వీధి లైట్లు కావాలా... అయితే మీరే తెచ్చుకోండి

వీధి లైట్లు కావాలా... అయితే మీరే తెచ్చుకోండి - Sakshi


ఈయన పేరు జంబాపురం రామాంజనేయరెడ్డి. ఇటీవలి ఎన్నికలలో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ తరపున 3వ వార్డు కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. ఈయన వార్డులో మొత్తం 108 వీధి లైట్లు ఉన్నాయి.. చాలా లైట్లు వెలగడం లేదని వార్డు ప్రజలు ఈయనకు ఫిర్యాదు చేశారు. మున్సిపల్ అధికారులను అడిగితే లైట్లు లేవని.. మీరు తెచ్చుకుంటే వేస్తామని తెలిపారు. దీంతో రూ.6వేలు ఖర్చు పెట్టి దాదాపు 30 వీధి లైట్లను వార్డులో వే యించుకుంటున్నారు.

 

 ఈయన పేరు పాతకోట బంగారు మునిరెడ్డి. ఈయన సతీమణి కృష్ణవేణి వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ తరపున 28వ వార్డు కౌన్సిలర్‌గా ఇటీవల ఎన్నికయ్యారు. వీధిలైట్లు వెలగడం లేదని వార్డు ప్రజలు వీరి దృష్టికి తెచ్చారు. దీంతో బంగారు మునిరెడ్డి సొంత ఖర్చుతో 20 వీధి లైట్లను దుకాణంలో కోనుగోలు చేశారు. వీటిని మున్సిపల్ సిబ్బందికి ఇవ్వగా వార్డులో అమర్చారు.

 

 ప్రొద్దుటూరు : కడప కార్పొరేషన్ తర్వాత జిల్లాలో ప్రొద్దుటూరు మున్సిపాలిటీ అన్ని విధాలా పెద్దది. స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా కూడా ఉంది. సుమారు రూ.50కోట్ల నిధులు మున్సిపాలిటీలో మూలుగుతున్నాయి. అయితే వీధి లైట్లు మాత్రం లేవు. సాధారణంగా ట్యూబ్‌లైటు రూ.40, చౌక్ రూ.120 అవుతుంది.

 

 మున్సిపాలిటీలో ఇవి కూడా లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2010లో మున్సిపల్ పాలక వర్గం పదవీకాలం ముగిసింది. అప్పటి నుంచి స్పెషల్ అధికారుల పాలనలో నడుస్తోంది.  మున్సిపల్ అధికారులపై తరచూ ఆరోపణలు వస్తుండటంతో స్పెషల్ అధికారులు చాలా వాటికి ఆమోదం తెలపడం లేదు. గత జిల్లా జాయింట్ కలెక్టర్ నిర్మల హయాం నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతోంది. దీంతో నిధులున్నా నిరుపయోగంగా మారింది.  

 

 ఏడాది కాలంగా మున్సిపాలిటీలోని అనేక వార్డులలో వీధి లైట్లు వెలగడం లేదు. 40 వార్డుల పరిధిలో 5వేలకుపైగా వీధిలైట్లకు సంబంధించిన స్తంభాలు ఉన్నాయి. తమ వార్డులలో వీధి లైట్లు వెలగడం లేదని ప్రజలు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేయడం నిత్యకృత్యమైంది. తమ వద్ద వీధి లైట్లు లేవని, మీరు కొనుగోలు చేసి ఇస్తే  వాటిని అమర్చుతామని మున్సిపల్ సిబ్బంది చెబుతున్నారు.   ప్రస్తుతం కొత్తగా పాలక వర్గానికి సంబంధించిన కౌన్సిలర్లు ఎన్నికయ్యారు. అయితే ప్రభుత్వ నిర్ణయాల కారణంగా పాలకవర్గం ఏర్పాటులో  జాప్యం అవుతోంది.  ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఈనెల 19వ తేదీ ఉండటంతో తర్వాత పాలక వర్గం ఎన్నిక ఉంటుందని తెలుస్తోంది.

 

 కౌన్సిల్ ఆమోదం లేదు

 మున్సిపాలిటీలో వీధి లైట్ల  కొరత ఉన్నమాట వాస్తవమే. లైట్ల కొనుగోలుకు సంబంధించి ప్రతిపాదనలు పంపాం. కౌన్సిల్ ఆమోదం లేకపోవడంతో సమస్య అలాగే ఉంది. ఏడాది కాలంగా ఈ పరిస్థితి ఉంది.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top