‘పచ్చ’పాతం చూపిన పోలీసుల్లో గుబులు 

Many police officers in fear that who tied with TDP - Sakshi

టీడీపీ అండతో ఐదేళ్లపాటు చెలరేగిపోయిన పలువురు అధికారులు   

చంద్రబాబు అడుగులకు మడుగులొత్తిన వారిపై సొంత శాఖలోనే అసంతృప్తి  

తమపై చర్యలు తప్పవేమోనని ఆందోళన చెందుతున్న వైనం  

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై పోలీసు శాఖలో పెరిగిన ధీమా  

సాక్షి, అమరావతి: ఇన్నాళ్లూ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించిన పోలీసుల్లో గుబులు మొదలైంది. ఐదేళ్లపాటు అధికార పార్టీ అండతో అడ్డగోలుగా వ్యవహరించిన పలువురు పోలీసు అధికారులు ఇప్పుడు ఆత్మరక్షణలో పడే పరిస్థితి వచ్చింది. చంద్రబాబు అడుగులకు మడుగులొత్తిన వారిపై సొంత శాఖలోనే తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తమైన సంగతి తెలిసిందే. కేంద్ర సర్వీసుకు చెందిన ఐపీఎస్‌ల దగ్గర్నుంచి రాష్ట్రంలోని పలువురు డివిజనల్‌ స్థాయి పోలీసుల వరకు అసలు విధులను వదిలేసి, కొసరు బాధ్యతలను భుజానికెత్తుకోవడం వివాదాస్పదంగా మారింది. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన పోలీస్‌ బాస్‌లు అధికార పార్టీకి కొమ్ముకాశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇక డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ చేసిన వ్యాఖ్యలు, చేష్టలు పెనుదుమారానికి దారితీశాయి. ఏసీబీ డీజీగా ఠాకూర్‌ టీడీపీ పెద్దల పొలిటికల్‌ టార్గెట్లకు తలొగ్గి కొందరు అధికారులపైనే దాడులు చేశారనే విమర్శలున్నాయి. అందుకు నజరానాగా మంత్రి నారా లోకేశ్‌ పట్టుబట్టి ఠాకూర్‌కు డీజీపీ పోస్టు ఇప్పించినట్టు అప్పట్లో ప్రచారం జరిగింది.  

కీలక పోస్టుల్లో బాబు సామాజికవర్గం అధికారులు  
ఇంటెలిజెన్స్‌ విభాగం డీజీగా పనిచేసిన ఏబీ వెంకటేశ్వరరావు సైతం పూర్తిగా చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసమే పని చేశారన్న విమర్శలున్నాయి. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌పై గెలిచిన ఎమ్మెల్యేలను తెలుగుదేశం పార్టీలో చేర్పించేలా ఏబీ వెంకటేశ్వరరావు మధ్యవర్తిత్వం వ్యవహరించారనే ఆరోపణలు అప్పట్లో గుప్పుమన్నాయి. ఏబీ వెంకటేశ్వరరావు సిఫార్సు చేసిన వారికే పోలీసు శాఖలో కీలక పోస్టులు కేటాయించడం కూడా వివాదాస్పదమైంది. ప్రధానంగా కీలక పోస్టుల్లో చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన వారిని, సొంత మనుషులను నియమించుకోవడంతో మిగిలిన సామాజిక వర్గాలకు చెందిన పోలీసు అధికారులు ఐదేళ్లుగా తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఇవేమి పట్టించుకోని కొందరు పోలీసు బాస్‌లు సార్వత్రిక ఎన్నికల నాటికి చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రస్థాయి పోస్టుల నుంచి డివిజనల్‌ స్థాయి వరకు, ఇంటెలిజెన్స్, స్పెషల్‌ బ్రాంచ్‌ డీఎస్పీల పోస్టుల్లోనూ తమ మాట వినేవారినే నియమించుకున్నారు.  

పోలీసు శాఖకు మళ్లీ పూర్వవైభవం  
చంద్రబాబుకు జీ హుజూర్‌ అంటూ ఆయన సేవలో తరించిన పోలీసు అధికారులు ఇప్పుడు తమ భవితవ్యం ఏమిటంటూ కలవరం చెందుతున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చాక తమపై చర్యలు తప్పవా? అని ఆందోళన చెందుతున్నారు. రాజకీయ పక్షపాతంతో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన ఏ అధికారికి అయినా ఇలాంటి ఇబ్బందికర పరిస్థితి తప్పదని సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో పోలీసు శాఖలో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. చంద్రబాబు పాలనలో నలిగిపోయిన నాలుగో సింహం జగన్‌ పాలనలో మళ్లీ జూలు విదిల్చడం ఖాయమని ఆ శాఖలో చర్చ జరుగుతోంది. పోలీసులు అడగకుండానే వీక్లీఆఫ్‌ ప్రకటించిన జగన్‌మోహన్‌రెడ్డి వారి మనసులు గెలుచుకున్నారు. పోలీసు శాఖను సంపూర్ణంగా ప్రక్షాళన చేసి, సమర్థులకే కీలక పోస్టులు అప్పగిస్తారని అధికారులు, సిబ్బంది ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top