 వీఐపీ రిపోర్టర్:అవ్వా.. పింఛన్ వస్తుందా?

 మలికి లక్షుమ్మ : పింఛన్ రాలేదు సార్...ఊరు కట్టినప్పటి నుంచి నేనున్నా. ఎవరూ పింఛన్ ఇవ్వలేదు సార్.

 వీఐపీ రిపోర్టర్: జీవనాధారం ఏంటి? బ్రతుకు దెరువుకు ఏం పనులు చేస్తారు? ఎవరికి ఎంత ఆదాయం వస్తుంది?

 వీరయ్య : ఏముంది సార్.. ఇదిగిదిగో కానస్తున్న ఆ కొండలోకి వెళ్లి బంక, తేనె, పాలగడ్డలు, షర్బత్తుగడ్డలు, ఉసిరికాయలు తెచ్చుకుని అమ్ముకుంటాం. రోజూ రూ. 200 వస్తాది.  కొండల్లోకి కూడా ఫారెస్టోళ్లు పోనీయడం లేదు.

 వీఐపీ రిపోర్టర్:ఆడవారు ఏం చేస్తారు? ఏదైనా ఉపాధి ఉందా?

 ఆదిలక్షుమ్మ: మేము మొగోళ్ల యంటనే కొండకు పోయి పాలగడ్డలు తీసుకుని వస్తాం. తర్వాత వారానికి ఒకసారి జరిగే సంతకు వెళ్లి అమ్ముకుంటాం.

 వీఐపీ రిపోర్టర్: ఆధార్, రేషన్‌కార్డులు ఉన్నాయా?

 చిన్నక్క: రాలేదు సార్...అట్టాంటి ఏంటో మాకు తెలీదు.

 వీఐపీ రిపోర్టర్: ఉపాధి హామీ కింద పనులు కల్పించారు కదా..ఎందుకు పోలేదు?

 పెంచలయ్య: కొన్ని రోజులు కరువు పని పెట్టారు. డైలీ పనికి పోతున్నాం. అయితే కూలీ పభుత్వం రెండు నెల్లకో, మూడునెల్లకో ఇస్తే మేం ఎట్టా బతకాలా సార్. అందుకే డబ్బులు చేతుల్లో లేకపోతే అన్ని రోజులు కష్టమని ఎందుకులే అని కొండకు పోతాండాం.

 వీఐపీ రిపోర్టర్:పొదుపు గ్రూపులున్నాయా? కాలనీలో ఎన్ని గ్రూపులున్నాయి? నెలనెలా పొదుపు డబ్బులు కడుతున్నారా? ఎంత లోన్లు ఇస్తున్నారు? ముఖ్యమంత్రి ప్రకటించిన రుణమాఫీ వర్తించిందా?

 లక్ష్మిదేవి: యాడా చేసినాడు సార్. ఆ టీడీపీ ఆయన ముఖ్యమంత్రి కాగానే మర్చిపోయినాడు. డ్వాక్రా రుణాలు మాఫీ చేయకుండా మోసం చేసిండు. మా ఊర్లో రెండు గ్రూపులున్నాయి. ఒక్కో గ్రూపుకు రూ. 70 వేలు చొప్పున అప్పు తీసుకున్నాం. నెలనెలా కంతులు కడుతున్నాం.

 వీఐపీ రిపోర్టర్: (కాలనీలో పిల్లోడ్ని ఎత్తుకున్న మహిళను చూసి): కొండకు వెళుతున్నప్పుడు మీకేమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా?

 లక్ష్మిదేవి: యాడా సార్....కొండలో మాకున్న ఇబ్బందులు ఎవరికీ లేవు. పాలగడ్డలు తవ్వుతూ మా భర్త ఏదో పురుగు కరిచి చనిపోయాడు. అంత దూరం కొండలోనుంచి శవాన్ని ఇంత దూరం తెచ్చుకోలేక అక్కడే వదిలేసినాం. ఎంతో బాధ సార్. అధికారుల దగ్గరికి వెళ్లి సాయం చేయమంటే చనిపోయినట్లు ఆధారం చూపమంటారు. కాటికాడికి వెళ్లి ఎంక తెచ్చి ఆధారం చూపియాలా? మా ఆయన చనిపోయి రెండు నెలలైంది. న్యాయం చేయండి.

