చిరుతపులి బీభత్సం

Leopard in Atreyapuram East Godavari - Sakshi

నలుగురికి గాయాలు

చెట్టెక్కిన చిరుత ...  రాత్రంతా అక్కడే...

భయాందోళనలో అంకంపాలెం ప్రజలు

తూర్పుగోదావరి, ఆత్రేయపురం (కొత్తపేట): అంకంపాలెం గ్రామంలో సోమవారం చిరుతపులి సంచారంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. చిరుత దాడి చేయడంతో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గ్రామంలో చిరుత యథేచ్ఛగా సంచరించి ఒక కొబ్బరి చెట్టుపైకి ఎక్కి కూర్చుంది. వశిష్టా నదికి ఆనుకుని ఉన్న ఈ గ్రామంలోని పొలంలో సాగు పనులు చేస్తున్న రైతు మెర్ల సూరిబాబు తొలుత చిరుతపులిని చూశాడు. ఈ విషయంలో దావాలనంగా వ్యాప్తించడంతో గ్రామస్తులు ఆందోళన చెందారు. చిరుతపులి దాడి చేయడంతో గ్రామానికి చెందిన భీమిరెడ్డి తల్లిబాబు, యడ్ల చిట్టిబాబు, కరుటూరి నరేష్, వనచర్ల దుర్గా ప్రసాద్‌ గాయపడ్డారు. వీరిలో ఇద్దరు కొత్తపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

తీవ్రంగా గాయపడ్డ మరో ఇద్దరిని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అమలాపురం డీఎస్పీ రమణ ఆధ్వర్యంలో పోలీసులు గ్రామానికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు. కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి కాకినాడలో జిల్లా ఫారెస్టు అధికారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లి అటవీ శాఖ అధికార్లను అప్రమత్తం చేశారు. గోకవరం ఫారెస్టు రేంజర్, ఇతర శాఖాధికారులకు సైతం విషయాన్ని ఆయన తెలియజేసి ప్రజలను కాపాడవల్సిందిగా కోరారు. దీంతో చిరుతపులిని పట్టుకునేందుకు అటవీ శాఖకు చెందిన నిపుణులైన సిబ్బంది కోసం పోలీసులు, ప్రజలు నిరీక్షిస్తున్నారు. వారు రాత్రి 8 గంటలకు కూడా గ్రామానికి చేరుకోలేదు. చీకటి పడడంతో కొబ్బరి చెట్టుపై ఉన్న పులిని పట్టుకోవడానికి సాధ్యం కాదని పోలీసులు చెబుతున్నారు. దీంతో గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. తెల్లవారితే తప్ప చిరుతపులిని పట్టుకునే అవకాశాలు లేవని వారు ఆందోళన చెందుతున్నారు. గ్రామం గోదావరికి చేరి ఉండటంతో చిరుతపులి సుదూర ప్రాంతం నుంచి వచ్చిందని భావిస్తున్నారు.

గతంలో రాజమహేంద్రవరంలో..
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్‌): గతంలో చిరుతపులులు రాజమహేంద్రవరం నగరంలోకి ఒకసారి, ఓఎన్జీసీ బేస్‌కాంప్లెక్స్‌లో రెండుసార్లు, గతేడాది ఒకసారి సంచరించాయి. 2008లో లలితానగర్‌లోని ఒక ముస్లింల ఇంటి బాత్‌రూంలోకి చిరుతపులి చొరబడింది. ఈ సంఘటనతో నగర ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఏజెన్సీ నుంచి కర్రల లోడు లారీలో ఎక్కిన పులి ఇలా వచ్చి ఉంటుందని అధికారులు భావించారు. అప్పటిలో ఆ పులికి మత్తు ఇంజక్షన్‌ ఇచ్చి అడవిలో వదిలేశారు. ఆ తరువాత కొద్దిరోజులకు ఓఎన్జీసీ బేస్‌ కాంప్లెక్స్‌లోని అప్పటి సంస్థ ఎసెట్‌ మేనేజర్, ఈడీ ఏఏ ఖాన్‌ పెంపుడు కుక్కను చిరుతపులి గాయపరిచింది. సీసీ కెమేరా పుటేజీలో అసెట్‌ మేనేజర్‌ ఇంటిపై వాటర్‌ ట్యాంకు వద్ద పులి సంచరించినట్టు కనిపించింది. ఫారెస్టు అధికారులు వారం రోజులు చిరుత కోసం బోనులు ఏర్పాటు చేసి జల్లెడ పట్టారు. చివరికి బోనులోకి పులి చిక్కింది. ఆ తరవాత ఓఎన్జీసీ బేస్‌ కాంప్లెక్స్‌లో చిరుత సంచరించినట్టు సమాచారం వచ్చినా పులి ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు.  

ప్రభుత్వాస్పత్రిలో క్షతగాత్రులకు చికిత్స
రాజమహేంద్రవరం క్రైం: ఆత్రేయపురం మండలం అంకంపాలెంలో చిరుత పులి దాడిలో గాయపడిన వ్యాన్‌ డ్రైవర్‌ యడ్ల చిట్టిబాబు, భీమిరెడ్డి తల్లిబాబు, కరుటూరి నరేష్‌ నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చిరుత దాడిలో చిట్టిబాబు భుజంపై తీవ్ర గాయమైంది. భీమిరెడ్డి తల్లి బాబుకు స్వల్ప గాయం, నరేష్‌కు చాతీ భాగంలో గాయమైంది. వీరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top