ఊరు దాటి బయటకు వెళ్లగలనా అనుకున్నా

Malawath Poorna Who Made History As A Teenager Ascending Mount Everest Interacted With Students - Sakshi

నేడు విమానాల్లో ప్రయాణం చేస్తున్నా- మలావత్‌ పూర్ణ 

సాక్షి, విశాఖపట్నం : ‘నాకు చిన్నతనంలో మాట్లాడడమే భయంగా ఉండేది. ఈ రోజు గొప్ప వ్యక్తుల మధ్య కూర్చున్నా. నా చిన్నప్పుడు మా ఊరు దాటి వెళ్లగలనా అనుకునేదాన్ని. కానీ దృఢ సంకల్పంతో అడుగులు వేశా. అనుకున్నది సాధించా. నేడు విమానాలపై ప్రయాణించే స్థాయికి ఎదిగా. చాలా ఆనందంగా ఉంది’ అని చెప్పారు ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించిన చిన్న వయస్కురాలిగా చరిత్ర సృష్టించిన మలావత్‌ పూర్ణ. తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల కార్యదర్శి డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌తో కలసి శనివారం ఆమె నగరానికి వచ్చారు. ఈ సందర్భంగా వుడా చిల్డ్రన్‌ థియేటర్‌లో శ్రీప్రకాష్‌ విద్యానికేతన్‌ ఆధ్వర్యంలో ఆమెకు ఘన సత్కారం జరిగింది. మధ్యాహ్నం చంద్రంపాలెం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను ఆమె సందర్శించి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన నాటి జ్ఞాపకాలను విద్యార్థులతో పంచుకున్నారు. నాకు ఎంతో మంది సలహాలు, శిక్షణ ఇచ్చారు అని తన గతాన్ని పిల్లలకు వివరించారు.

కష్టపడి పనిచేస్తే లక్ష్యం చేరుకోగలమని, విద్యార్థి దశ నుంచే మంచి లక్ష్యాన్ని ఏర్పచుకోవాలని సూచించారు. విద్యార్థినులు బాల్య వివాహాలకు దూరంగా ఉండాలని చెప్పారు. చిటపట చినుకులు పడుతున్నా గాని విద్యార్థులంతా పూర్ణ సందేశాన్ని శ్రద్ధగా విన్నారు. చంద్రపాలెం పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తున్న మాజీ పోలీసు అధికారి టీఎస్‌ఆర్‌ ప్రసాద్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నవోదయ విద్యాలయాల జాయింట్‌ కమిషనర్‌ ఏఎన్‌ రామచంద్ర, శ్రీ ప్రకాశ్‌ విద్యా సంస్థల చైర్మన్‌ చిట్టూరి వాసు ప్రకాష్, ప్రిజమ్‌ బుక్స్‌ పబ్లిషర్స్‌ రవీంద్ర, జిల్లా బాస్కెట్‌ బాల్‌ అసోసియేషన్‌ కార్యదర్శి రామయ్య, హెచ్‌ఎంలు ఎం.రాజబాబు, జయప్రద ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వుడా చిల్ట్రన్‌ థియేటర్‌లో జరిగిన కార్యక్రమంలో శ్రీప్రకాష్‌ విద్యానికేతన్‌ డైరెక్టర్‌ వాసు ప్రకాష్‌ మాట్లాడుతూ 13 ఏళ్ల వయసులో పూర్ణ ఎవరెస్ట్‌ శిఖరాన్ని ఎక్కాలనుకోవడం..సాధించడం చాలా గొప్ప విషయమని కొనియాడారు. పిల్లలంతా మలావత్‌ లాంటి వారిని ఆదర్శంగా తీసుకొని ఏదైనా సాధించాలనే తపనతో ముందుకు సాగాలని చెప్పారు. 

అవరోధాలు దాటితేనే విజయం : ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌
అవకాశాలు ఎక్కడ ఉంటే అక్కడకు వెతుక్కుంటూ వెళ్లి వాటిని అందిపుచ్చుకోవాలని తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ చెప్పారు. చంద్రంపాలెం పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడారు. ఈ పాఠశాల కార్పొరేట్‌ బడులకంటే కంటే బాగుందని..అన్ని సదుపాయాలతో ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థులు అదృష్టవంతులని పేర్కొన్నారు. పిల్లలంతా మంచి లక్ష్యాన్ని ఏర్పరచుకుని చదవాలని చెప్పారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top