 వీఐపీ రిపోర్టర్: ఏమ్మా మీకు భూములు ఏమైనా ఉన్నాయా? ప్రభుత్వం స్థలాలేమైనా ఇచ్చిందా? మీ సమస్యలేంటి?

 కె.కొండమ్మ: ఇచ్చింది సార్...యానాదోళ్లంటే అందరికీ అలుసే. సున్నపురాళ్లు, పెద్దపెద్ద బండరాళ్లు ఉన్న భూములు ఇచ్చారు. ఎవరెవరో హైదరాబాదు, నెల్లూరు, విజయవాడ వాళ్లకు మంచి మంచి భూములు ఇచ్చారు. రోడ్డు అధ్వానంగా ఉంది. నీళ్ల ట్యాంకు ఒకటి అవసరం.

 (వరికుంట్ల దళితవాడలో ఎమ్మెల్యేను చూడగానే నమస్తే సార్ అన్న వ్యక్తితో)

 వీఐపీ రిపోర్టర్:  వరికుంట్ల ఎస్సీ కాలనీలో ఏ సమస్యలు ఉన్నాయి? రోడ్ల పరిస్థితి ఎలాగుంది? ఎందుకు ఇక్కడ కరెంటు లేదు?

 పెద్దరామయ్య (ఎంపీపీ): రోడ్ల సమస్య ఇంకా ఉంది. కరెంటు కూడా లేదు.

 వీఐపీ రిపోర్టర్: ప్రధానంగా ఏం పనులు చేస్తున్నారు? పింఛన్ వస్తుందా అవ్వా?

 మరియమ్మ: ఇంతముందు మారాజు రాచ్చేఖర్‌రెడ్డి ఉన్నప్పుడు రూ. 200 వచ్చేది. మారాజు చనిపోయాక ఎవరూ పింఛనే ఇవ్వలేదు. బీద దాన్ని కాబట్టి అడిగే వారు లేరని పట్టించుకోలేదు. ఇక్కడ ఏం పనులుండాయి సార్ చేయడానికి?

 (వరికుంట్ల గ్రామంలో)

 వీఐపీ రిపోర్టర్: చంద్రబాబు రుణమాఫీ చేశారుగదా ఎంత వచ్చింది?

 జయరామిరెడ్డి: చంద్రబాబు మోసం చేశాడు. యాడ మాఫీ అయింది? అకౌంట్‌లో పడనే లేదు. పదివేలంటున్నారు. అన్ని బ్యాంకు అధికారులను అడిగాం. కొన్ని బ్యాంకులకే అంటున్నారు. ఏం అర్థం కావడం లేదు సార్.

 వీఐపీ రిపోర్టర్:  వరికుంట్లలో రుణమాఫీ ద్వారా లబ్ధి పొందిన వారు ఎంతమంది ఉన్నారు? బాబు అందరికీ చేశానంటున్నారు కదా?

 రామిరెడ్డి: రూ. 50 వేలలోపు ఉన్నందరికీ ఒకటేసారి అన్నాడు. యాడపన్నాది. వెయ్యో, రెండు వేలో అని కాగితాల్లో చెబుతాండారు. ఎవరికీ రుణమాఫీ కాలా. మా అందరికీ ఏం చేయాలో అర్థంగాక అట్టున్నాం. నమ్మి అందరం మోసపోయాం. యాడుంది సార్...డ్వాక్రా లేదు...రుణమాఫీ లేదు...ఇంటికో ఉద్యోగం లేదు....అన్నీ ఉత్తమాటలే.

 వల్లెలవారిపల్లె దళితవాడలో....

 వీఐపీ రిపోర్టర్:  ఏవమ్మా....మీరు ఇక్కడ నీళ్లు తెచ్చుకుంటున్నారు? మీ ఊర్లో కొళాయిలకు రావా?

