అమ్మ చీరతో కుమారుడి ఆత్మహత్య

Man Commits suicide In Chilakaluripet - Sakshi

నాదెండ్ల మండలం గణపవరంలో ఘటన

మృతికి కారణం తెలియదంటున్న తల్లిదండ్రులు  

యడ్లపాడు (చిలకలూరిపేట): ప్రపంచాన్ని పరిచయం చేసిన తల్లిదండ్రుల వద్ద నుంచే ఈ లోకానికి శాశ్వత వీడ్కోలు పలకాలని భావించాడో.. తన జీవితంలోని చివరి రోజు అమ్మనాన్నల వద్దనే ముగించుకుంటే ఆత్మశాంతి లభిస్తుందనుకున్నాడో తెలియదు గాని.. మనసు గాయపడి.. మనస్తాపంతో అమ్మ ఒడిలో ఉండాలన్న చివరి ఆశతో అమ్మ చీరనే మెడకు చుట్టుకుని ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన నాదెండ్ల మండలం గణపవరంలో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 13 ఏళ్ల కిందట వివాహమైన గూడూరు హనుమంతరావు(32), కరుణకుమారి దంపతులు పాత గుంటూరులోని చెన్నంవారి వీధిలో నివాసం ఉంటున్నారు.

 హనుమంతరావు ప్రైవేటు ఎలక్ట్రీషియన్‌ గానూ, భార్య ఇంటి వద్దనే టైలరింగ్‌ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. హనుమంతరావు తల్లిదండ్రులు వెంకటేశ్వరరావు, పార్వతి 2006లో నాదెండ్ల మండలలోని గణపవరం గ్రామానికి ఉపాధి కోసం వలస వచ్చారు. స్థానికంగా ఉన్న నూలుమిల్లులోనే కూలి పనులు చేసుకుంటూ మిల్లు సమీపంలోని సినిమాహాలు సెంటర్లో ఓ రేకుల ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. హనుమంతరావు తల్లిదండ్రుల వద్దకు అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తుండేవాడు. సోమవారం ఉదయం ఏడు గంటల సమయంలో హనుమంతరావు తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి నాదెండ్ల గ్రామంలోనే తనకు కరెంటు పని దొరికిందని, 10 గంటలకు వారి వద్దకు వస్తున్నట్టు చెప్పాడు. దీంతో వృద్ధులిద్దరూ పనికి వెళ్తూ తాళం అందుబాటులో ఉంచారు.

 మధ్యాహ్నం భోజనానికి ఇంటికొచ్చి ఇంటి తలుపులు తీయగా కొడుకు హనుమంతరావు రేకులకు వేసిన దూలానికి చీరతో ఉరివేసుకుని విగతజీవిలా కనిపించేసరికి తల్లిదండ్రులిద్దరూ గుండెలు బాదుకుంటూ కన్నీరు మున్నీరుగా విలపించారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. చిలకలూరిపేట రూరల్‌ సీఐ ఎస్‌.విజయచంద్ర, ఎస్‌ఐ ఎస్‌.రామాంజనేయులు, పీఎస్‌ఐ మధుసూదన్‌ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలను తెలుసుకున్నారు. కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిలకలూరిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడికి కుమారుడు(11), కుమార్తె(9) ఉన్నారు. వెంకటేశ్వరరావు, పార్వతి దంపతుల ఇద్దరు కుమారుల్లో మొదటి వాడు ఆరేళ్ల కిందట అనారోగ్యంతో మరణించాడు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top