గీర్వాణి జెడ్పీ చైర్‌పర్సన్ అయ్యేనా?

గీర్వాణి జెడ్పీ చైర్‌పర్సన్ అయ్యేనా?


- అభ్యర్థిత్వంపై ‘గాలి’ వ్యతిరేకత

- రెడ్డి లేదా బీసీకి ఆ పదవి ఇవ్వాలని పట్టు

- డోలాయమానంలో చంద్రబాబు


 సాక్షి, చిత్తూరు: చిత్తూరు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ అభ్యర్థిని గా గీర్వాణి చంద్రప్రకాశ్‌ను తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. ఈ నెల 5న చైర్‌పర్సన్‌గా ఆమె ఎన్నికకానున్నారు. ఈ క్రమంలో గీర్వాణి చంద్రప్రకాశ్‌పై అసమ్మతి రాగం ఊపందుకుంది. చివరకు సామాజిక సమీకరణలు, పార్టీలోని అంతర్గత విభేదాలు ఆమె ఎన్నికకు అడ్డుపడతాయా ? అని ఆ పార్టీలోనే జోరుగా చర్చ జరుగుతోంది.

 

చిత్తూరు రూరల్ జెడ్పీటీసీ సభ్యురాలిగా గీర్వాణి గెలుపొందారు. ఎన్నికల సమయంలో తానే చైర్‌పర్సన్ అభ్యర్థి అని గీర్వాణి ప్రచారం చేసుకున్నారు. శుక్రవారం తన ఎన్ని కకోసం అభ్యర్థులను సమీకరించుకోవడం, ఎలాంటి ఆటంకాలు లేకుండా సజావుగా ఎన్నిక ప్రక్రియ సాగేందుకు అసమ్మతి రాగం వినిపించేవారిని బుజ్జగించే కార్యక్రమాల్లో చంద్రప్రకాశ్ బిజీగా ఉన్నారు. అయితే టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దొరబాబు మద్దతు ప్రకటించిన గీర్వాణి అభ్యర్థిత్వాన్ని మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది.



అందుకు కారణం ఎమ్మెల్సీ పదవి రేసులో ఉన్న గాలి ముద్దు కృష్ణమనాయుడుకు ఆ పదవిదక్కకుండా దొరబాబు ప్రయత్నిస్తున్నారని గాలి భావించినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. గీర్వాణి అభ్యర్థిత్వానికి చివర్లో గాలి అడ్డుపడుతున్నట్లు తెలుస్తోంది. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని కార్వేటి నగరం జెడ్పీటీసీ సభ్యురాలు గీతను చైర్‌పర్సన్‌గా ఎన్నుకుంటే బాగుంటుందని చంద్రబాబుకు గాలి సూచించినట్లు తెలుస్తోంది. దీనికి సామాజిక కారణాలు సాకుగా చూపించినట్లు సమాచారం. గాలి సిఫారసుకు మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కూడా వత్తాసు పలికినట్లు తెలిసింది.

 

చంద్రబాబుకు బొజ్జల, గాలి సూచనలు

‘జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాల్లో 6చోట్ల టీడీపీ గెలిచింది. అందులో ఇద్దరు బలిజ సామాజిక వర్గం నుంచి గెలుపొందారు. రెడ్డి, కమ్మ, ఎస్సీ, బీసీ సామాజిక వర్గాల నుంచి ఒక్కో ఎమ్మెల్యే గెలుపొందారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున రెడ్డి సామాజిక వర్గం నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇద్దరు ఎస్సీ సామాజికవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ ఓటమిపాలైన పుంగనూరు, మదనపల్లె, పీలేరు, నగరి, పలమనేరు నియోజకవర్గాల నుంచి రెడ్డి సామాజికవర్గానికి చెంది న మహిళను చైర్‌పర్సన్ చేస్తే బాగుంటుంది.  



ఆ నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేయడంతో పాటు రెడ్డి సామాజికవర్గానికి ప్రాధాన్యం ఇచ్చినట్లు అవుతుంది’ అని చంద్ర బాబు కు బొజ్జల, గాలి సూచించినట్లు తెలిసింది. రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వలేని పక్షంలో నగరి, గంగాధర నెల్లూరు ఎమ్మెల్యేలు కూడా వైఎస్సార్‌సీపీ తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్నారని, ఈ నియోజకవర్గాల నుంచి బీసీ అభ్యర్థిని చైర్‌పర్సన్ చేస్తే బాగుంటుందని సూచించినట్లు తెలుస్తోంది. చైర్‌పర్సన్ స్థానం ఓసీ మహిళకు రిజర్వ్ అయినా టీడీపీ బీసీ మహిళను చైర్‌పర్సన్ చేసిందనే ప్రచారం పార్టీకి లాభిస్తుందని చెప్పినట్లు తెలిసింది. అంతేగాక కమ్మ సామాజిక వర్గం తరఫున చంద్రబాబు ఎమ్మెల్యేగా ఎన్నిక కావడమేగాకుండా, సీఎం పదవీ ఉందని, ఈ దశలో అదే సామాజిక వర్గానికి జెడ్పీ చైర్‌పర్సన్ పీఠం ఇవ్వకుంటేనే బాగుం టుందని కూడా సూచించినట్లు తెలిసింది.



చిత్తూరుకు ఎమ్మెల్యే, ఎంపీతో పాటు కార్పొరేషన్‌లో మేయర్ పదవి కూడా టీడీపీకి దక్కాయని, ఈ క్రమంలో చిత్తూరు రూరల్‌కు జెడ్పీ చైర్‌పర్సన్ పదవి ఇచ్చేదానికంటే పార్టీ అభ్యర్థులు ఓడిపోయిన స్థానాలపై దృష్టి సారిస్తే బాగుంటుందని వివరించినట్లు తెలిసింది. ఈ వివరాలన్నీ ఆలకించిన చంద్రబాబు జెడ్పీ ఎన్నికపై చివర్లో డోలాయమానంలో ఉన్నట్లు తెలిసింది. చివరి వరకూ చైర్‌పర్సన్ అభ్యర్థిగా గీర్వాణిని ప్రకటించి, చివర్లో ‘కుదరదు..మరో అభ్యర్థి’ అంటే గీర్వాణి వర్గం ఎలా జీర్ణించుకుంటుందనే విషయాన్ని కూడా చంద్రబాబు సీరియస్‌గా ఆలోచిస్తున్నట్లు తెలిసింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top