 వెంకటమ్మ: సార్..రోజూ బాయిలో నుంచి నీరు తోడుకుంటాం. కరెంటు లేకపోతే కొళాయిలకు నీళ్లురావు. ఈన్నుంచి చూస్తే బద్వేలు కానొస్తాది. నీళ్లు మాత్రం కానరావు.

 వీఐపీ రిపోర్టర్:  ఎన్నేళ్ల నుంచి బావి నీళ్లు తాగుతున్నారు. రోగాలు వచ్చే ప్రమాదం ఉంది కదా?

 లక్ష్మిదేవి : ఏం చేయాలా సార్...కొళాయి నీరు రాదు. ఎప్పుడో కరెంటు ఉన్నప్పుడు వస్తే ఇంటికాడ ఎవరూ ఉండరు. అందరూ పనికి పోతారు. ఎప్పుడో రాత్రికొచ్చాం....నీరులేక చెరువులో ఉన్న బావిలో నుంచి తెచ్చుకుంటాం. మా అబ్బల కాలం నుంచి ఈ నీళ్లే తాగుతున్నాం. జ్వరాలు కూడా వచ్చాండాయ్ సార్...చాలా ఇబ్బంది ఉంది. మున్సిపాలిటోళ్లకు చెప్పినా పట్టించుకోలేదు. మా పిల్లోళ్లకు కూడా జరాలు వచ్చినాయి. రెండు వారాలుగా చచ్చిపోతాండాం.

 (వల్లెలవారిపల్లె ఎస్టీ కాలనీలో రాత్రి 7 గంటల సమయంలో)

 వీఐపీ రిపోర్టర్:  ఏమ్మా ఏంటి మేకల మధ్య ఉన్నారు? కాలనీలో కరెంటు కూడా లేదు. 21వ శతాబ్దంలో ఉండి కొట్టాల్లో ఉంటున్నారు? ఏంటి మీ కష్టాలు?

 కాంతమ్మ : చాలాకాలం నుంచి ఇట్టే కొట్టాల్లో ఉండాం సార్...ఎప్పుడో మా అబ్బబ్బల కాలం నుంచి ఈడే ఉన్నాం. ఎవరూ పట్టించుకోలా? రాత్రి సమయంలో పురుగులు వచ్చాంటాయ్.  ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోయి పదిరోజులైంది. కరెంటు లేదు....నీళ్లుకూడా రావడం లేదు. బోరు వేయించండి..కరెంటు ఇప్పించండి. ఎవరు చూసినా చూస్తాం.. చేస్తామంటున్నారు. ఎవరూ పట్టించుకోవడం లేదు. ఏమీ లేకుండా ఎలా బతకాలా సార్. ఇల్లులేదు, వాకిలి లేదు. వానాకాలం వస్తే పట్టలు వేసుకుని, మంచంపై కూర్చొని తెల్లార్లు జాగారం చేస్తాం.

 - సమస్యపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే

 సాక్షి వీఐపీ రిపోర్టర్‌గా ప్రజల వద్దకు వెళ్లిన ఎమ్మెల్యే జయరాములు తన దృష్టికి వచ్చిన సమస్యలపై వెంటనే స్పందించారు. ఎస్టీ కాలనీలో ఎమ్మెల్యే నిధుల నుంచి బోరు వేయిస్తానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా వెంటనే కాలనీలో చెడిపోయిన ట్రాన్స్‌ఫార్మర్‌కు కూడా మరమ్మతులు చేయించాలని అక్కడి నుంచే ఫోన్‌లో ట్రాన్స్‌కో ఏడీతో మాట్లాడారు. అంతేకాకుండా యానాది కాలనీలో రెండు నెలల క్రితం కొండలోకి వెళ్లి చనిపోయిన నారాయణ భార్య లక్ష్మిదేవికి అధికారులతో మాట్లాడి అంతో ఇంతో ఆర్థికసాయం వచ్చేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top