ఆఖరి అవకాశం

Last Chance For Voter Lists Checking - Sakshi

ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు

ఈనెల 15వ తేదీ వరకు అవకాశం

జిల్లాలో 17,33,667 మంది ఓటర్లు

నామినేషన్లు ముగిశాక తుది  ఓటర్ల జాబితా

విజయనగరం గంటస్తంభం: జిల్లాలో ప్రస్తుతం 17,33,667మంది ఓటర్లు నమోదయ్యారు. చేర్పులు, తొలగింపుల పక్రియ ఇంకా జరుగుతుండటంతో నామినేషన్ల ఘట్టం ముగిశాక తుది ఓటర్ల జాబితా తయారు కానుంది. అప్పటికి ఓటర్ల సంఖ్య ఎంతకు చేరుతుందో చూడాలి.

ఓటర్ల జాబితాలో విశేషాలు
జిల్లాలో తాజా ఓటర్ల జాబితా ప్రకారం చూస్తే మరోసారి మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంది. పురుషులు కంటే 19,895మంది ఎక్కువ ఉండటం విశేషం.
మొత్తం జిల్లాలో అంచనా ప్రకారం 24,24,954 మంది జనాభా ఉన్నారు. ఇందులో 17,33,667 ఓటర్లుగా ఉండటం విశేషం. ఎన్నికల సంఘం అంచనా ప్రకారం మొత్తం జనాభాలో 67శాతం ఓటర్లుగా ఉండాలి. కానీ జిల్లాలో 71 శాతం ఉండటం విశేషం.
గతేడాది కంటే జిల్లాలో 88,517 మంది ఓటర్లు పెరిగారు. గతేడాది జనవరిలో ప్రచురించిన జాబితాలో 16,45,150 ఓటర్లు ఉన్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో 17.16 లక్షల మంది ఓటర్లు ఉండగా ఇప్పుడు సుమారు 17వేల మంది ఓటర్లు పెరగడం విశేషం.
థర్డ్‌ జెండర్‌ ఓట్లలో గతంలో 150 వరకు ఉండగా ఈసారి తగ్గి 118 మాత్రమే ఉన్నాయి.
జిల్లాలో తొమ్మిది నియోజకవర్గాల్లో చూస్తే విజయనగరంలో అత్యధికంగా 2,10,722 ఉండగా అత్యల్పంగా పార్వతీపురంలో అత్యల్పంగా 1,75,625 ఓట్లు ఉన్నాయి.
జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో పురుషులు కంటే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉండగా చీపురుపల్లిలో మాత్రం మహిళల కంటే పురుష ఓటర్లు అధికంగా ఉండటం విశేషం.  

చేర్పులు, తొలగింపులపై కసరత్తు
జనవరి 11 తర్వాత ఓట్ల నమోదు, తొలగింపులకు వచ్చిన దరఖాస్తులను విచారిస్తున్నారు. ఇప్పటివరకు ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్‌లైన్‌లో ఓటు నమోదుకు సంబంధించి ఫారం–6 దరఖాస్తులు 63,679 రాగా తొలగింపునకు సంబంధించి ఫారం–7 దరఖాస్తులు 33,073 వచ్చాయి. ఓటు నమోదుకు 57,946 అనుమతించారు. కేవలం 1930 దరఖాస్తుల్ని మాత్రమే తిరస్కరించారు. విచారణ జరపాల్సిన దరఖాస్తులు ఇంకా 3803 ఉన్నాయి.  తొలగింపునకు వచ్చిన ఫారం–7 పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఇప్పటివరకు 33,073 దరఖాస్తులు రాగా అందులో కేవలం 4284 దరఖాస్తులను మాత్రమే అనుమతించారు. 27,360 దరఖాస్తులను ఏకంగా తిరస్కరించారు. మరో 1429 విచారణ చేయాల్సి ఉన్నందున పెండింగ్‌లో ఉన్నాయి. తొలగింపునకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ నిలుపు చేశారు. నమోదుకు మాత్రం ఈనెల 15 వరకు స్వీకరిస్తారు. ఇవన్నీ విచారించిన తర్వాత తుది ఓటర్ల జాబితా తయారవుతుంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top